Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పొట్టి సిరీస్ వేట ఉప్పల్‌కు చేరుకుంది. టీ20 సిరీస్ దక్కించుకునేందుకు భారత్, ఆస్ట్రేలియా నేడు హైదరాబాద్ వేదికగా అమీతుమీ తేల్చుకోనున్నాయి. పరుగుల వరద పారనున్న ఉప్పల్ స్టేడియంలో ఇటు ఆస్ట్రేలియా, ఇటు భారత్‌లు డెత్ బౌలింగ్ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. మెరుగైన బౌలింగ్ విభాగం టీ20 సిరీస్ విజేతను నిర్దేశించనుంది. భారత్, ఆస్ట్రేలియా మూడో టీ20 పోరు నేడు.
హైదరాబాద్ అభిమానులు భావోద్వేగ సమరానికి సన్నద్ధమవుతున్నారు. మూడేండ్లుగా క్రికెట్ వేడుకకు దూరమైన తెలంగాణ క్రికెట్ ప్రియులు.. నేడు ఆసీస్‌తో భారత్ పోరుతో మళ్లీ ప్రత్యక్షంగా క్రికెట్‌ను వీక్షించనున్నారు. టికెట్ల కోసం తొక్కిసలాట జరిగినా, అభిమాన ఆటగాళ్ల ఆట చూసేందుకు ఆశగా క్యూలైన్లలో ఎదురుచూశారు. అభిమానులకు సైతం ఈ టీ20 పోరు ప్రత్యేకంగా నిలిచిపోనుంది!.
- రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
- ఇరు జట్లకు విజయమే లక్ష్యం
- భారత్, ఆసీస్ మూడో టీ20 నేడు
నవతెలంగాణ-హైదరాబాద్:నాగ్‌పూర్‌లో ఎనిమిది ఓవర్ల చిట్టి సమరంలో టీమ్ ఇండియా పైచేయి సాధించినా.. నేడు నిర్ణయాత్మక సమరమే ఆతిథ్య భారత్‌కు సిసలైన సవాల్ విసరనుంది. కీలక నాకౌట్ మ్యాచుల్లో జట్టు అమలు చేసే వ్యూహం సహా డెత్ బౌలింగ్‌లో మెరుగయ్యేందుకు జట్టు ప్రణాళికలకు హైదరాబాద్ టీ20 పరీక్షగా నిలువనుంది. అక్షర్ పటేల్ మాయజాలం, కెప్టెన్ రోహిత్ శర్మ ధనాధన్ షో నాగ్‌పూర్‌లో అలరించాయి. ఇదే సమయంలో ఆస్ట్రేలియా శిబిరంలోనూ డెత్ బౌలింగ్ సమస్యను నాగ్‌పూర్ మ్యాచ్ తెరపైకి తీసుకొచ్చింది. భారత్, ఆస్ట్రేలియాలు నేడు డెత్ బౌలింగ్ (16-20 ఓవర్లు) సమస్యను అధిగమించేందుకు నిర్ణయాత్మక సమరానికి సై అంటున్నాయి. భారత్, ఆస్ట్రేలియా చివరి టీ20 మ్యాచ్ నేడు.
బౌలింగే సమస్య!
భారత జట్టుకు మరోసారి బౌలింగ్ సమస్యగా పరిణమించింది. గత ఐదేండ్లలో బౌలర్లు జట్టుకు వెన్నెముకగా నిలువగా.. విచిత్రంగా కోవిడ్-19 అనంతర కాలంలో బౌలింగ్ విభాగం బలహీనతగా మారింది. అందుకు కారణాలు ఏమైనా.. మైదానంలో జట్టు ఫలితంపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. హర్షల్ పటేల్ నాగ్‌పూర్‌లో పూర్తిగా తేలిపోయాడు. జశ్‌ప్రీత్ బుమ్రా పునరాగమనంలో గొప్పగా రాణించాడు. బుమ్రా రాక భారత జట్టులో ఉత్సాహం నింపింది. పవర్‌ప్లేలో భువనేశ్వర్ కుమార్‌ను, డెత్ ఓవర్లలో జశ్‌ప్రీత్ బుమ్రాను ప్రయోగించే సరికొత్త ఆలోచనకు రోహిత్ శర్మ శ్రీకారం చుట్టే అవకాశం సైతం కనిపిస్తోంది. ఇక వరల్డ్‌కప్ ప్రణాళికల్లో కీలకమైన యుజ్వెంద్ర చాహల్ నిలకడగా విఫలమవుతున్నాడు. అదే సమయంలో అక్షర్ పటేల్ అవకాశం లభించిన ప్రతిసారి అదగొడుతున్నాడు. వరల్డ్‌కప్ జట్టులో చోటు నిలుపుకునేందుకు చాహల్‌కు అతి తక్కువ సమయమే ఉంది. హైదరాబాద్ వేదికగా చాహల్ తిరిగి వికెట్ల వేటలో మెరుస్తాడేమో చూడాలి. బ్యాటింగ్ విభాగం బలంగా కనిపిస్తోంది. అందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. హైదరాబాద్‌లో తిరుగులేని రికార్డున్న విరాట్ కోహ్లి నేడు మెగా ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యలపై ఫోకస్ కనిపిస్తోంది. వికెట్‌కీపర్‌గా దినేశ్ కార్తీక్ తుది జట్టులో నిలిచే అవకాశం ఉంది. రిషబ్ పంత్ బెంచ్‌కు పరిమితం కానున్నాడు.
ఆందోళనలో ఆసీస్
మరోవైపు ఆస్ట్రేలియా శిబిరంలో సరికొత్త ఆందోళన మొదలైంది. డెత్ ఓవర్లలో కంగారూ బౌలర్లు తేలిపోతున్నారు. పాట్ కమిన్స్, జోశ్ హజిల్‌వుడ్, నాథన్ ఎలిన్స్లు అంచనాలను అందుకోవటం లేదు. మిచెల్ స్టార్క్ లేని లోటు పేస్ విభాగంలో స్పష్టంగా కనిపిస్తోంది. గాయంతో కేన్ రిచర్డ్సన్ సైతం నేడు అందుబాటులో లేడు. ఇది ఆసీస్ పేస్ కష్టాలను రెట్టింపు చేస్తోంది. బ్యాటింగ్ లైనప్‌లో ఆస్ట్రేలియా గొప్పగా కనిపిస్తోంది. లోతైన బ్యాటింగ్ ఆర్డర్ కలిగిన ఆస్ట్రేలియాను ఛేదనలో నిలువరించటం అంత సులువు కాదు. ఫించ్, మాక్స్వెల్, కామరూన్, స్మిత్‌లను భారత బౌలర్లు ఏ విధంగా నిలువరిస్తారో చూడాలి. ఇక కెరీర్ సూపర్ ఫామ్‌లో ఉన్న మాథ్యూ వేడ్ భారత బౌలర్లకు సింహస్వప్నంగా మారాడు. రెండు మ్యాచుల్లోనూ వేడ్ విధ్వంసక ఇన్నింగ్స్‌లతో చెలరేగాడు. హైదరాబాద్‌లో సైతం వేడ్ ప్రమాదకారి.
పరుగుల పండుగ!
హైదరాబాద్‌లో మూడేండ్లుగా టీ20 మ్యాచ్ జరుగలేదు. 2019 నుంచి ఐపీఎల్ మ్యాచులు సైతం నిర్వహించలేదు. 2019లో ఇక్కడ జరిగిన భారత్, వెస్టిండీస్ టీ20 మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. మ్యాచ్‌కు ముందు రోజు పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. మరో పరుగుల పండుగకు క్యూరేటర్ రంగం సిద్ధం చేశాడు. విరాట్ కోహ్లికి ఇక్కడ ఎదురులేని రికార్డుంది. ఇక్కడ జరిగిన చివరి టీ20లో కోహ్లి 50 బంతుల్లో అజేయంగా 94 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా పది మ్యాచుల్లో 53.62 సగటుతో విరాట్ అదరగొట్టాడు. మ్యాచ్‌కు ముందు వాతావరణం మేఘావృతంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. వర్ష సూచనలు పెద్దగా లేవు. 2018 ఐపీఎల్ ఆరంభం నుంచీ ఇక్కడ జరిగిన 16 టీ20 మ్యాచుల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 8 సార్లు నెగ్గగా.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్టు 8 సార్లు విజయం సాధించింది. దీంతో హైదరాబాద్‌లో టాస్కు పెద్దగా ప్రాధాన్యం లేదని చెప్పవచ్చు. అయినా, టాస్ నెగ్గిన తొలుత బౌలింగ్ ఎంచుకునేందుకు మొగ్గుచూపవచ్చు.
తుది జట్లు (అంచనా)
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జశ్‌ప్రీత్ బుమ్రా, యుజ్వెంద్ర చాహల్.
ఆస్ట్రేలియా : అరోన్ ఫించ్ (కెప్టెన్), కామెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్, జోశ్ ఐంగ్లిశ్, టిమ్ డెవిడ్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్, నాథన్ ఎలిస్, ఆడం జంపా, జోశ్ హజిల్‌వుడ్.