Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కివీస్ ఆటగాడు నీషమ్ నిర్ణయం
క్రైస్ట్‌చర్చ్ : న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుకు ఊహించని ఎదురుదెబ్బ. స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్టు కాదనుకుని, గ్లోబల్ టీ20ల్లో ఆడేందుకు మార్గం సుగమం చేసుకుని సంచలనం సృష్టించాడు. ఆధునిక క్రికెట్లో క్రికెటర్లకు సరికొత్త దారి చూపించాడు!. ఇప్పుడు అదే దారిలో నడుస్తున్నాడు ఆ జట్టు ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు జేమ్స్ నీషమ్‌ను కేంద్ర కాంట్రాక్టు జాబితాలో చేర్చింది. అయితే, క్రికెట్ బోర్డు ఆఫర్‌ను నీషమ్ సున్నితంగా తిరస్కరించాడు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. వాస్తవానికి న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తొలుత నీషమ్‌ను జాబితా నుంచి తప్పించింది. తాజాగా, బోర్డు అతడికి కాంట్రాక్టు ఆఫర్ చేసినా ఇప్పుడు నీషమ్ తోసిపుచ్చాడు.
'జులైలో బోర్డు కాంట్రాక్టు ఒప్పందంపై సంతకం చేసేందుకు సిద్ధమయ్యాను. కానీ, ఆ జాబితాలో నాకు చోటు దక్కలేదు. దీంతో ఇతర గ్లోబల్ టీ20ల్లో ఆడేందుకు ఒప్పందాలు చేసుకున్నాను. ఇప్పుడు బోర్డు కాంట్రాక్టు ఇచ్చిందని, ఆ ఒప్పందాలను ఉల్లంఘించలేను. ఈ నిర్ణయం నన్ను దేశం కంటే డబ్బే ఎక్కువైందనే విమర్శలకు గురి చేస్తుందని తెలుసు. న్యూజిలాండ్‌కు ప్రాతినిథ్యం వహించటం నా కెరీర్లోనే గొప్పగా గర్వపడే విషయం. దేశం తరఫున, ప్రత్యేకించి మెగా టోర్నీల్లో ఆడేందుకు కట్టుబడి ఉన్నానని' నీషమ్ చెప్పుకొచ్చాడు. జేమ్స్ నీషమ్ ఆఫర్ తోసిపుచ్చటంతో.. సీమర్ బ్లేర్ టిక్నర్, ఫిన్ అలెన్‌లకు న్యూజిలాండ్ బోర్డు తొలిసారి కేంద్ర కాంట్రాక్టు అందజేసింది.