Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీసీఐ ఎన్నికల షెడ్యూల్ విడుదల
ముంబయి : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో ఎన్నికల నగారా మోగింది. అక్టోబర్ 18న ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సమావేశం కానున్న ఏజీఎం (వార్షిక సర్వ సభ్య సమావేశం) నూతన ఆఫీస్ బేరర్లను ఎన్నుకోనుంది. ఈ మేరకు ఎలక్టోరల్ అధికారి ఏకే జోతి ఎన్నికల షెడ్యూల్ ఆదివారం విడుదల చేశారు. ఈ మేరకు అక్టోబర్ 4 లోపు రాష్ట్ర క్రికెట్ సంఘాలు తమ ప్రతినిధుల పేర్లను నామినేట్ చేయాల్సిందిగా స్పష్టం చేశారు. అక్టోబర్ 6న ఎలక్టోరల్ ముసాయిదా సిద్ధం కానుండగా.. అభ్యంతరాలకు తర్వాతి రెండు రోజులు కేటాయించారు. అక్టోబర్ 13 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అక్టోబర్ 14న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉండనుండగా.. అక్టోబర్ 15న ఎన్నికల బరిలో నిలిచిన తుది అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు.
బీసీసీఐ ఏజీఎంలో మూడు రకాల పదవుల కోసం ఎన్నికల జరుగనున్నాయి. ఐదుగురు ఆఫీస్ బేరర్లు, అపెక్స్ కౌన్సిల్లో సభ్యుడు, గవర్నింగ్ కౌన్సిల్‌కు ఇద్దరు సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఆఫీస్ బేరర్లలో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి పదవులు ఉన్నాయి. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో రాష్ట్ర, బీసీసీఐ స్థాయిలో కలిపి ఆరేండ్లు పూర్తి చేసుకున్నవారు మూడేండ్ల విరామం సమయం తీసుకోవాల్సిన అవసరం లేదు. బీసీసీఐ, రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో వరుసగా 12 ఏండ్ల పాటు కొనసాగేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ప్రస్తుత ఆఫీస్ బేరర్లు సౌరవ్ గంగూలీ, జై షాలు మళ్లీ ఎన్నిక కావటం లాంఛనమే. జై షా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతాడనే ఊహాగానాలు వినిపిస్తున్నా.. గత మూడేండ్ల మాదిరిగానే గంగూలీ ప్రెసిడెంట్‌గా, జై షా కార్యదర్శిగా పదవులు చేపట్టనున్నారు.