Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూల్స్ మార్పునకు సుప్రీంకోర్టు అనుమతి
- మళ్లీ జై షా, గంగూలీ ఎన్నికకు లైన్ క్లియర్
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సమూల సంస్కరణలు తిరోగమనం మొదలైంది!. క్రికెట్ పరిపాలనలో గుత్తాధిపత్యాన్ని బద్దలు కొడుతూ.. జస్టిస్ ఆర్ఎం లోధా కమిటీ చేసిన విప్లవాత్మక సిఫారసులు నీరుగారాయి!. క్రికెట్ పరిపాలనలో (రాష్ట్ర, బీసీసీఐ) ఇప్పటికే ఆరేండ్లకు పైగా కొనసాగుతున్న కేంద్ర హోం శాఖ మంత్రి తనయుడు జై షా, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సోదరుడు అరుణ్ కుమార్ ధుమాల్ సహా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ మరోసారి బీసీసీఐ ఆఫీస్ బేరర్లుగా ఎన్నికయ్యేందుకు మార్గం సుగమం అయ్యింది. రాజ్యాంగ సవరణలకు అనుమతి కోరుతూ బీసీసీఐ సుప్రీంకోర్టులో పిటిషను దాఖలు చేయగా.. అమీకస్క్యూరీ సూచనల మేరకు ద్విసభ్య ధర్మాసం అనుమతి మంజూరు చేసింది.
నవతెలంగాణ-న్యూఢిల్లీ
భారత క్రికెట్ పరిపాలనలో విప్లవాత్మక సంస్కరణలకు దారితీసిన రూల్స్ మార్పుపై బుధవారం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజుల పాటు వాదనలు విన్న జస్టిస్ డి.వై చంద్రచూడ్, జస్టిస్ హిమ కోహ్లిలతో కూడిన ద్వి సభ్య ధర్మాసనం పలు సవరణలకు అంగీకారం తెలిపింది. అమీకస్క్యూరీ, సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్ చేసిన ప్రతిపాదనలను ధర్మాసనం బీసీసీఐ ముందుంచింది!. బీసీసీఐ తరఫున భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. 2018 సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునకు మార్పులు చేయటంపై బిహార్ క్రికెట్ సంఘం తరఫున న్యాయవాది అఖిలేష్ కుమార్ పాండే అభ్యంతరం వ్యక్తం చేసినా, వాటిని ధర్మాసనం తోసిపుచ్చింది. బీసీసీఐ రాజ్యాంగ సవరణకు అనుమతి కోరుతూ దాఖలైన పిటిషనులో పూర్తి తీర్పు ప్రతి అధికారికంగా వెలువడాల్సి ఉంది.
ఆరు కాదు పన్నెండేండ్లు!
భారత క్రికెట్ పరిపాలన వ్యవస్థలో సమూల సంస్కరణల కోసం నివేదిక సమర్పించేందుకు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోధా అధ్యక్షతన అత్యున్నత న్యాయస్థానం కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. లోధా కమిటీ సిఫారసులను సుప్రీంకోర్టు ఆమోదించి, బీసీసీఐలో సంస్కరణల పర్వానికి తెరలేపుతూ 2018లో చారిత్రక తీర్పు వెలువరించింది. తాజాగా, ఆ తీర్పులో సవరణలు కోరుతూ బీసీసీఐ దాఖలు చేసిన పిటిషనుపై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. సుప్రీంకోర్టు ఆమోదం మేరకు రూపొందిన బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం.. ఏ వ్యక్తి వరుసగా ఆరేండ్లకు మించి క్రికెట్ పరిపాలన పదవుల్లో కొనసాగకూడదు. రాష్ట్ర స్థాయి, బీసీసీఐ స్థాయిలో కలిపి లేదా ఏ ఒక్క చోటైనా ఆరేండ్లకు మించి పదవిలో ఉండకూడదు. ఈ నిబంధనలో మార్పు చేయాలని బోర్డు కోరగా.. అందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. అమీకస్ క్యూరీ, సీనియర్ అడ్వకేట్ మణిందర్ సింగ్ పలు ప్రత్యామ్నాయ సూచనలు చేశారు. దాని ప్రకారం, రాష్ట్ర క్రికెట్ సంఘంలో వరుసగా ఆరేండ్లు పదవిలో కొనసాగిన వ్యక్తి.. మూడేండ్ల విరామం సమయం అవసరం లేకుండానే నేరుగా బీసీసీఐలో మరో ఆరేండ్లు పదవిలో ఉండవచ్చు. దీని ప్రకారం క్రికెట్ పరిపాలనలో (బీసీసీఐ, రాష్ట్ర స్థాయి) ఏకబికిన 12 సంవత్సరాలు పదవిలో కొనసాగవచ్చు. 12 ఏండ్ల తర్వాతనే మూడేండ్లు విరామం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ లోపు విరామం సమయం అక్కర్లేదు. ఈ నిబంధన అధ్యక్ష, కార్యదర్శి సహా కోశాధికారి, సంయుక్త కార్యదర్శి, ఉపాధ్యక్ష పదవులకు సైతం ఈ సవరణ వర్తించనుంది.
మరిన్ని సవరణలకు పచ్చజెండా!
సుప్రీంకోర్టు ఎదుట బీసీసీఐ వినిపించిన వాదనల ప్రకారం, మరిన్ని నిబంధనలు సైతం సరళతరం కానున్నాయి. బీసీసీఐ ఎన్నికల్లో పోటీచేసేందుకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, అఖిల భారత సర్వీస్ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు సహా పబ్లిక్ ఆఫీస్లో కొనసాగుతున్న వ్యక్తులు అనర్హులు. తాజా పిటిషన్లో పబ్లిక్ ఆఫీస్లో ఉన్నవారిని మినహాయించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. మాజీ క్రికెటర్లు చాలా మంది పబ్లిక్ ఆఫీస్లలో కొనసాగుతున్న ఉదహారణలను ధర్మాసనం ముందుంచిన సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా.. ఆ మేరకు మినహాయింపు పొందగలిగారు. మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో అనర్హత కొనసాగుతుంది. ఇక బీసీసీఐ ప్రతినిధిగా ఐసీసీకి నామినేట్ చేసే వ్యక్తి గరిష్ట వయసుపై పరిమితిని తొలగించేందుకు అంగీకారం తెలిపింది. దీంతో 70 ఏండ్లకు పైబడిన వ్యక్తులు సైతం బీసీసీఐ తరఫున ఐసీసీలో ప్రతినిధిగా కొనసాగవచ్చు. ఇక బోర్డు రాజ్యాంగ సవరణకు సుప్రీంకోర్టు అనుమతి తప్పనిసరి నిబంధనను తొలగించేందుకు ధర్మాసనం సుముఖత వ్యక్తం చేయలేదు. కానీ సుప్రీంకోర్టు 2018 తీర్పును ప్రభావితం చేయని అడ్మినిస్ట్రేటివ్ అంశాల్లో బీసీసీఐ ఏజీఎం రాజ్యాంగ సవరణ చేసుకునేందుకు వీలుగా అనుమతులు మంజూరు చేసింది.
మళ్లీ షా, గంగూలీ!
సుప్రీంకోర్టు తాజా తీర్పుతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పగ్గాలు జై షా, సౌరవ్ గంగూలీ గుప్పిట నిలుపుకోనున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం జై షా, గంగూలీ పదవీ కాలం ఏడాది క్రితమే ముగిసింది. అయినా, సుప్రీంకోర్టులో పిటిషను దాఖలు చేశామనే సాకుతో పదవుల్లో కొనసాగుతున్నారు. ఈ సెప్టెంబర్ ఆఖర్లో బీసీసీఐ ఎన్నికలు జరగాల్సింది. కానీ సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేశారు. జై షా తిరిగి ఎన్నికయ్యేందుకు ప్రధాన అడ్డంకిగా నిలిచిన మూడేండ్ల విరామ సమయంపై సుప్రీంకోర్టు సవరణకు అంగీకారం తెలపటంతో.. అక్టోబర్లో బోర్డు ఏజీఎం సమావేశం కానుంది. ఏజీఎంలో కేంద్ర హోం మంత్రి తనయుడు జై షా, కేంద్ర క్రీడా శాఖ మంత్రి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సోదరుడు అరుణ్ కుమార్ ధుమాల్ (కోశాధికారి) సహా భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐ ఆఫీస్ బేరర్లుగా మళ్లీ మూడేండ్ల పాటు ఎన్నిక కానున్నారు!.