Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాతావరణ మార్పు కోసం బీసీసీఐ ఎదురు చూసింది
- కూలింగ్ ఆఫ్ రూల్ సడలింపుపై లోధా కమిటీ చీఫ్
నవతెలంగాణ-న్యూఢిల్లీ
భారత క్రికెట్ పరిపాలనలో కొందరు వ్యక్తుల గుత్తాధిపత్యానికి గండి కొడుతూ అమల్లోకి వచ్చిన లోధా కమిటీ సిఫారసులు.. ఏండ్లుగా వాస్తవ స్ఫూర్తి, స్వరూపం కోల్పోతూ వస్తున్నాయి!. 2013 ఐపీఎల్ స్ఫాట్ ఫికింగ్స్ కుంభకోణంలో జస్టిస్ ముకుల్ ముద్గల్ తొలుత నివేదిక తయారు చేశారు. భారత్‌లో క్రికెట్‌ను సవ్యంగా నిర్వహించేందుకు తగిన సిఫారసులు చేయాల్సిందిగా అత్యున్నత న్యాయస్థానం మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోధా అధ్యక్షతన కమిటీ వేసింది. భారత క్రికెట్లో వేళ్లూనుకున్న సమస్యలపై సమగ్ర అధ్యయనం చేసిన లోధా కమిటీ.. అధికారం కొందరు వ్యక్తుల చేతుల్లోనే ఉండటమే కారణమి నిర్ధారణకు వచ్చింది. అటువంటి పరిస్థితి భారత క్రికెట్ పరిపాలన వ్యవస్థలో తలెత్తకుండా ఉండేందుకు సమూల ప్రక్షాళనకు విప్లవాత్మక సిఫారసులు చేసింది. 2016 జులై 18న సుప్రీంకోర్టు తీర్పుతో లోధా కమిటీ సిఫారసులను ఆమోదించింది. సంస్కరణల్లో అత్యంత ముఖ్యమైన, గేమ్ ఛేంజర్ నిబంధన 'విరామ సమయం (కూలింగ్ ఆఫ్)'. తాజాగా ఈ నిబంధనను సడలిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ ఆర్ఎం లోధా స్పందించారు.
ఎదురుచూశారు : ' మూడేండ్ల విరామ సమయం క్రికెట్ పరిపాలకులకు మంచు పర్వతంగా కనిపించింది. ఆ నిబంధన ముందుండగా.. ఎటూ వెళ్లలేని, ఏం తెలియని పరిస్థితిని ఎదుర్కొన్నారు. అందుకే, వారు వాతావరణంలో మార్పు కోసం ఎదురుచూశారు. 2016 నుంచి అదే జరుగుతోంది. 2016, 2018 ఇప్పుడు 2022' అని జస్టిస్ లోధా అన్నారు. సుప్రీంకోర్టు లోధా కమిటీ సిఫారసులను తొలుత అంగీకరించింది. భారత క్రికెట్లోనే కాదు అన్ని వ్యవస్థల్లోనూ ప్రధాన సమస్య గుత్తాధిపత్యం. అధికారం కొందరి చేతుల్లోనే ఉండటంతో వ్యవస్థలో గుత్తాధిపత్యానాకి బీజం పడుతుంది. ఈ పరిస్థితిలో వ్యక్తులు మినహా వ్యవస్థలకు ఎటువంటి ఉపయోగం లేదు. అందుకే అధికారం క్రమం తప్పకుండా చేతులు మారాలి. అప్పుడే వ్యవస్థలపై వ్యక్తుల నియంత్రణ ఉండదు. అందుకోసమే విరామ సమయం ప్రతిపాదించాం. నిజానికి కమిటీ మూడేండ్లు పదవిలో కొనసాగితే, తర్వాతి మూడేండ్లు విరామ సమయంలోకి వెళ్లాలని సూచించింది. కానీ ఆ తర్వాత ఆ నిబంధనను 2018 ఆగస్టు 9న మార్పు చేశారు. వరుసగా ఆరేండ్లు పదవిలో కొనసాగిన తర్వాతే మూడేండ్లు పదవికి దూరంగా ఉండాలనే రూల్ తీసుకొచ్చారు. తాజాగా, వరుసగా 12 ఏండ్లు కొనసాగేందుకు అవకాశం కల్పించారని జస్టిస్ లోధా చెప్పారు. 2016 జులై 18, 2018 ఆగస్టు 9 తీర్పుల్లో పొరపాట్లు ఉన్నాయని సుప్రీంకోర్టు భావించినట్టు ఉంది. అందుకే, బీసీసీఐ నిబంధనలను సడలించేందుకు అంగీకారం తెలిపింది. విరామ సమయం నిబంధన అశ్రిత పక్షపాత, అవినీతి, గుత్తాధిపత్యం, విరుద్ధ ప్రయోజనాలకు విరుగుడుగా తీసుకొచ్చాం. పదవిలో వరుసగా కొనసాగించటమే ప్రధానం అనిపించిన ప్పుడు.. 6, 9, 12 ఏండ్లు అంటూ రూల్స్ ఎందుకు? కొనసాగింపు కోసం రూల్‌ను పక్కనపెట్టవచ్చు కదా? అని లోధా వ్యాఖ్యానించారు.
విరామ సమయం నిబంధన సడలింపు కోసం బీసీసీఐ తెలివిగా పావులు కదిపిందని అనుకుంటున్నారా? అని అడుగగా.. జస్టిస్ లోధా ఇలా బదులిచ్చారు. 'అరే భాయ్, బాస్ ఎవరనే విషయాన్ని బీసీసీఐ చూపించింది' అంటూ ముగించారు.
ఇక, సుప్రీంకోర్టు తాజా తీర్పుతో కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్ షా తనయుడు జై షా బీసీసీఐ ఆఫీస్ బేరర్‌గా మరో మూడేండ్ల పాటు కొనసాగేందుకు మార్గం సుగమం అయ్యింది. గుజరాత్ క్రికెట్ సంఘం (జీసీఏ), బీసీసీఐలో కలిపి ఇప్పటికే ఏడేండ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న జై షా నిబంధనల ప్రకారం పదవి నుంచి తప్పుకోవాలి. కానీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామనే సాకుతో, అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో పాటు జై షా సైతం బీసీసీఐ కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. అక్టోబర్‌లో బీసీసీఐ వార్షిక సర్వ సభ్య సమావేశం (ఏజీఎం) జరుగనుంది. ఏజీఎంలో జై షా, గంగూలీ మళ్లీ బీసీసీఐ అధికార పగ్గాలు అందుకోవటం లాంఛనమే కానుంది.