Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంట, బయట ఫార్మాట్లో ఐపీఎల్ మ్యాచులు
- వచ్చే ఏడాది మార్చిలో మహిళల ఐపీఎల్
- రాష్ట్ర సంఘాలతో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ
ముంబయి : భారత క్రికెట్ మళ్లీ సాధారణ రోజుల్లోకి రాబోతుంది!.ఇప్పటికే ఈ సీజన్లో పూర్తి స్థాయి దేశవాళీ క్రికెట్ షెడ్యూల్ ప్రకటించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. రానున్న సీజన్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సైతం పాత పద్దతిలోనే నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రాష్ట్ర క్రికెట్ సంఘాలకు రాసిన లేఖలో తెలిపారు. కరోనా మహమ్మారి ప్రభావంతో 2020 నుంచి ఐపీఎల్ యుఏఈలో నిర్వహించిన సంగతి తెలిసిందే. 2021లో భారత్‌లో నాలుగు నగరాలు వేదికగా నిర్వహించేందుకు తొలి దశ షెడ్యూల్ పూర్తి చేసినా.. ఆ తర్వాత యుఏఈకి తరలించారు. 'ఐపీఎల్ సీజన్ తిరిగి సాధారణ పరిస్థితుల్లోకి వెళ్లనుంది. ఈ సీజన్ నుంచి అన్ని జట్లు సొంత వేదికలో సగం మ్యాచులు, మిగతా మ్యాచులు ప్రత్యర్థి సొంత వేదికలో ఆడతాయి. 2022 మార్చిలో మహిళల ఐపీఎల్ ఆరంభం పట్ల ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం' అని గంగూలీ లేఖలో పేర్కొన్నారు.
2023లో పూర్తి సీజన్ : 2023 దేశవాళీ క్రికెట్ షెడ్యూల్‌ను పూర్తి స్థాయిలో నిర్వహించనున్నారు. ఈ ఏడాది బీసీసీఐ అన్ని రకాల క్రికెట్ టోర్నీలను ప్రకటించింది. కానీ వచ్చే ఏడాది నుంచి తిరిగి పాత రోజుల తరహాలోనే నిర్వహించనుంది. ముఖ్యంగా, రంజీ ట్రోఫీ మ్యాచులు సొంత వేదికల్లో కొన్ని, ప్రత్యర్థి సొంత మైదానంలో కొన్ని ఆడనున్నాయి.
గర్ల్స్‌కు అండర్-15 టోర్నీ : వచ్చే ఏడాది మార్చిలో మహిళల ఐపీఎల్‌కు శ్రీకారం చుడుతున్న బీసీసీఐ, దేశవాళీ స్థాయిలో బాలికల కోసం కొత్త టోర్నీని ప్రకటించింది. అండర్-15 స్థాయిలో (వన్డే టోర్నీ)అమ్మాయిలకు దేశవాళీ టోర్నీ ప్రవేశపెడుతున్నట్టు గంగూలీ వెల్లడించారు. మహిళల ఐపీఎల్‌తో భారత్‌లో మహిళల క్రికెట్ ప్రమాణాలు పెంపొందనున్నాయి. అండర్-15 టోర్నీతో మహిళల ఐపీఎల్‌కు వర్థమాన క్రికెటర్లు సైతం అందుబాటులోకి రానున్నారు. ఈ టోర్నీ డిసెంబర్ 26-జనవరి 12న బెంగళూర్, రాంచీ, రాజ్‌కోట్, ఇండోర్, రారుపూర్, పుణె వేదికలుగా నిర్వహించనున్నారు.
అక్టోబర్ 18న ఏజీఎం!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక సర్వ సభ్య సమావేశం (ఏజీఎం) అక్టోబర్ 18న నిర్వహించనున్నారు. ఈ మేరకు బోర్డు కార్యదర్శి జై షా గురువారం రాష్ట్ర క్రికెట్ సంఘాలకు, బీసీసీఐ సభ్య క్రికెట్ క్లబ్‌లకు లేఖలు పంపారు. ఏజీఎంలో చర్చించాల్సిన అంశాలపై జై షా లేఖలో వివరంగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆఫీస్ బేరర్ల పదవీకాలం ముగియనుండటంతో.. రానున్న ఏజీఎంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో జై షా, సౌరవ్ గంగూలీ మళ్లీ బీసీసీఐ ఆఫీస్ బేరర్లుగా ఎన్నికయ్యేందుకు లైన్ క్లియర్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఎన్నికల్లో జై షా అధ్యక్ష పదవిలోకి వస్తాడా? లేదంటే ప్రస్తుతం ఉన్నట్టే గంగూలీని అధ్యక్ష స్థానంలో నిలిపి, తాను కార్యదర్శి పదవిలో కొనసాగుతాడా? అనేది తేలాల్సి ఉంది.