Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రీడాశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రకటన
- జాతీయ క్రీడల అథ్లెట్లకు స్పోర్ట్స్ కిట్ల పంపిణీ
నవతెలంగాణ-హైదరాబాద్ : జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు అందించనున్నట్టు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. ' క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందించేందుకు సిద్ధంగా ఉంది. అంతర్జాతీయ టోర్నీల్లో పతకాలు సాధించిన అథ్లెట్లకు భారీ నగదు ప్రోత్సాహకాలు అందించాం. జాతీయ క్రీడల్లో పతక విజేతలకు ఆంధ్రప్రదేశ్ అందించే మొత్తానికి రెండింతలు ఎక్కువగా తెలంగాణ క్రీడాకారులు అందిస్తామని' శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జాతీయ క్రీడల్లో పసిడి, రజతం, కాంస్యం సాధించిన అథ్లెట్లకు వరుసగా రూ. 5 లక్షలు, రూ.4 లక్షలు, రూ. 3 లక్షలు నగదు బహుమానం ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ క్రీడా పాలసీ రూపకల్పనకు కసరత్తులు చేస్తున్న క్రీడామంత్రిత్వ శాఖ.. నగదు ప్రోత్సాహకాలపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. గుజరాత్ వేదికగా జరుగనున్న 36వ జాతీయ క్రీడల్లో పాల్గొనే తెలంగాణ అథ్లెట్లకు బుధవారం రవీంద్ర భారతీలో జరిగిన ఓ కార్యక్రమంలో వ్యక్తిగత స్పోర్ట్స్ కిట్లు అందజేశారు. నైపుణ్యంతో పాటు మైండ్‌గేమ్ ఉపయోగించి పతక వేటలో దూసుకెళ్లాలని క్రీడాకారులకు మంత్రి సూచించారు. కార్యక్రమంలో శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు వేణుగోపాలచారి, క్రీడాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.