Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మిషన్ మెల్బోర్న్'లో భారత్‌కు చివరి అవకాశం!. ఐసీసీ టైటిల్ వేటలో 11 ఏండ్ల సుదీర్ఘ విరామానానికి తెరదించేందుకు టీమ్ ఇండియా గట్టి కసరత్తే చేస్తోంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ ముంగిట భారత్ చివరి ద్వైపాక్షిక సిరీస్ ఆడనుంది. స్వదేశంలో సఫారీలతో మూడు టీ20ల్లో రోహిత్‌సేన సమస్యలకు చెక్ పెట్టే ప్రయత్నం చేయనుంది. ఆస్ట్రేలియాపై సిరీస్ విజయం జట్టులో ఉత్సాహం నింపినా.. ద్వైపాక్షిక సిరీస్ విజయాలు బలహీనతలను కప్పిపుచ్చలేవని గత అనుభవాలు హెచ్చరిస్తున్నాయి!.
- రేపటి నుంచి దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్
- సమాధానాల వేటలో భారత్‌కు చివరి చాన్స్
నవతెలంగాణ క్రీడావిభాగం
పవర్ హిట్టింగ్
భారత జట్టు టీ20 ఫార్మాట్లో నయా ఫార్ములా అనుసరిస్తోంది. తొలి బంతి నుంచే ఎదురుదాడి ప్రణాళికలతో బరిలోకి దిగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన సమయంలో ఇది ఎక్కువసార్లు వికటిస్తోంది. టాప్ ఆర్డర్లో పవర్ హిట్లర్లకు కొదవ లేదు. కానీ మేరకు పరుగులు పిండుకోవాలనే కొలమానం లేకపోవటం జట్టును వేధిస్తోంది. కెఎల్ రాహుల్ మంచి హిట్టర్. కానీ అతడి దూకుడులో నిలకడ లేదు. ధనాధన్‌కు వెళ్లిన ప్రతిసారి అతడు నిరాశపరుస్తున్నాడు. స్ట్రయిక్‌రేట్ తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే నిలకడగా పరుగులు చేయగల్గుతున్నాడు. రోహిత్ శర్మ సైతం నిలకడగా రాణించటం లేదు. విరాట్ కోహ్లి ఫామ్‌లోకి రావటం జట్టుకు అతిపెద్ద ఊరట. ఛేదనలో విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ కొలబద్దంగా సాగుతోంది. కానీ టార్గెట్‌ను నిర్దేశించటంలో కోహ్లి బ్యాటింగ్ విమర్శలకు తావిస్తోంది. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్‌లు తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయటంలో ముందున్నారు. ఈ ముగ్గురు మెరిసినప్పుడే భారత్ భారీ స్కోర్లు నమోదు చేస్తోంది. 20 ఓవర్ల టీ20ల్లో పది వికెట్లు చేతిలో ఉండగా.. స్ట్రయిక్‌రేట్ మాత్రమే కీలకం అవుతోంది. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో భారత్ పవర్ హిట్టింగ్‌పై ఫోకస్ చేయాలి.
డెత్ బౌలింగ్
డెత్ ఓవర్లలో (16-20) బౌలింగ్ భారత జట్టును వేధిస్తోన్న ప్రధాన సమస్య. ఈ నాలుగు ఓవర్లలో భారత బౌలర్లు పరుగుల నియంత్రణలో తేలిపోతున్నారు. ఆసియా కప్‌లో ఈ డెత్ ఓవర్ల సమస్య భారత్‌ను టోర్నీ నుంచి నిష్క్రమించేలా చేయగా.. ఆస్ట్రేలియాతో మొహాలి టీ20లో భారీ స్కోరును సైతం కాపాడుకోలేకుండా చేసింది. చివరి 18 బంతుల్లోనే 53 పరుగులు పిండుకున్న ఆస్ట్రేలియా.. మొహాలిలో 209 టార్గెట్‌ను ఊదేసింది. ఇక హైదరాబాద్ టీ20లో సైతం చివరి ఐదు ఓవర్లలోనే ఏకంగా 63 పరుగులు సమర్పించుకున్నారు. భువనేశ్వర్ కుమార్ రెండు మ్యాచుల్లో 91 పరుగులు ఇవ్వగా.. హర్షల్ పటేల్ సైతం అదే దారిలో నడిచాడు. పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా సైతం హైదరాబాద్ మ్యాచ్‌లో 50 పరుగులు సమర్పించుకోవటం గమనార్హం. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో పుంజుకునేందుకు సౌకర్యం ఉంటుంది. కానీ ప్రపంచకప్‌లో ఒక చెత్త మ్యాచ్‌తో టోర్నీ నుంచి వెనుదిరగాల్సిన ప్రమాదం ఏర్పడుతుంది. స్పిన్నర్ అక్షర్ పటేల్ మాయజాలం భారత్‌కు గొప్ప అనుకూలత. చాహల్ సైతం అతడితో జట్టుకడితే మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థి దూకుడుకు అడ్డుకట్ట వేయవచ్చు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో చాహల్ మెరవాల్సిన అవసరం ఉంది. అర్షదీప్ సింగ్ రాకతో డెత్ ఓవర్లలో మెరుగుదల వస్తుందేమో చూడాలి. అర్షదీప్, బుమ్రాలు డెత్ ఓవర్లలో అత్యుత్తమ ఎకానమీ సాధించిన పేసర్లు. ఈ ఇద్దరు చివర్లో నాలుగు ఓవర్లు పంచుకుంటే.. ప్రత్యర్థికి పరుగుల వేట అంత సులువు కాబోదు. దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచులు ఈ కాంబినేషన్ ప్రభావం చూడనున్నాయి!.
ఫీల్డింగ్, క్యాచింగ్
యువ రక్తంతో నిండిన టీ20 జట్టులో ఫీల్డింగ్ లోపాలు అసహజం!. కానీ భారత జట్టు విచిత్రంగా ఫీల్డింగ్ లోపాలు చవిచూస్తోంది. జట్టులో అత్యుత్తమ ఫీల్డర్లు సైతం సులువైన క్యాచులు నేల పాలు చేస్తున్నారు. ఇక సర్కిల్ లోపల వేగంగా కదులుతూ రనౌట్ చేయటంలో వెనుకబాటు స్పష్టంగా తెలుస్తోంది. హర్షల్ పటేల్, అక్షర్ పటేల్, విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్ వంటి మేటీ ఫీల్డర్లు ఆస్ట్రేలియాతో సిరీస్‌లో విలువైన క్యాచులు జారవిడిచారు. ఫలితానికి అటు, ఇటు వ్యత్యాసం అత్యంత స్వల్పంగా ఉండే మ్యాచుల్లో క్యాచులు వదిలేయటం అంటే మ్యాచ్‌పై పట్టును విడిచిపెట్టడమే అవుతుంది. టీ20 ప్రపంచకప్ ముంగిట భారత జట్టు ఫీల్డింగ్, క్యాచింగ్లపై సైతం దృష్టి నిలపాల్సిన అవసరం ఉంది.
వరల్డ్ నం.1 భారత్
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానం పదిలం చేసుకుంది. ఆస్ట్రేలియాపై 2-1తో సిరీస్ నెగ్గిన భారత్ రెండో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ కంటే ఏడు పాయింట్ల ముందంజలో నిలిచింది. పాక్ చేతిలో ఇంగ్లాండ్ ఓటమి సైతం భారత్‌కు కలిసివచ్చింది. భారత్ (268), ఇంగ్లాండ్ (261), దక్షిణాఫ్రికా (258), పాకిస్తాన్ (258), న్యూజిలాండ్ (252), ఆస్ట్రేలియా (250)లు టాప్-6లో కొనసాగుతున్నాయి. సఫారీపై సిరీస్ విజయంతో టీ20 వరల్డ్‌కప్‌కు వరల్డ్ నం.1గా బరిలోకి దిగేందుకు భారత్ రంగం సిద్ధం చేసుకుంటోంది.
సఫారీలు వచ్చేశారు : భారత్‌తో మూడు టీ20, మూడు వన్డేల సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టు భారత్‌లో అడుగుపెట్టింది. తొలి టీ20 వేదిక తిరువనంతపురంలో సఫారీ ఆటగాళ్లకు సోమవారం ఘన స్వాగతం లభించింది. హోటల్‌కు చేరుకున్న దక్షిణాఫ్రికా క్రికెటర్లు.. సోమవారమే ప్రాక్టీస్ సైతం మొదలెట్టారు. కెప్టెన్ భవుమా, క్వింటన్ డికాక్, లుంగిసాని ఎంగిడి, క్లాసెన్, స్టబ్స్‌లు ప్రాక్టీస్ సెషన్లో చెమటోడ్చారు.