Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్ష్యం 209. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం. అయినా, కాస్త కష్టపడితే కట్టడి చేయవచ్చు. మొహాలిలో భారత బౌలర్లు దారుణంగా నిరాశపరిచారు. అక్షర్ పటేల్ (3/17) మినహా అందరూ విఫలమయ్యారు. కామెరూన్ గ్రీన్ (61), మాథ్యూ వేడ్ (45 నాటౌట్) మెరుపులతో ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యం సొంతం చేసుకుంది. హార్దిక్ పాండ్య (71 నాటౌట్), కెఎల్ రాహుల్ (55), సూర్య (45) రాణించటంతో తొలుత భారత్ 208 పరుగులు చేసింది.
- 209 టార్గెట్‌ను ఊదేసిన ఆసీస్
- తొలి టీ20లో ఆస్ట్రేలియా గెలుపు
- పాండ్య, రాహుల్ మెరుపులు వృథా
నవతెలంగాణ-మొహాలి
తొలుత బ్యాటింగ్ చేసి బ్యాటర్లు భారీ స్కోరు అందించినా.. స్కోరు కాపాడుకోవటంలో బౌలర్లు షరా మామూలే అన్నట్టు చేశారు. భువనేశ్వర్ (0/52), చాహల్ (1/42), హర్షల్ (0/49) తేలిపోయారు. అక్షర్ పటేల్ (3/17)తో మ్యాచ్‌ను భారత్‌వైపు మలుపు తిప్పినా.. మిగతా బౌలర్లు అందరూ 11కు పైగా ఎకానమీతో పరుగులిచ్చి ఓటమికి కౌగిలించుకున్నారు!. 209 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలోనే ఊదేసిన ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. పించ్ హిట్టర్, ఓపెనర్ కామరూన్ గ్రీన్ (61, 30 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీతో చెలరేగగా, మాథ్యూ వేడ్ (45 నాటౌట్, 21 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఘనంగా ముగించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. హార్దిక్ పాండ్య (71 నాటౌట్, 30 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు), కెఎల్ రాహుల్ (55, 35 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూర్యకుమార్ యాదవ్ (46, 25 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరవటంతో 208 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఊదేశారు : ఛేదనలో ఆసీస్ ఆరంభం నుంచీ ఎదురుదాడి చేసింది. ఫించ్ (22), గ్రీన్ (61) శుభారంభం అందించారు. తొలిసారి ఓపెనర్‌గా వచ్చిన గ్రీన్ తొలి అర్థ సెంచరీతో సత్తా చాటాడు. గ్రీన్ ధనాధన్ షోతో ఆసీస్ లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. స్మిత్ (35) ఫర్వాలేదనిపించాడు. ఉమేశ్ ఓవర్లో స్మిత్, మాక్స్వెల్ (1) కార్తీక్ రివ్యూ నిపుణతకు వికెట్ కోల్పోయారు. అక్షర్ సైతం పరుగుల నియంత్రణ, వికెట్లతో భారత్‌ను రేసులో నిలిపాడు. కానీ టిమ్ డెవిడ్ (17, 10 బంతుల్లో 3 ఫోర్లు), మాథ్యూ వేడ్ (45 నాటౌట్) జోడీ భారత్ ఆశలు ఆవిరి చేసింది. భువనేశ్వర్ మరోసారి 19వ ఓవర్లో నిరాశపరిచాడు. మరో 4 బంతులు ఉండగానే కమిన్స్ (4 నాటౌట్) లాంఛనం ముగించాడు.
ఆ ముగ్గురు మెరువగా: రోహిత్ శర్మ (11), కోహ్లి (2) నిరాశపర్చగా.. ఓపెనర్ కెఎల్ రాహుల్ (55)తో కలిసి సూర్యకుమార్ యాదవ్ (46) ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. సూర్య దూకుడుగా ఆడగా, రాహుల్ సైతం దంచికొట్టాడు. ఈ జోడీ మూడో వికెట్‌కు 68 పరుగులు జోడించింది. 32 బంతుల్లోనే 3 ఫోర్లు, మూడు సిక్సర్లతో రాహుల్ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అలవోకగా సిక్సర్లు సంధించిన సూర్యకుమార్ అర్థ సెంచరీ ముంగిట వికెట్ కోల్పోయాడు. స్వల్ప వ్యవధిలో రాహుల్, సూర్య షోకు తెరపడింది. సూర్య నిష్క్రమించే సమయానికి భారత్ స్కోరు 126/4. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్య (71 నాటౌట్) అద్భుత ప్రదర్శన చేశాడు. ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 25 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడు. మరో ఎండ్‌లో అక్షర్ పటేల్ (6), దినేశ్ కార్తీక్ (6) నుంచి సరైన సహకారం లభించలేదు. అయినా, పాండ్య దూకుడు తగ్గలేదు. డెత్ ఓవర్లలో ఆసీస్ బౌలర్లపై విశ్వరూపం చూపించాడు. కామెరూన్ గ్రీన్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో చివరి మూడు బంతుల్ని సిక్సర్లుగా మలిచాడు. ఆసీస్‌పై టీ20ల్లో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు.
స్కోరు వివరాలు :
భారత్ ఇన్నింగ్స్ : రాహుల్ (సి) ఎలిస్ (బి) హజిల్‌వుడ్ 55, రోహిత్ (సి) ఎలిస్ (బి) హజిల్‌వుడ్ 11, కోహ్లి (సి) గ్రీన్ (బి) ఎలిస్ 2, సూర్య (సి) వేడ్ (బి)గ్రీన్ 46, హార్దిక్ నాటౌట్ 71, అక్షర్ (సి) గ్రీన్ (బి) ఎలిస్ 6,కార్తీక్ (ఎల్బీ) ఎలిస్ 6, హర్షల్ నాటౌట్ 7, ఎక్స్‌ట్రాలు : 4, మొత్తం :(20 ఓవర్లలో 6 వికెట్లకు) 208.
వికెట్ల పతనం : 1-21, 2-35, 3-103, 4-126, 5-146, 6-176.
బౌలింగ్ : హజిల్‌వుడ్ 4-0-39-2, కమిన్స్ 4-0-37-0, జంపా 4-0-36-0, ఎలిస్ 4-0-30-3, గ్రీన్ 3-0-46-1, మాక్స్వెల్ 1-0-10-0.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ : ఫించ్ (బి) అక్షర్ 22, గ్రీన్ (సి) కోహ్లి (బి) అక్షర్ 61, స్మిత్ (సి) కార్తీక్ (బి) ఉమేశ్ 35, మాక్స్వెల్ (సి) కార్తీక్ (బి) ఉమేశ్ 1, జోశ్ (బి) అక్షర్ 17, డెవిడ్ (సి) పాండ్య (బి) చాహల్ 18, వేడ్ నాటౌట్ 45, కమిన్స్ నాటౌట్ 4, ఎక్స్‌ట్రాలు : 8, మొత్తం :(19.2 ఓవర్లలో 6 వికెట్లకు) 211.
వికెట్ల పతనం : 1-39, 2-109, 3-122, 4-123, 5-145, 6-207.
బౌలింగ్ : భువనేశ్వర్ 4-0-52-0, ఉమేశ్ 2-0-27-2, అక్షర్ 4-0-17-3, చాహల్ 3.2-0-42-1, హర్షల్ 4-0-49-0, పాండ్య 2-0-22-0.