Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దులీప్ ట్రోఫీ ఫైనల్
కోయంబతూర్ : వెస్ట్ జోన్ దులీప్ ట్రోఫీ విజేతగా అవతరించింది. యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో భారీ స్కోర్లు నమోదు చేసిన వెస్ట్ జోన్.. ఫైనల్లో సౌత్ జోన్‌పై 294 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 529 పరుగుల ఛేదనలో సౌత్‌జోన్ 234 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ రోహన్ (93), ఆల్‌రౌండర్ రవితేజ (53) అర్థ సెంచరీలతో రాణించినా.. 71.2 ఓవర్లలోనే సౌత్ కథ ముగిసింది. వెస్ట్‌జోన్ బౌలర్లలో ములాని (4/51), జయదేవ్ ఉనద్కత్ (2/28), అటిట్ (2/29) రాణించారు. వెస్ట్‌జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 270 పరుగులు చేయగా.. హెత్ పటేల్ (98) రాణించాడు. రెండో ఇన్నింగ్స్‌లో వెస్ట్‌జోన్ 585/4 వద్ద డిక్లరేషన్ ఇచ్చింది. యశస్వి జైస్వాల్ (265) భారీ డబుల్ సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో సౌత్‌జోన్ 327 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలువగా.. 13 వికెట్లు, 50 పరుగులతో అదరగొట్టిన జయదేవ్ ఉనద్కత్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు సొంతం చేసుకున్నాడు.
శభాష్ రహానె..! : దులీప్ ట్రోఫీ ఫైనల్లో వెస్ట్ జోన్ కెప్టెన్ అజింక్య రహానె క్రీడాస్ఫూర్తిని చాటాడు. మైదానంలో తన జట్టు ఆటగాడు క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు తగు రీతిలో స్పందించి.. ఆదర్శంగా నిలిచాడు!. సౌత్‌జోన్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తుండగా హైదరాబాద్ ఆల్‌రౌండర్ తెల్కపల్లి రవితేజను యశస్వి జైస్వాల్ స్లెడ్జింగ్ చేశాడు. ఈ విషయంపై రవితేజ అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. ఇన్నింగ్స్ 57వ ఓవర్లో జైస్వాల్ నుంచి రవితేజ మరో సారి మాటల తూటాలను చవిచూశాడు. యశస్వి జైస్వాల్ గీత దాటాడని గ్రహించిన కెప్టెన్ అజింక్య రహానె అతడిని మందలించాడు. మైదానం వీడాలని సూచించాడు. యశస్వి జైస్వాల్ పెవిలియన్‌కు చేరటంతో వెస్ట్‌జోన్ పది మంది ఫీల్డర్లతోనే కొనసాగింది. సబ్‌స్టిట్యూట్ నిబంధనల ప్రకారం యశస్వి జైస్వాల్‌కు అనుమతించరు. ఏడు ఓవర్ల అనంతరం జైస్వాల్‌ను తిరిగి మైదానంలోకి తీసుకొచ్చాడు రహానె. ప్రత్యర్థిని గౌరవించటం ఆటలో భాగమని, హద్దుమీరి ప్రవర్తించటం సరికాదని అజింక్య రహానె ఈ సందర్భంగా తెలిపాడు.