Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్లబ్ మెంబర్స్‌కు పార్క్ హయత్‌లో దావత్
- ఏర్పాటు చేసిన హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహర్
నవతెలంగాణ, హైదరాబాద్ : నేడు ఉప్పల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్. క్రికెట్ మ్యాచ్ టికెట్ల అమ్మకంలో పారదర్శకత లేదు. జింఖానా గ్రౌండ్లో తొక్కిసలాటలో పలువరు అభిమానులకు తీవ్ర గాయాలు. మరోవైపు స్టేడియంలో మ్యాచ్ ఏర్పాట్లు సంతృప్తికరంగా లేవు. మూడేండ్ల తర్వాత నగరం ఆతిథ్యం వహిస్తోన్న అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహణ ఏర్పాట్లు గాలికొదిలేసిన మహ్మద్ అజహరుద్దీన్.. రానున్న హెచ్‌సీఏ ఎన్నికల్లో తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు ఐదు నక్షత్రాల హోటల్లో మందు పార్టీ ఇచ్చాడు. క్లబ్ కార్యదర్శులకు మందు పార్టీ ఇప్పుడు హెచ్‌సీఏ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికల తాయిలాలు!
సెప్టెంబర్ 25, 2022తో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా మహ్మద్ అజహరుద్దీన్ పదవీ కాలం ముగియనుంది. అక్టోబర్ 18న బీసీసీఐ ఏజీఎం నిర్వహించను న్నారు. ఏజీ ఎంలో హెచ్‌సీఏ ప్రతినిధిగా ఎవరు ప్రాతినిథ్యం వహిస్తా రనేది ఇప్పుడు చిక్కు ప్రశ్నగా మారింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో హెచ్‌సీఏ ఎన్ని కలకు మరో మూడు నెలల గడువు ఉండగా.. రానున్న బీసీసీఐ ఏజీఎంలో హైదరా బాద్ క్రికెట్ సంఘం ప్రతినిధిగా హాజరై బోర్డులో కీలక పదవి చేపట్టేందుకు అజహర్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకోసం, హెచ్‌సీఏ క్లబ్ మెంబర్స్‌కు రూ.30 లక్షల వ్యయంతో భారీ స్థాయిలో మందు పార్టీ ఏర్పాటు చేశాడు. హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ పేరిట ఈ మేరకు మందు పార్టీకి క్లబ్ మెంబర్స్‌కు పంపిన ఆహ్వాన కాపీని నవతెలంగాణ సంపాదించింది. జింఖానా గ్రౌండ్లో టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన అభిమానులను పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లని అజహరుద్దీన్.. రానున్న ఎన్నికల నేపథ్యంలో టీ20 మ్యాచ్‌ను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో క్లబ్ మెంబర్లను ఆకర్షించేందుకు సుమారు ఆరు వేల టికెట్లను కాంప్లిమెంటరీ పాస్‌ల కింద క్లబ్‌లకు పంపిణీ చేశాడు. హెచ్‌సీఏలో అజహర్ ఒంటెద్దు పోకడలను వ్యతిరేకిస్తున్న మాజీ అధ్యక్షుడు, కార్యదర్శి స్థాయి వ్యక్తులకు మ్యాచ్ టికెట్లను దక్కకుండా చేసినట్టు సమాచారం. సుమారు 12 వేలకు పైగా మ్యాచ్ టికెట్లను అనుచరులకు, రాజకీయ నేతలకు దొడ్డిదారిలో కట్టబెట్టినట్టు ఆరోపణలు వస్తుండటంతో.. సెప్టెంబర్ 26న జరిగే సుప్రీంకోర్టు నియమిత పర్యవేక్షణ కమిటీ ఈ విషయంపై అజహరుద్దీన్‌ను వివరణ అడిగే అవకాశం కనిపిస్తోంది. మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి క్లబ్ మెంబర్లకు రూ.30 లక్షలతో మందు పార్టీ ఖర్చులను ఆడిట్ ఆమోదానికి పంపే అంశంపై చర్చించే అవకాశం ఉంది.