Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెన్నిస్ లావర్ కప్ తర్వాత
స్విట్జర్లాండ్: టెన్నిస్ రారాజు, మాజీ నంబర్‌వన్, 20గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత, స్విట్జర్లాండ్‌కు చెందిన రోజర్ ఫెదరర్ ప్రొఫెషనల్ టెన్నిస్‌నుంచి వైదొలగనున్నట్లు గురువారం ప్రకటించాడు. లండన్ వేదికగా ఈ ఏడాది జరిగే లావర్ కప్ తర్వాత టెన్నిస్ క్రీడ నుంచి పూర్తిగా వైదొలగనున్నట్లు ట్విటర్ వేదికగా తెలిపాడు. '24ఏళ్ల సుదీర్ఘ ఆటలో భాగంగా తనకు బహుమతులు అందించిన టోర్నీ నిర్వాహకులు, పోటీదారులు, అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతోపాటు సహకరించిన కోచ్, ఇతర సభ్యులకు కృతజ్ఞతలు తెలిపాడు. నా భావోద్వేగ ప్రకటన మీలో నిరాశను కలిగించొచ్చు... కానీ ఎప్పుడో ఒకప్పుడు ఆటకు వీడ్కోలు పలకాల్సిందే.. లావర్ కప్ నా చివరి ఏటిపి టోర్నీ' అని తెలిపాడు. 'ప్రస్తుతం నా వయసు 41ఏళ్లు. కెరీర్లో 1500కు పైగా మ్యాచ్‌లు ఆడాను. నేను కన్న కలలకంటే టెన్నిస్ క్రీడ నన్ను బాగా ఆదరించింది. భవిష్యత్తులో మరికొన్ని టోర్నీలు ఆడతాను. కానీ అవి ఏటిపి, గ్రాండ్‌స్లామ్ టోర్నీలు మాత్రం కావు' అని ఫెదరర్ భావోద్వేగ ప్రకటనలో పేర్కొన్నాడు. 24ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో భాగంగా ఫెదరర్ ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు(20) నెగ్గిన తొలి ఆటగానిగా రికార్డును నెలకొల్పాడు. అరంగేట్రం నుంచి 103 కెరీర్ ఏటిపి టైటిళ్లను ముద్దాడాడు. ఇవాన్ లుబిసిక్, సెవెరిన్ లూటీల వద్ద శిక్షణ పొందిన ఫెదరర్ 1988లో ఫ్రొఫెషనల్ టెన్నిస్ క్రీడలో అరంగేట్రం చేశాడు. 2018లో 36ఏళ్ల వయసులో టాప్ ర్యాంక్‌ను కైవసం చేసుకొని అత్యధిక వయసులో ఆ ర్యాంక్‌లో నిలిచిన ఆటగానిగానూ మరో రికార్డు నెలకొల్పాడు. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ నిర్వాహకులు 2022 ఎడిషన్ సందర్భంగా జులైలో లండన్‌లోని సెంటర్ కోర్టులో 100 సంవత్సరాల వార్షికోత్సవానికి పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఫెదరర్‌ను ఘనంగా సన్మానించడం జరిగింది. స్విస్ ఐకాన్‌గా పేరొందిన ఫెదరర్.. 1526 సింగిల్స్, 223 డబుల్స్ మ్యాచ్‌లు ఆడాడు. జులై 7, 2021 వింబుల్డన్ క్వార్టర్ఫైనల్లో 3-6, 6-7(4), 0-6 తేడాతో హుబెర్ట్ హుర్కాజ్ చేతిలో ఓటమిపాలయ్యాడు. ఆ గ్రాండ్‌స్లామ్ టోర్నీ అనంతరం ఫెదరర్ టెన్నిస్ క్రీడకు దూరంగా ఉంటున్నాడు. ఫెదరర్ 20గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల రికార్డును నొవాక్ జకోవిచ్(21), రఫెల్ నాదల్(22) ఆ తర్వాత బ్రేక్ చేశారు. దిగ్గజ మహిళా టెన్నిస్ క్రీడాకారిణి, అమెరికాకు చెందిన సెరెనా విలియమ్స్ యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఓటమి అనంతరం టెన్నిస్‌నుంచి వైదొలిగిన కొద్దిరోజులకే ఫెదరర్ కూడా టెన్నిస్ క్రీడకు గుడ్‌బై చెప్పడం విశేషం.