Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సభ్యుల అభ్యంతరాల స్వీకరణ
- పలు రికార్డులు స్వాధీనం
- అక్టోబర్ 3న తర్వాత కార్యాచరణ
నవతెలంగాణ-హైదరాబాద్
సుప్రీంకోర్టు నియమిత హెచ్‌సీఏ పర్యవేక్షణ కమిటీ సోమవారం ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సమావేశమైంది. కమిటీ చీఫ్ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ, సభ్యులు ఏసీబీ డైరెక్టర్ అంజనీ కుమార్, మాజీ క్రికెటర్ వెంకటపతి రాజు, వంక ప్రతాప్‌లు సమావేశంలో భాగంగా అపెక్స్ కౌన్సిల్ సభ్యులను ఇంటర్వ్యూ చేశారు!. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ)లో నెలకొన్న సమస్యలు, వివాదాలు, అభ్యంతరాలపై సవివరణంగా సభ్యుల నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసినట్టు సమాచారం. అపెక్స్ కౌన్సిల్, ఆఫీస్ బేరర్ల పదవీ కాలం అక్టోబర్ 26న ముగిసిన విషయాన్ని సైతం కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. హెచ్‌సీఏ సంబంధిత అన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్న కమిటీ.. అపెక్స్ కౌన్సిల్, జనరల్ బాడీలో తీసుకున్న నిర్ణయాలు, మినిట్స్‌ను పరిశీలించనుంది. హెచ్‌సీఏ అధ్యక్ష, కార్యదర్శులు మహ్మద్ అజహరుద్దీన్, విజయానంద్లు కలిసి కమిటీ ఎదుట హాజరైనట్టు సమాచారం. హెచ్‌సీఏ మాజీ కార్యదర్శి శేషు నారాయణ, జాన్ మనోజ్, సురేందర్ అగర్వాల్ సహా తదితరులు కమిటీ ఎదుట హాజరయ్యారు.
'మ్యాచ్ నిర్వహణ పనుల్లో ఉండటంతో కమిటీ సమావేశం ఆలస్యమైంది. టీ20 మ్యాచ్ విజయవంతం కావటం తెలంగాణ, దేశానికి గర్వకారణం. మ్యాచ్ నిర్వహణకు మాత్రమే హెచ్‌సీఏకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాం. ఇతర అంశాలకు అది వర్తించదు. హెచ్‌సీఏ వివాదాలపై నివేదిక సమర్పించేందుకు సుప్రీంకోర్టు మూడు నెలల సమమం ఇచ్చింది. చాలా మంది సభ్యులు కమిటీ ముందు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అన్నింటిని లిఖితపూర్వకంగా అందజేయాల్సిందిగా కోరాం. హెచ్‌సీఏకు సంబంధించిన అన్ని రికార్డులు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నాం. వీటిని పరిశీలించేందుకు కాస్త సమయం అవసరం. అక్టోబర్ 3న తర్వాత హెచ్‌సీఏ సమస్యలపై స్పందిస్తాం. మ్యాచ్ నిర్వహణకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు ఉన్నా కమిటీ దృష్టికి తీసుకొస్తే పరిశీలిస్తామని' జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ తెలిపారు.