Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరల్డ్‌కప్ సన్నద్ధతలో టీమ్ ఇండియా
- సవాళ్లను అధిగమించేందుకు చాన్స్
- నేడు ఆస్ట్రేలియాతో తొలి టీ20 పోరు
- రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
ఐసీసీ 2022 టీ20 ప్రపంచకప్ సన్నద్ధతకు, సవాళ్లను అధిగమించేందుకు భారత్‌కు ఇదే ఆఖరు అవకాశం!. వరుసగా రెండు మెగా టోర్నీల్లో టాప్-3 వైఫల్యంతో ఇంటిముఖం పట్టిన భారత్.. మరో మెగా టోర్నీలో భిన్నమైన ఫలితం కోసం ఎదురుచూస్తోంది. వరల్డ్‌కప్ ముంగిట భారత్ ఆరు టీ20 మ్యాచుల్లో ఆడనుంది. ఇక్కడే రోహిత్‌సేన సమస్యలకు పరిష్కారం అన్వేషించాలి. భారత్, ఆస్ట్రేలియా పొట్టి సిరీస్‌లో నేడు తొలి టీ20 పోరు.
నవతెలంగాణ-మొహాలి :
ద్వైపాక్షిక సిరీస్‌ల్లో అప్రతిహాత విజయాలు, టైటిల్ ఫేవరేట్ ట్యాగ్‌తో మెగా ఈవెంట్లలో అడుగుపెడుతున్న టీమ్ ఇండియా.. అనూహ్యంగా చేతులెత్తేస్తోంది!. 2021 ఐసీసీ టీ20 ప్రపంచకప్, 2022 ఆసియా కప్‌లో ఇది పునరావృతమైంది. మరోవైపు, టీ20 ప్రపంచకప్ ముంగిట వరుసగా ఏడు టీ20 సిరీస్‌ల్లో పరాజయాలు చవిచూసిన ఆస్ట్రేలియా.. యుఏఈలో చారిత్రక ప్రదర్శన చేసింది. టీ20 ప్రపంచకప్ చాంపియన్‌గా నిలిచింది. మరో నెల రోజుల్లో స్వదేశంలో టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న ఆస్ట్రేలియా.. మూడు మ్యాచుల కోసం భారత పర్యటనకు వచ్చింది. మొహాలిలో నేడు భారత్, ఆస్ట్రేలియా తొలి టీ20 సమరంలో తలపడనున్నాయి.
భారత్ ఎదుట ఐదు సవాళ్లు :
ఆస్ట్రేలియాతో సిరీస్‌లో భారత్ ఐదు సవాళ్లకు సమాధానాల కోసం అన్వేషించనుంది. టాప్ ఆర్డర్లో కెఎల్ రాహుల్ ఫామ్ ఆందోళనకు దారితీస్తోంది. ఆసియా కప్‌లో అతడు నిరాశపరిచాడు. వికెట్ నిలుపుకోవటంతో పాటు వేగంగా పరుగులు చేయటం జట్టు అతడికిచ్చిన బాధ్యత. రాహుల్ క్రమంగా విఫలమవుతూ, జట్టును ఆరంభంలోనే కష్టాల్లోకి నెడుతున్నాడు. ఈ సమస్యకు ఆసీస్‌తో సిరీస్‌లో చెక్ పడాలి. టాప్ ఆర్డర్ పవర్‌ప్లే ముగిసేలోపే కుప్పకూలిన సమయంలో.. మిడిల్ ఆర్డర్ అందుకు సిద్ధంగా ఉండాలి. ఇన్నింగ్స్ నిర్మాణంతో పాటు సహజశైలి దూకుడు చూపించాలి. సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యలు ఆసియాకప్‌లో ఈ పరీక్షలో విఫలమయ్యారు. తుది జట్టు ఎంపికలో రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్‌లలో ఒకరిని ఎంచుకోవటం చిక్కు ప్రశ్నగా మారింది. ఆసియాకప్‌లో కార్తీక్‌కు అవకాశం రాలేదు, అదే సమయంలో పంత్ తేలిపో యాడు. ఆసీస్‌తో సిరీస్‌లో కార్తీక్, పంత్ ఇద్దరికీ తుది జట్టులో చోటిచ్చి పరీక్షించే అవకాశం లేకపోలేదు. రవీంద్ర జడేజా గాయంతో దూరం కావటంతో స్పిన్ ఆల్‌రౌండర్ పాత్రపై అనుమానాలు మొదలయ్యాయి. దీపక్ హుడాను ఆ పాత్రలో చూసేందుకు జట్టు మేనేజ్మెంట్ సిద్ధమవుతుండగా.. అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ సైతం రేసులో ఉన్నారు. ప్రపంచకప్‌లో ప్రయోగాలకు తావులేకుండా.. ఆసీస్‌తో సిరీస్‌లోనే స్పిన్ ఆల్‌రౌండర్ ఎవరనేది తేల్చుకోవాల్సి ఉంది. చివరగా పేస్ విభాగం. జశ్ప్రీతు బుమ్రా లేని పేస్ దళం ఆసియా కప్‌లో తేలిపోయింది. బుమ్రా, హర్షల్ పటేల్ రాకతో పేస్ బౌలింగ్ పటిష్టం కానుంది. భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్‌లతో కలిసి బుమ్రా, హర్షల్‌లు పేస్ విభాగాన్ని మళ్లీ బలోపేతం చేయాలి. ఈ నలుగురు పేసర్లకు ఆస్ట్రేలియాతో సిరీస్ ఓ పరీక్షగా నిలువనుంది.
ఆ ముగ్గురు లేకుండానే..! :
ముగ్గురు కీలక ఆటగాళ్లు లేకుండా ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌లో బరిలోకి దిగుతోంది. విధ్వంసకర ఓపెనర్ డెవిడ్ వార్నర్ విశ్రాంతి తీసుకోగా.. మిచెల్ మార్ష్, మిచెల్ స్టార్క్‌లకు స్వల్ప గాయాలతో స్వదేశంలో రిహాబిలిటేషన్‌లో ఉన్నారు. ఈ ముగ్గురు లేని ఆసీస్ జట్టు అసంపూర్ణమే!. అయినా, మిచెల్ మార్ష్ స్థానాన్ని నం.3 బ్యాటర్ స్టీవ్ స్మిత్ భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. స్ట్రయిక్‌రేట్‌పై విమర్శలు ఎదుర్కొంటున్న స్మిత్.. భారత్‌పై బ్యాంగ్‌బ్యాంగ్ కోసం ఎదురుచూస్తున్నాడు. వరుసగా పేలవ ఫామ్‌తో వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కెప్టెన్ అరోన్ ఫించ్.. ఈ ఫార్మాట్లో పరుగుల వరద పారించాలని భావిస్తున్నాడు. గ్లోబల్ టీ20 లీగ్‌ల్లో ప్రదర్శనతో వెలుగులోకి వచ్చిన టిమ్ డెవిడ్.. భారత్‌తో సిరీస్‌లో ఆసీస్ తరఫున అరంగేట్రానికి సిద్ధమవుతున్నాడు. గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ వేడ్, పాట్ కమిన్స్, ఆడం జంపాలు ఆస్ట్రేలియాకు కీలకం కానున్నారు.
ముఖాముఖిలో.. :
భారత్, ఆస్ట్రేలియా పొట్టి ఫార్మాట్లో 23 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. అందులో 13 మ్యాచుల్లో టీమ్ ఇండియా విజయం సాధించింది. 9 మ్యాచుల్లో ఆస్ట్రేలియా పైచేయి సాధించగా, ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఇక భారత్‌లో జరిగిన మ్యాచుల్లో విచిత్రంగా ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. భారత్‌లో ఏడు మ్యాచులు ఆడగా ఆస్ట్రేలియా 4 మ్యాచుల్లో గెలుపొందగా, భారత్ మూడింట విజయం సాధించింది. ఇక భారత్‌లో భారత్‌పై ఆస్ట్రేలియాకు వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలుపు రికార్డు ఇంకా కొనసాగుతూనే ఉంది.
పిచ్, వాతావరణం :
మొహాలి పిచ్ సహజసిద్ధంగా పేసర్లకు కాస్త అనుకూలం. బ్యాటర్లకు సైతం ఇక్కడ షాట్ల ఎంపిక సులువే. నేడు టీ20 మ్యాచ్‌కు సైతం పిచ్ అదే తరహాలో స్పందించనుంది. అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత వాతావరణంలో.. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం తెరపైకి రానుంది. టాస్ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్‌కు మొగ్గు చూపవచ్చు. కానీ టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ కసరత్తు కోసం తొలుత బ్యాటింగ్ చేసేందుకు ఆసక్తి చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, దీపక్ హుడా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, జశ్‌ప్రీత్ బుమ్రా, యుజ్వెంద్ర చాహల్.
ఆస్ట్రేలియా : అరోన్ ఫించ్ (కెప్టెన్), మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్, టిమ్ డెవిడ్, కామెరూన్ గ్రీన్, పాట్ కమిన్స్, కేన్ రిచర్డ్సన్, ఆడం జంపా, నాథన్ ఎలిస్, సీన్ అబాట్.