Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐసీసీ 2021 టీ20 ప్రపంచకప్, 2022 ఆసియా కప్. యుఏఈ వేదికగా జరిగిన ఈ రెండు మెగా ఈవెంట్లలో భారత్ టైటిల్ ఫేవరేట్‌గా బరిలో నిలిచి, గ్రూప్ దశను దాటలేదు. వరుస టోర్నీల్లో అదే టాప్-3 బ్యాటర్లపై నమ్మకం ఉంచిన జట్టు మేనేజ్మెంట్ ఫలితాన్ని అదే రుచిచూసింది. ఐసీసీ టైటిల్ కోసం దశాబ్దానికి పైగా నిరీక్షిస్తున్న టీమ్ ఇండియా.. అక్టోబర్‌లో మరోసారి ప్రయత్నం చేయనుంది. 2022 టీ20 ప్రపంచకప్ ముంగిట ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో పొట్టి సిరీస్‌లు ఆడనుంది. మంగళవారం ఆస్ట్రేలియాతో తొలి టీ20 నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో పలు అంశాలపై మాట్లాడాడు.
- కెఎల్ రాహుల్‌కు పూర్తి మద్దతు
- భారత కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యలు
నవతెలంగాణ-మొహాలి
విరాట్ మూడో ఓపెనర్
'జట్టులో వీలైనని ఎక్కువ వనరులు అందుబాటులో ఉండటం ఎల్లప్పుడూ మంచిదే. ప్రపంచకప్ వంటి టోర్నీకి వెళ్తున్నప్పుడు అది మరింత ప్రధానం. జట్టులో ఫ్లెక్సిబిలిటీ ఉండాలని అనుకున్నాం. జట్టులోని ప్రతి ఆటగాడు ఉత్తమ ఫామ్‌లో ఉండాలని కోరుకుంటాం. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలనే అనుకుంటాం. మా వరకు, ఏదైనా కొత్త దాని కోసం ప్రయోగం చేస్తాం. అంతమాత్రాన, అదే శాశ్వతం కాదు. ఆటగాడి నాణ్యతను అర్థం చేసుకునేందుకు అలా చేస్తాం. కచ్చితంగా, ఆ ప్రయోగం ఫలిస్తే కొత్త ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. జట్టులో మూడో ఓపెనర్ లేడనే విషయం మాకు తెలుసు. విరాట్ కోహ్లి మూడో ఓపెనర్‌గా సహజంగానే బ్యాటింగ్ చేస్తాడు. ఐపీఎల్లో ప్రాంఛైజీ తరఫున ఓపెనర్‌గా చక్కగా రాణించాడు. ఆసీస్, సఫారీలతో సిరీస్‌ల్లో విరాట్‌ను కొన్ని మ్యాచుల్లో ఓపెనర్‌గా పంపాలని కోచ్ ద్రవిడ్‌తో మాట్లాడాను. ఎందుకంటే, అతడు జట్టు మూడో ఓపెనర్. చివరి (అఫ్గనిస్తాన్) మ్యాచ్‌లో ఓపెనర్‌గా విరాట్ ఆట చూశాం. అతడి ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాం. కానీ ఓపెనర్ స్థానంపై ఎక్కువగా ప్రయోగాలు చేసేందుకు సిద్ధంగా లేమని' రోహిత్ శర్మ అన్నాడు.
రాహుల్ సత్తా మాకు తెలుసు
'ఓ ఆటగాడు గొప్పగా రాణించాడని, మరో ఆటగాడి ప్రదర్శనలను విస్మరించటం మంచి విషయం కాదు. మేము ఏం వండుతున్నామనే విషయం మాకు స్పష్టంగా తెలుసు. ఆ విషయం అందరికీ స్పష్టం చేయాలనేది నా ప్రయత్నం. ఇందులో ఎటువంటి గందరగోళానికి తావులేదు. కెఎల్ రాహుల్ సత్తా మాకు తెలుసు. జట్టుకు అతడు ఎంతో కీలకమైన ఆటగాడు, మ్యాచ్ విన్నర్. టాప ఆర్డర్లో కెఎల్ రాహుల్ భారత్‌కు ఎంతో కీలకం' అని రోహిత్ శర్మ తెలిపాడు.
ఆందోళన అవసరం లేదు
'బ్యాటింగ్‌లో దూకుడు మంత్ర కొనసాగుతుంది. ఈ వ్యూహంపై ఆరంభంలోనే స్పష్టంగా మాట్లాడుకున్నాం. అందరికీ ఆ విధానం సంతృప్తికరంగానే ఉంది. అదే సమయంలో మా సెకండ్ లైన్ డిఫెన్స్ అనే విషయం మాకు బాగా తెలుసు. ఈ విషయాలు చర్చించేందుకు విలువైన సమయం వెచ్చించాం. స్కోరు 10/3 ఉన్నప్పుడు, 50/0 ఉన్నప్పుడు ఏ విధంగా బ్యాటింగ్ చేయాలనే అంశాలపై అందరికీ మంచి స్పష్టత ఉంది. ఇక చేయాల్సింది, మైదానంలో అమలు పర్చటమే. ఆసియా కప్‌లోనూ మంచి స్కోర్లు సాధించాం. ఒక్క శ్రీలంకతో మ్యాచ్‌లోనే 173 పరుగులు చేశాం. అయినా, ఆ స్కోరు సైతం మంచిదే. ప్రతి మ్యాచ్‌లోనూ చివరి ఓవర్ వరకు రేసులో నిలిచాం. చివర్లో మ్యాచ్ ఫలితం ఎటువైపైనా మొగ్గుచూపవచ్చు. ఆసియా కప్‌లో ఫలితాలపై పెద్దగా ఆందోళన చెందటం లేదు' అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
అదృష్టం తోడవ్వాలి!
'ఆసియా కప్‌లో నిజంగానే మంచి క్రికెట్ ఆడాం. అటువంటి టోర్నీల్లో కాసింత అదృష్టం సైతం తోడవ్వాలి. వందకు వంద శాతం అక్కర్లేదు, కానీ కనీసం 5 శాతమైనా అదృష్టం తోడవ్వాలి. అది టాస్ కావచ్చు, రనౌట్ కావచ్చు. రానున్న ప్రపంచకప్‌లో అది జరుగుతుందని ఆశిస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లోనైనా దూసుకెళ్లి దూకుడుగా ఆడే విధానం మాకు మంచి విజయాన్నే అందించింది. ఆ విధానంలో ఆడుతూ జట్టులోని చాలా మంది విలువైన ఘనతలు సొంతం చేసుకున్నారు. అది గొప్ప సంకేతం, జట్టుకూ సంతోషకరం. దక్షిణాఫ్రికాతో సిరీస్ అనంతరం, మరో సమీక్ష సమావేశం నిర్వహించుకుంటాం. గత పది నెలల కాలంలో మా ప్రదర్శన ఎలా సాగిందనే విషయాన్ని సమీక్ష చేసుకుంటాం. ప్రపంచకప్‌లో ఏం చేయాలనే అంశంలో ఓ నిర్ణయానికి వస్తాం' అని రోహిత్ శర్మ వెల్లడించాడు.
కోహ్లి సరికొత్తగా..
ఆస్ట్రేలియాతో తొలి టీ20 ముంగిట విరాట్ కోహ్లి నెట్స్‌లో కఠోర సాధన చేశాడు. భారత ఆటగాళ్లు ఆదివారం మొహాలి స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. తొలి బ్యాచ్ ప్రాక్టీస్ సెషన్లోనే మైదానంలోకి వచ్చిన విరాట్ కోహ్లి.. పుల్ షాట్స్‌తో పాటు క్రీజు వదిలి స్పిన్నర్లపై ఎదురుదాడి చేసేందుకు ఆసక్తి చూపించాడు. పేసర్ల నుంచి ఎక్కువగా బౌన్సర్లు ఎదుర్కొన్న కోహ్లి.. వాటిని చూడచక్కని పుల్ షాట్లుగా మలిచాడు. ఇక స్పిన్‌పై క్రీజు వదిలి ముందుకొచ్చి ఆడాడు. టీ20ల్లో స్ట్రయిక్‌రేట్ మెరుగుపర్చుకునేందుకు కోహ్లి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆసియా కప్‌లో అఫ్గనిస్థాన్‌పై సెంచరీతో సుమారు మూడేండ్ల నిరీక్షణకు తెరదించిన విరాట్ కోహ్లి.. ఆస్ట్రేలియాతో సిరీస్‌లోనూ పరుగుల వరదకు సిద్ధమవుతున్నాడు. ఆ విషయం తొలి ప్రాక్టీస్ సెషన్లోనే స్పష్టంగా తెలియజేశాడు!.
యువీ, భజ్జీ స్టాండ్స్
పంజాబ్ క్రికెట్ సంఘం (పీసీఏ) దిగ్గజ ఆటగాళ్లను సముచితంగా గౌరవించేందుకు రంగం సిద్ధం చేసింది. భారత స్పిన్ దిగ్గజాలలో ఒకరైన హర్భజన్ సింగ్, 2011 వరల్డ్‌కప్ హీరో యువరాజ్ సింగ్ పేరిట మొహాలి మైదానంలో స్టాండ్స్ ఆవిష్కరించనున్నారు. సౌత్ పెవిలియన్‌కు హర్భజన్ సింగ్, నార్త్ పెవిలియన్‌కు యువరాజ్ సింగ్ పేర్లను ఖరారు చేశారు. భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ టాస్కు ముందు ఈ స్టాండ్స్‌ను ఆవిష్కరించనున్నారు. ' పంజాబ్ స్టార్ క్రికెటర్లను గౌరవించాలని నిర్ణయం తీసుకున్నాం. ఇతర రాష్ట్ర క్రికెట్ సంఘాలు ఈ పని ఇప్పటికే చేస్తున్నాయి. పంజాబ్ దిగ్గజ క్రికెటర్లకు సముచిత గౌరవం ఇవ్వాలని అనుకున్నాం. ఓ స్టాండ్‌కు దిగ్గజ క్రికెటర్ల పేరు పెట్టడం గొప్ప గౌరవం అని మా భావన' అని పీసీఏ కార్యదర్శి దిల్షేర్ ఖన్నా తెలిపారు.
షమి ఔట్, ఉమేశ్ ఇన్
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు సీనియర్ పేసర్ మహ్మద్ షమి దూరమయ్యాడు. టీ20 ప్రపంచకప్‌కు స్టాండ్‌బై ఆటగాడిగా నిలిచిన మహ్మద్ షమి కంగారూలపై మెరిసి ప్రధాన జట్టులోకి ప్రమోట్ కావటంపై కన్నేశాడు. కానీ భారత్, ఆస్ట్రేలియా సిరీస్ బబుల్‌లోకి ప్రవేశించడానికి ముందు మహ్మద్ షమి కోవిడ్-19 వైరస్ బారిన పడ్డాడు. దీంతో మహ్మద్ షమి స్థానంలో ఉమేశ్ యాదవ్‌ను భారత టీ20 జట్టులోకి ఎంపిక చేస్తూ బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. సుమారు రెండేండ్ల విరామం అనంతరం ఉమేశ్ యాదవ్ భారత్‌కు తొలి టీ20 ఆడేందుకు సిద్ధమవుతున్నాడు!.