Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్, ఆసీస్ టీ20 మ్యాచ్
- టికెట్ల కోసం జింఖానా మైదానం ముట్టడి
- బ్లాక్‌మార్కెట్‌ను ప్రోత్సహిస్తున్న హెచ్‌సీఏ
నవతెలంగాణ-హైదరాబాద్
హైదరాబాద్ క్రికెట్ అభిమాన నగరం. ఇక్కడ ఎప్పుడు అంతర్జాతీయ మ్యాచ్ జరిగినా, అభిమానులు పోటెత్తుతారు. ఐపీఎల్ మ్యాచ్‌లకు సైతం స్టేడియం నిండుకుండలా ఉంటుంది. ఇక, జాతీయ జట్టు ఆడినప్పుడు పరిస్థితి చెప్పనక్కర్లేదు. సుమారు మూడేండ్ల విరామం అనంతరం, హైదరాబాద్ తొలిసారి ఓ అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వబోతుంది. భారత్, ఆస్ట్రేలియా పోరును ప్రత్యక్షంగా వీక్షించాలని ఆశిస్తోన్న అభిమానులకు.. ఊహించని షాక్ ఎదురవుతోంది. పూర్తిగా బ్లాక్ మార్కెట్‌ను దన్నుగా నిలుస్తోన్న హెచ్‌సీఏ అధికారులు.. సామాన్య అభిమానులకు టికెట్లను అందుబాటులో ఉంచే ప్రయత్నం చేయటం లేదు. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) తీరు పట్ల విసుగు చెందిన క్రికెట్ అభిమానులు.. బుధవారం సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానాన్ని ముట్టడించారు. మ్యాచ్ టికెట్లను అందుబాటులో ఉంచకపోతే, నేడు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు అభిమానులు హెచ్చరించారు.
టికెట్లు మాయం! : ఉప్పల్ క్రికెట్ స్టేడియం సీటింగ్ సామర్థ్యం సుమారు 45 వేలు. ఇందులో సమారు 5-8 వేల కుర్చీల ఉపయోగంలో లేవు. వీటిని మరమ్మత్తులు చేయడానికి గతంలో నిర్ణయం తీసుకున్నారు. అయినా, ఎటువంటి పురోగతి లేదు. అయినప్పటికీ, అక్టోబర్ 25న భారత్, ఆస్ట్రేలియా మూడో టీ20 మ్యాచ్‌కు స్టేడియం పూర్తి సామర్థ్యంతో కూడిన సీట్లను ఆన్లైన్లో ఉంచామని హెచ్‌సీఏ అధికారులు చెబుతున్నారు. సెప్టెంబర్ 15, రాత్రి 8 గంటలకు పేటీఎం ఇన్సైడర్ యాప్, వెబ్సైట్లో ఆన్లైన్లో టికెట్లు అమ్మకానికి పెట్టారు. పది నిమిషాల వ్యవధిలోనే టికెట్లు పూర్తిగా అమ్ముడుపోయినట్టు వెబ్సైట్లో సందేశం ఉంచారు. దీంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా విషయాన్ని లేవనెత్తారు. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్నవారు, జింఖాన మైదానంలో టికెట్లను తీసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 21 నుంచి ఆఫ్‌లైన్‌లో టికెట్లు తీసుకోవాలని తొలుత సమాచారం ఇచ్చారు. దీంతో, ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న వారు, ఆఫ్‌లైన్‌లో టికెట్లు లభిస్తాయనే ఆశతో వచ్చిన అభిమానులతో జింఖానా మైదాన ప్రాంతం కిక్కిరిసింది. పది నిమిషాల వ్యవధిలోనే 40 వేల టికెట్లు ఎలా అమ్ముడుపోతాయి? ఇతర మ్యాచుల టికెట్ల సామాన్య అభిమానులకు సైతం అందుబాటులో కనిపిస్తుంటే.. హైదరాబాద్‌లో అందుకు పూర్తిగా విరుద్ధంగా సాగుతోంది. హెచ్‌సీఏ అధికారులే బ్లాక్ మార్కెట్లో టికెట్లను అమ్ముకునేందుకు ఆన్లైన్లో టికెట్లు అమ్ముడుపోయావని ప్రకటనలు ఇస్తున్నారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉప్పల్‌లోనూ అదే సీన్ : మరోవైపు ఉప్పల్ స్టేడియం వద్ద సైతం జింఖానా తరహా పరిస్థితులే నెలకొన్నాయి. జింఖానా మైదానం వద్ద సుమారు ఐదు వేల మంది అభిమానులు ఆందోళన నిర్వహించగా, ఉప్పల్ స్టేడియం ముందు సైతం అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. జింఖానా మైదానం గేటు తోసుకుంటూ, గోడలు దూకుతూ లోపలికి ప్రవేశించిన అభిమానులు అక్కడ మైదానంలోనే కూర్చున్నారు. అభిమానులు వేల సంఖ్యలో జింఖానా మైదానంలోని కార్యాలయం వద్దకు చేరుకున్నా.. హెచ్‌సీఏ అధికారుల నుంచి ఎటువంటి స్పందన లభించలేదు. ఆగ్రహావేశాలతో ఉన్న అభిమానులను పోలీసులు శాంతింపజేశారు. నేడు టికెట్ల జారీ అంశంలో హెచ్‌సీఏ స్పష్టమైన వివరాలు వెల్లడించని పక్షంలో.. అభిమానులు తీవ్ర స్థాయిలో ఆందోళనకు దిగేందుకు అవకాశం కనిపిస్తోంది.
బాధ్యతారాహిత్యం : మ్యాచ్ టికెట్ల అందుబాటుపై అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టినా హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్, కార్యదర్శి విజయానంద్లు బాధ్యత తీసుకునే పని చేయలేదు. ఆన్లైన్లో ఎన్ని టికెట్లు పెట్టారు? ఎన్ని అమ్ముడుపోయాయి? అనే వివరాలను ప్రకటించే ప్రయత్నం చేయలేదు. మరోవైపు, శుక్రవారం రోజు ఆన్లైన్లో రెండో విడత టికెట్ల అమ్మకం ఉండనుందనే లీకులు ఇచ్చేందుకు ఆసక్తి చూపించారు. మ్యాచ్ టికెట్ల ఆహ్వాన పత్రికలతో గవర్నర్, క్రీడా శాఖ మంత్రి, శాట్స్ చైర్మన్, సహా ఉన్నతాధికారులను కలిసేందుకు ఉత్సాహం చూపించిన అజహరుద్దీన్, విజయానంద్.. అభిమానులకు టికెట్లను అందుబాటులో ఉంచే అంశంపై సకాలంలో స్పందించలేదు.
పైకప్పు అధోగతి
ఉప్పల్ స్టేడియం నిర్వహణను సైతం హెచ్‌సీఏ నిర్లక్ష్యం వహిస్తోంది. స్టేడియం సౌత్ పెవిలియన్ టెర్రస్ పైకప్పు ఊడిపోయి ఏండ్లు గడుస్తోంది. అయినా, పైకప్పు ఏర్పాటు చేసేందుకు ఉపక్రమించటం లేదు. స్టేడియం నిర్వహణ సరిగా లేకపోవటంతో, దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లను హైదరాబాద్‌కు కేటాయించేందుకు బీసీసీఐ పునరాలోచన చేస్తోంది. అంతర్గత కుమ్ములాటలతో బిజీగా ఉంటోన్న హెచ్‌సీఏ ఆఫ్స్బేరర్లు.. స్టేడియం నిర్వహణను గాలికొదిలేశారు.
బ్లాక్దందాపై ఉక్కుపాదం!
భారత్, ఆసీస్ మ్యాచ్ టికెట్లను బ్లాక్ మార్కెట్లో విక్రయించాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని క్రీడాశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ' స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం భూమి కేటాయించింది. మ్యాచ్ నిర్వహణతో నగరానికి కీర్తి తీసుకురావాలే. కానీ, టికెట్లను అక్రమార్కుల చేతుల్లో ఉంచి హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీస్తే ప్రభుత్వం కచ్చితంగా స్పందిస్తుంది' అని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.
నేడు మ్యాచ్ టికెట్లు
భారత్, ఆసీస్ మ్యాచ్ టికెట్లను నేడు ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. అభిమానుల నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకతతో హెచ్‌సీఏ ఎట్టకేలకు దిగొచ్చింది. సికంద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్లో ఆఫ్‌లైన్ పద్దతిలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు మ్యాచ్ టికెట్లను అమ్మకానికి ఉంచుతున్నట్టు హెచ్‌సీఏ కీలక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్నవారు, టికెట్లను కలెక్ట్ చేసుకునేందుకు సైతం జింఖానాలోనే ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు.
భారీ బందోబస్తు
ఆదివారం మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం పోలీసుల పహారాలో కొనసాగుతోంది. అన్ని గేట్ల వద్ద పోలీసులను మొహరించారు. మీడియాను సైతం స్టేడియంలోనికి అనుమతించటం లేదు. స్టేడియం వద్ద ఆందోళనకు వచ్చిన అభిమానులను పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు.
జీవో 501 ఊసేది?
అంతర్జాతీయ మ్యాచుల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వ, లీజు నిబంధనలను హెచ్‌సీఏ ఉల్లంఘిస్తున్న కారణంగా, 2014లో జీవో నం.501 జారీ చేశారు. దీని ప్రకారం, మ్యాచ్ నిర్వహణ ఏర్పాట్ల పరిశీలనకు ఓ కమిటీ వేయాలి. కమిటీలో శాట్స్ వీసీ అండ్ ఎండీ, హెచ్‌సీఏ కార్యదర్శి, రాచకొండ కమిషనర్, హైదరాబాద్ మెట్రో వాటర్ సర్వీస్, సెవరేజ్ బోర్డు ఎండీ, ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్, రంగారెడ్డి జిల్లా కలెక్టరు సభ్యులుగా ఉండాలి. ఉప్పల్ స్టేడియంలో నిర్వహించే జాతీయ/అంతర్జాతీయ మ్యాచ్‌కైనా ఈ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో నిర్ణయాలు తీసుకోవాలి. ప్రస్తుతం హెచ్‌సీఏ ఈ జీవోను పూర్తిగా విస్మరించినట్టు కనిపిస్తోంది.