Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆట రూల్స్ మార్చిన ఐసీసీ
దుబాయ్ : వేగంగా మారుతోన్న ఆధునిక క్రికెట్లో అదే తరహాలో కాలనుగుణ మార్పులు చేసేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆసక్తి చూపిస్తోంది. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చైర్మన్‌గా కొనసాగుతున్న ఐసీసీ క్రికెట్ కమిటీ.. ఆట నిబంధనల్లో పలు మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు క్రికెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఐసీసీ ఆమోదించింది. నూతన నిబంధనలు అక్టోబర్ 1, 2022 నుంచి అమల్లోకి రానున్నాయి. ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ నూతన నిబంధనల ప్రకారమే జరుగనుంది. మేర్లీబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) సూచించిన సిఫారసులను ఐసీసీ క్రికెట్ కమిటీ పరిశీలించి ఆమోదం తెలిపింది. ఐసీసీ మార్పులు చేసిన రూల్స్ వివరాలు..
క్యాచౌట్ అయితే..! : బ్యాటర్ క్యాచౌట్‌గా నిష్క్రమిస్తే, కొత్త బ్యాటర్ నేరుగా స్ట్రయిక్ తీసుకోవాల్సి ఉంటుంది. క్యాచ్ సమయంలో స్ట్రయికర్, నాన్‌స్ట్రయికర్ పిచ్ సగానికి దాటేశారా లేదా అనేది అప్రస్తుతం. గతంలో క్యాచౌట్ను నాన్‌స్ట్రయికర్ అనుకూలంగా మలచుకునేవాడు. తర్వాతి బంతిని ఎదుర్కొనేవాడు. ఇప్పుడు ఆ రూల్‌ను తొలగించారు. ఓవర్ చివరి బంతికి క్యాచౌట్ మినహా కొత్త బ్యాటర్ నేరుగా స్ట్రయిక్ తీసుకోనున్నాడు.
ఉమ్మిపై నిషేధం : కోవిడ్ మహమ్మారి పరిస్థితుల్లో బంతిపై మెరుపు తగ్గించేందుకు ఆటగాళ్లు ఉమ్మి వాడటాన్ని నిషేధించారు. తాజాగా ఆ తాత్కాలిక నిషేధాన్ని శాశ్వత నిషేధంగా తేల్చారు. జులై 2020 నుంచి ఉమ్మిపై నిషేధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఉమ్మి స్థానంలో చెమటను వినియోగించుకునే వెసులుబాటు ఐసీసీ కల్పించింది.
90 సెకండ్లలో సిద్ధమవ్వాలి : కొత్త బ్యాటర్ క్రీజులోకి వచ్చి బంతిని ఎదుర్కొనే నిబంధనను ఐసీసీ సవరించింది. టెస్టులు, వన్డే ఫార్మాట్లో కొత్త బ్యాటర్ తొలి బంతిని ఎదుర్కొనేందుకు 2 నిమిషాలు (120 సెకండ్లు) సమయం ఇచ్చింది. ఇక టీ20 ఫార్మాట్లో కొత్త బ్యాటర్ క్రీజులోకి వచ్చి బంతిని ఎదుర్కొనేందుకు 90 సెకండ్ల వ్యవధిలోనే సిద్ధంగా ఉండాలి. ఆలస్యమె ౖతే, ఫీల్డింగ్ జట్టు కెప్టెన్ అవుట్‌కు అప్పీల్ చేయవచ్చు.
రైట్ టూ ప్లే! : బౌలర్లకు అనుకూలంగా ఉన్న నిబంధనను ఐసీసీ మార్పు చేసింది. బ్యాటర్ పిచ్ బయటకు వచ్చి బంతిని ఆడేందుకు అవకాశం లేదు. కచ్చితంగా బ్యాట్ లేదా బ్యాటర్ పిచ్‌లో ఉండాలి. అయితే, బ్యాటర్ బంతిని ఆడేందుకు పిచ్‌ను వీడాల్సిన అవసరం ఉత్పన్నమయ్యేలా బంతిని సంధిస్తే.. అంపైర్ నో బాల్‌గా ప్రకటిస్తాడు.
అప్పుడు కదలకూడదు : బౌలర్ బంతిని వేసేందుకు రనప్‌లో ఉన్న సమయంలో ఫీల్డింగ్ జట్టులో పెద్దగా కదలికలు ఉండకూడదు. బ్యాటర్‌ను గందరగోళంలోకి నెట్టే కదలికలకు అంపైర్ ఐదు పరుగుల పెనాల్టీ విధించవచ్చు. ఆ బంతిని నో బాల్‌గా సైతం ప్రకటిస్తారు.
నాన్‌స్ట్రయికర్ నిష్క్రమణ : నాన్స్ట్రయిక్లో ఉన్న బ్యాటర్ బంతి వేయడానికి ముందే క్రీజు వదిలినప్పుడు చేస్తున్న రనౌట్‌ను అన్ ఫెయిర్ ప్లేగా గుర్తిస్తున్నారు. ఇక నుంచి దీన్ని సాధారణ రనౌట్‌గానే చూడాలి. అన్‌ఫెయిర్ ప్లే జాబితా నుంచి రనౌట్ జాబితా నిబంధనలోకి ఇది చేరనుంది.
ఇక, కుదరదు : బౌలర్ బంతి వేయడానికి ముందే స్ట్రయికర్ క్రీజు వదిలి ముందుకొచ్చినప్పుడు.. నేరుగా వికెట్ కీపర్‌గా బంతిని విసిరి రనౌట్ చేసేందుకు రూల్స్ అనుమతించేవి. ఇక నుంచి ఇది కుదరదు. ఇలా చేస్తే ఆ బంతిని అంపైర్ డెడ్ బాల్‌గా ప్రకటిస్తాడు.
వీటితో పాటు మరిన్ని రూల్స్‌ను సైతం ఐసీసీ క్రికెట్ కమిటీ ఆమోదించింది. ప్రస్తుతం స్లో ఓవర్‌రేట్‌కు మ్యాచ్‌లోనే పెనాల్టీ విధిస్తున్నారు. నిర్ణీత సమయం ముగిసిన అనంతరం, తర్వాతి ఓవర్లకు ఓ ఫీల్డర్‌ను అదనంగా సర్కిల్ లోపల ఉంచుతున్నారు. ఇదే నిబంధనను వన్డే ఫార్మాట్లోనూ అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. 2023 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ సూపర్ లీగ్ అనంతరం రూల్ అమల్లోకి రానుంది. ఇక ప్రస్తుతం మహిళల క్రికెట్లో వాడుకలో ఉన్న హైబ్రిడ్ పిచ్‌లను మెన్స్ క్రికెట్లోనూ తీసుకొచ్చేందుకు ఐసీసీ క్రికెట్ కమిటీ చర్చించింది.