Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం, భారత క్రికెట్ పరిస్థితి మానవ జీవితాన్ని ప్రతిబింబిస్తోంది!. ఓ సమస్యను అధిగమించగానే, మరో సమస్య ఎదురుగా నిల్చోంటుంది. తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు భారీ స్కోరు నమోదులో బలహీనతలను విజయవంతంగా పరిష్కరించుకున్న రోహిత్‌సేనకు.. రెండో ఇన్నింగ్స్‌లో డెత్ బౌలింగ్ సవాల్ సమస్యగా కూర్చోంది. తొలి బంతి నుంచే బ్యాటర్లు నేరుగా బౌండరీలు బాదటం ఆనందనావ్వగా.. డెత్ ఓవర్లలో బౌలర్లు అలవోకగా బౌండరీలు కోల్పోవటం అంతకుమించిన నిరుత్సాహాన్ని మిగిల్చింది. నాగ్‌పూర్‌లోనే టీ20 సిరీస్ సొంతం చేసుకునేందుకు ఆస్ట్రేలియా ఎదురుచూస్తుండగా.. సిరీస్‌ను నిర్ణయాత్మక హైదరాబాద్ పోరుకు తీసుకెళ్లేందుకు భారత్ సిద్ధమవుతోంది. నేడు భారత్, ఆస్ట్రేలియా రెండో టీ20 పోరు.
- భారత్‌కు ఇక చావోరేవో
- సిరీస్‌పై ఆస్ట్రేలియా గురి
- రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
నవతెలంగాణ-నాగ్‌పూర్
భారత్‌కు బౌలింగ్ సమస్య
టీమ్ ఇండియా బౌలింగ్ సమస్య ఈ సిరీస్‌లో ఉత్పన్నమైనది కాదు. ఆసియా కప్‌లోనే భారత బౌలింగ్‌లో పస తగ్గిందని తేలింది. పవర్‌ప్లేలో గొప్పగా రాణిస్తున్న భువనేశ్వర్ కుమార్.. డెత్ ఓవర్లలో ధారాళంగా పరుగులు ఇవ్వటం ఆందోళనకు దారితీస్తోంది. ఆసియాకప్ సూపర్ 4లో పాక్‌తో మ్యాచ్‌లో భారత్ ఫేవరేట్‌గా నిలిచిన స్థితిలో ఇన్నింగ్స్ 19వ ఓవర్లో భువనేశ్వర్ 19 పరుగులు సమర్పించుకున్నాడు. మ్యాచ్‌ను ప్రత్యర్థి పరం చేశాడు. ఆ తర్వాత కీలక శ్రీలంకతో మ్యాచ్‌లోనూ అదే పరిస్థితి పునరావృతమైంది. తాజాగా, ఆస్ట్రేలియాతో తొలి టీ20లో డెత్ ఓవర్లలో భువీ తేలిపోయాడు. ఇన్నింగ్స్ 17, 19వ ఓవర్లో వరుసగా 15 చొప్పున పరుగులు ఇచ్చుకున్నాడు. ఈ ఏడాది బుమ్రా మూడు టీ20ల్లోనే ఆడాడు. దీంతో భువనేశ్వర్ భారత పేస్ దళానికి సారథ్యం వహిస్తున్నాడు. బుమ్రా రాకతో పేస్ బౌలింగ్, డెత్ బౌలింగ్ సమస్యలకు చెక్ పడనుంది. అయితే, ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో భారత్ ఏ విధంగా ఎదుర్కొనేది చిక్కుప్రశ్నగా మిగిలింది. డెత్ ఓవర్లలో చెత్త ఎకానమీ కలిగిన పేసర్లలో హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్‌లు ఉన్నారు. ఈ జాబితాలో బుమ్రా, అర్షదీప్ సింగ్‌లు మెరుగ్గా ఉన్నారు. అర్షదీప్ ఈ సిరీస్‌లో ఆడటం లేదు. బుమ్రా నేడు బరిలోకి దిగితే భారత్ డెత్ ఓవర్లలో గణనీయమైన మార్పు సాధించేందుకు అవకాశం ఉంది. ఏదేని ఒక మ్యాచ్‌లో లయ తప్పటం ఫర్వాలేదు కానీ, వరుస మ్యాచుల్లో అదే రీతిన పరుగులు ఇవ్వటం భువనేశ్వర్ కుమార్‌పై ఆధారపడలేని పరిస్థితిని కల్పిస్తుంది. స్పిన్నర్ చాహల్ ఏమాత్రం ప్రభావం చూపటం లేదు. అతడి స్థానంలో అశ్విన్‌ను ఆడించే అవకాశం ఉంది. ప్రపంచకప్‌కు సైతం రవి బిష్ణోరును పరిశీలించే అవకాశం కనిపిస్తోంది. బ్యాటింగ్ విభాగంలో కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య సూపర్ ఫామ్‌లో ఉన్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, దినేశ్ కార్తీక్‌లు నేడు ధనాధన్ షో చూపించాలని ఎదురుచూస్తున్నారు.
ఆసీస్ ఉత్సాహం
ఆస్ట్రేలియా శిబిరం నూతన ఉత్సాహంలో కనిపిస్తోంది. వరల్డ్‌కప్ ప్రణాళికల్లో లేని, ఓపెనర్‌గా ఎన్నడూ ఆడని కామెరూన్ గ్రీన్ మొహాలిలో మరుపురాని ఇన్నింగ్స్ ఆడాడు. 200 స్ట్రయిక్‌రేట్‌తో అర్థ సెంచరీ కొట్టాడు. దీంతో వరల్డ్‌కప్ బ్యాకప్ ప్రణాళికల్లో ఓ బ్యాటర్ ఆసీస్‌కు లభించాడు. నం.3 పొజిషనల్ స్మిత్ సైతం ఆకట్టుకున్నాడు. 24 బంతుల్లో 35 పరుగులు సాధించాడు. ఇక కెప్టెన్ అరోన్ ఫించ్ ఫామ్‌లోకి వచ్చే సంకేతాలిచ్చాడు. పవర్‌ప్లేలో భువనేశ్వర్ కుమార్‌పై ఎదురుదాడి చేసిన ఫించ్.. అతడి రెండు ఓవర్లలో 22 పరుగులు పిండుకున్నాడు!. బౌలింగ్ విభాగంలోనూ ఆస్ట్రేలియా మెరుగ్గా కనిపిస్తోంది. పేసర్లు, స్పిన్నర్లు ప్రణాళికలకు అనుగుణంగా బౌలింగ్ చేస్తున్నారు. లోతైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ఆస్ట్రేలియాకు ఛేదనలో అదనపు అనుకూలత ఉంటోంది. నేడు నాగ్‌పూర్‌లో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు సిద్ధమవుతున్న కంగారూసేన.. టాస్ నెగ్గిన మళ్లీ తొలుత బౌలింగ్ ఎంచుకోనుంది.
పిచ్, వాతావరణం
నాగ్‌పూర్‌లో బౌలర్లకు పిచ్ నుంచి మెరుగైన సహకారం లభించవచ్చు. ఇక్కడ జరిగిన 12 టీ20ల్లో సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 151. గురువారం ఇక్కడ వర్షం కురిసింది. ఇరు జట్లు మ్యాచ్ ప్రాక్టీస్ సైతం చేయడానికి కుదరలేదు. నేడు వర్ష సూచనలు లేవు. కానీ శీతల వాతావరణ పరిస్థితులు కనిపించనున్నాయి. టాస్ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్ చేసేందుకు మొగ్గుచూపవచ్చు.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జశ్‌ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్.
ఆస్ట్రేలియా : అరోన్ ఫించ్ (కెప్టెన్), కామెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్, జోశ్ ఐంగ్లిశ్, టిమ్ డెవిడ్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్, నాథన్ ఎలిస్, ఆడం జంపా, జోశ్ హజిల్‌వుడ్.