Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీ20 సిరీస్ టీమ్ ఇండియా వశం. హైదరాబాద్ నిర్ణయాత్మక టీ20 పోరులో ఆతిధ్య భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 187 పరుగుల ఛేదనలో సూర్యకుమార్ (69), విరాట్ కోహ్లి (63) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. టీ20 సిరీస్‌ను భారత్ 2-1తో సొంతం చేసుకుంది. కామెరూన్ గ్రీన్ (52), టిమ్ డెవిడ్ (54) అర్థ సెంచరీలతో తొలుత ఆస్ట్రేలియా 186/7 పరుగుల భారీ స్కోరు సాధించింది.
- 2-1తో టీ20 సిరీస్ రోహిత్‌సేన వశం
- ఛేదనలో చెలరేగిన సూర్య, కోహ్లి
- అక్షర్ పటేల్, చాహల్ స్పిన్ మాయ
- మూడో టీ20లో ఆసీస్‌పై భారత్ గెలుపు
నవతెలంగాణ-హైదరాబాద్
సూర్యకుమార్ యాదవ్ (69, 36 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (63, 48 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో కదం తొక్కటంతో 187 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఊదేసింది. 19.5 ఓవర్లలోనే ఛేదించింది. 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపొంది టీ20 సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 186 పరుగులు చేసింది. టిమ్ డెవిడ్ (54, 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), కామెరూన్ గ్రీన్ (52, 21 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీలు సాధించారు. భారత స్పిన్ జోడీ అక్షర్ పటేల్ (3/33), యుజ్వెంద్ర చాహల్ (1/22) మాయ చేశారు.
సూర్య ప్రతాపం : ఛేదనలో భారత్‌కు ఆశించిన ఆరంభం లభించలేదు. ఓపెనర్ రాహుల్ (1) ఎదురుదాడికి వెళ్లి వికెట్ కోల్పోగా.. కెప్టెన్ రోహిత్ శర్మ (17) ఎంతోసేపు క్రీజులో నిలువలేదు. 30 పరుగులకే భారత్ ఓపెనర్లను కోల్పోయింది. ఈ దశలో విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ మూడో వికెట్‌కు 104 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. సూర్యకుమార్ సహజశైలిలో రెచ్చిపోయాడు. నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 29 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడు. మరో ఎండ్‌లో విరాట్ కోహ్లి సంప్రదాయ క్లాస్ ఆటతో రెచ్చిపోయాడు. హైదరాబాద్‌లో ఎదురులేని రికార్డున్న కోహ్లి.. ఆసీస్‌పై ఆ జోరు కొనసాగించాడు. మూడేసి ఫోర్లు, సిక్సర్లతో 36 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. సూర్య, కోహ్లి భాగస్వామ్యంతో భారత్ గెలుపు దిశగా సాగింది. ఇన్నింగ్స్ వేగం పెంచే క్రమంలో సూర్య వెనుదిరిగినా.. హార్దిక్ పాండ్య తోడుగా విరాట్ కోహ్లి అదరగొట్టాడు. చివరి ఓవర్లో 11 పరుగులు చేయాల్సి ఉండగా, తొలి బంతిని సిక్సర్‌గా బాదిన కోహ్లి.. తర్వాతి బంతికి కవర్స్‌లో క్యాచౌట్‌గా నిష్క్రమించాడు. హార్దిక్ పాండ్య (25 నాటౌట్) వికెట్ల వెనకాల బౌండరీతో మరో బంతి ఉండగానే లాంఛనం ముగించాడు. దినేశ్ కార్తీక్ (1 నాటౌట్) అజేయంగా నిలిచాడు.
స్పిన్ మాయ : టాస్ నెగ్గి తొలుత బౌలింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియాకు ఆస్ట్రేలియా ఓపెనర్లు గట్టి షాకిచ్చారు. పవర్‌ప్లేలోనే ప్రధాన పేసర్లు భువనేశ్వర్, బుమ్రాలపై దాడి చేశారు. కామెరూన్ గ్రీన్ దూకుడుతో తొలి మూడు ఓవర్లలోనే ఆస్ట్రేలియా స్కోరు 40/0. భువీపై ఓ ఫోర్, సిక్సర్ బాదిన కామెరూన్.. బుమ్రాపై ఓ ఫోర్, రెండు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఫించ్ (7)ను అక్షర్ వెనక్కి పంపినా..గ్రీన్ జోరు తగ్గలేదు. 7 ఫోర్లు, మూడు సిక్సర్లతో 19 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రమాదకరంగా మారిన కామెరూన్ గ్రీన్‌ను భువనేశ్వర్ సాగనంపాడు. పవర్‌ప్లే ఆరు ఓవర్ల అనంతరం ఆస్ట్రేలియా 66/2తో పటిష్ట స్థితిలో నిలిచింది. ధనాధన్ ఆరంభం అందుకున్న ఆస్ట్రేలియాకు మిడిల్ ఓవర్లలో బ్రేక్‌లు వేశారు. చాహల్ పరుగుల పొదుపుతో ఒత్తిడి పెంచగా.. స్మిత్ (9), మాక్స్వెల్ (6) స్వల్ప విరామంలో వికెట్లు కోల్పోయారు. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో జోశ్ ఐంగ్లిశ్ (24), మాథ్యూవేడ్ (1)లను వెనక్కి పంపించిన అక్షర్ పటేల్‌ను ఆసీస్‌ను గట్టి దెబ్బ కొట్టాడు. చివర్లో టిమ్ డెవిడ్ (54, 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) విరుచుకుపడ్డాడు. సిక్సర్లతో చెలరేగిన డెవిడ్ 25 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. డెత్ ఓవర్లలో భువనేశ్వర్‌తో పాటు బుమ్రా సైతం నిరాశపరిచాడు.బుమ్రా ఏకంగా 50 పరుగులు సమర్పించుకున్నాడు. డెవిడ్ ధనాధన్‌తో చివరి ఐదు ఓవర్లలో ఆస్ట్రేలియా 63 పరుగులు పిండుకుంది.
స్కోరు వివరాలు :
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ : కామెరూన్ (సి) రాహుల్ (బి) భువనేశ్వర్ 52, ఫించ్ (సి) హార్దిక్ (బి) అక్షర్ 7, స్మిత్ (స్టంప్డ్) కార్దీక్ (బి)చాహల్ 9, మాక్స్వెల్ (రనౌట్) అక్షర్ 6, జోశ్ (సి) రోహిత్ (బి) అక్షర్ 24, డెవిడ్ (సి) రోహిత్ (బి) హర్షల్ 54, వేడ్ (సి,బి) అక్షర్ 1, డానియల్ నాటౌట్ 28, కమిన్స్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 5, మొత్తం :(20 ఓవర్లలో 7 వికెట్లకు) 186.
వికెట్ల పతనం : 1-44, 2-62, 3-75, 4-84, 5-115, 6-117, 7-187.
బౌలింగ్ : భువనేశ్వర్ 3-0-39-1, అక్షర్ 4-0-33-3, బుమ్రా 4-0-50-0, హార్దిక్ 3-0-23-0, చాహల్ 4-0-22-1, హర్షల్ 2-0-18-1.
భారత్ ఇన్నింగ్స్ : రాహుల్ (సి) వేడ్ (బి) శామ్స్ 1, రోహిత్ (సి) శామ్స్ (బి) కమిన్స్ 17, కోహ్లి (సి) ఫించ్ (బి) శామ్స్ 63, సూర్య (సి) ఫించ్ (బి) హజిల్‌వుడ్ 69, హార్దిక్ నాటౌట్ 25, కార్తీక్ నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు : 11, మొత్తం :(19.5 ఓవర్లలో 4 వికెట్లకు) 187.
వికెట్ల పతనం : 1-5, 2-30, 3-134, 4-182.
బౌలింగ్ : డానియల్ 3.5-0-33-2, హజిల్‌వుడ్ 4-0-40-1, జంపా 4-0-44-0, కమిన్స్ 4-0-40-1, కామెరూన్ 3-0-14-0, మాక్స్వెల్ 1-0-11-0.
విరాట్ స్పెషల్ : హైదరాబాద్ మైదానంతో విరాట్ కోహ్లి ప్రత్యేక అనుబంధం కొనసాగుతూనే ఉంది. ఇక్కడ జరిగిన మ్యాచుల్లో ఎదురులేని రికార్డు కలిగిన సూపర్‌స్టార్.. తాజాగా ఆసీస్‌పైనా సూపర్ ఫిఫ్టీతో అలరించాడు. చివరగా ఇక్కడ విండీస్‌పై టీ20లో అజేయంగా 94 పరుగులు చేసిన కోహ్లి.. ఆసీస్‌పై 63 పరుగుల అర్థ సెంచరీతో ఉప్పల్‌లో సూపర్ ఫామ్ చాటుకున్నాడు.