Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి శిక్షణ శిబిరాలు ఆరంభం
- శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి వెల్లడి
నవతెలంగాణ, హైదరాబాద్: 36వ జాతీయ క్రీడల్లో టాప్-3లో చోటే లక్ష్యంగా రాష్ట్ర క్రీడాకారులను సన్నద్ధం చేస్తున్నామని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. ఎల్బీ స్టేడియంలోని శాట్స్ కార్యాలయంలో శాట్స్, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ సంయుక్తంగా బుధవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ' జాతీయ క్రీడలకు తెలంగాణ నుంచి 230 మంది అథ్లెట్లు ప్రాతినిథ్యం వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులకు ప్రయాణ ఖర్చులు, వ్యక్తిగత కిట్లు, సన్నాహక శిబిరాల ఏర్పాటు కోసం ఇప్పటికే రూ.29 లక్షలు కేటాయించింది. పతకాలు సాధించిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు ప్రకటించేందుకు ప్రతిపాదనలు పరిశీలిస్తున్నాం. త్వరలోనే క్రీడాశాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అధికారికంగా ప్రకటన చేస్తారు. జాతీయ క్రీడలకు క్రీడాకారులను సిద్ధం చేసేందుకు గత కొద్దికాలంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ కోచ్లు, ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు చాలా శ్రమిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకొని క్రీడాకారులు కష్టపడి పతకాలు సాధించాలి. కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ టాప్-2లో నిలిచింది. జాతీయ క్రీడల్లో పతకాల పట్టికలో టాప్-3 లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకు అనుగుణంగా యంత్రాగం పనిచేస్తుంది. జాతీయ క్రీడలకు ఎంపికైన క్రీడాకారులకు క్రీడాంశాల వారీగా శిక్షణ శిబిరాలు నేటి నుంచి ఆరంభిస్తున్నామని' అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. శాట్స్ సహకారంతో ఒలింపిక్ అసోసియేషన్ తరఫున క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలంగాణ ఒలింపిక్ సంఘం (టిఓఏ) అధ్యక్షుడు వేణుగోపాలచారి అన్నారు. 'జాతీయ క్రీడల కోసం రూ.60 లక్షలు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఇప్పటికే రూ.29 లక్షలు శాట్స్కు కేటాయించారు, మరిన్ని నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సముఖంగా ఉంది. ఈ సారి షూటింగ్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, బాక్సింగ్, జిమ్నాస్టిక్స్లో పతక అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి' అని టిఓఏ కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఒలింపిక్ సంఘం కోశాధికారి మహేష్, రాష్ట్ర చెస్ సంఘం అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్, రాష్ట్ర ఫెన్సింగ్ సంఘం కోశాధికారి సందీప్ కుమార్, ఏకాగ్ర చెస్ అకాడమీ చైర్మన్ సందీప్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
త్వరలో గ్రాండ్మాస్టర్ల చెస్ టోర్నీ
తెలంగాణ చెస్ అసోయేషన్ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది ఆరంభంలో అంతర్జాతీయ సూపర్ గ్రాండ్ మాస్టర్ల చెస్ టోర్నీ నిర్వహణకు సన్నాహాకాలు చేస్తున్నట్టు నిర్వాహకురాలు పనాచా తెలిపారు. హైదరాబాద్ వేదికగా 2023, జనవరిలో జరిగే ఈ ఈవెంట్కు ప్రపంచ వ్యాప్తంగా 50 మంది అగ్రశ్రేణి గ్రాండ్మాస్టర్లు పాల్గొంటారు. హైదరాబాద్లో ఇప్పటివరకు ఈ తరహాలో భారీ చెస్ టోర్నమెంట్ చేయనుండటం ఇదే తొలిసారి కానుందని పనాచా వెల్లడించారు.