Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భువి, హర్షల్‌కు మద్దతు
- భారత కెప్టెన్ రోహిత్ శర్మ
నవతెలంగాణ-హైదరాబాద్
'దూకుడు పెరగాలి, ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించాలి'.. ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ విజయం అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు. మూడు మ్యాచుల సిరీస్‌ను 2-1తో నెగ్గిన టీమ్ ఇండియా.. సిరీస్ విజయం, ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నట్టు రోహిత్ తెలిపాడు. అయినా, ప్రపంచకప్ ముంగిట జట్టు మరింత దూకుడుగా ఆడాలని, ప్రత్యర్థిపై ఆధిపత్యం మరింతగా పెరగాలని అనుకుంటున్నట్టు రోహిత్ తెలిపాడు. హైదరాబాద్ టీ20 అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రోహిత్ శర్మ పలు అంశాలపై స్పందించాడు. ఆ విషయాలు..
సంతృప్తికరం : సిరీస్ విజయం పట్ల సంతృప్తిగా ఉంది. ప్రణాళికల ప్రకారం, అనుకున్నవి సాధించాం. అన్ని విభాగాలను బలోపేతం చేయాలని మా వ్యూహం. గత కొన్ని మ్యాచులుగా బ్యాటింగ్ గొప్పగా సాగుతోంది. అయితే, ఇంకాస్త దూకుడు, ఆధిపత్యం పెరగాలని అనుకుంటున్నాను. బౌలింగ్ విభాగంలో కొన్ని చిక్కులు ఉన్నాయి. ఫీల్డింగ్‌పైనా ఫోకస్ పెడతాం. ప్రస్తుతానికి జట్టు పూర్తి ఫోకస్ బౌలింగ్‌పైనే ఉంది.
సూర్య సూపర్ : సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అతడు బరిలోకి దిగిన ప్రతిసారి తన ఆటను మరో స్థాయికి తీసుకెళ్తున్నాడు. హైదరాబాద్ మ్యాచ్‌లో పవర్‌ప్లేలోనే రెండు వికెట్లు పడినా.. విరాట్‌తో కలిసి సూర్య భాగస్వామ్యం మ్యాచ్‌ను భారత్ వశం చేసింది. సూర్య ఎంతటి సత్తా గల ఆటగాడో మాకు బాగా తెలుసు. ప్రత్యర్థి నుంచి అతడు మ్యాచ్‌ను లాగేసుకున్న తీరు అమోఘం.
జట్టుకు కీలకం! : భువనేశ్వర్ కుమార్ భారత్‌కు ఆడినప్పుడు గొప్ప ప్రదర్శనలే ఎక్కువగా ఉన్నాయి. కొన్ని మాత్రమే బాగా రాణించలేదు. ప్రతి ఆటగాడికి ఇది సహజం. డెత్ ఓవర్లలో భువనేశ్వర్ కుమార్‌ను ప్రయోగించే ఆప్షన్లు మరిన్ని చూస్తున్నాం. భువిలో ఆత్మవిశ్వాసం ఏమాత్రం తగ్గలేదు. కొన్ని మ్యాచుల ప్రదర్శన అతడి స్థాయిని తక్కువ చేయలేదు. జట్టుకు అతడికి అండగా నిలవాల్సిన సమయం ఇది. గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేయటం అంత సులువు కాదు. హర్షల్ పటేల్ జట్టుకు కీలక ఆటగాడు. రానున్న సిరీస్‌లో అతడు కుదురుకుంటాడు. హర్షల్ ఫామ్‌లోకి రావటానికి పెద్దగా సమయం పడుతుందని అనుకోవటం లేదు.
ఆ ఇద్దరూ అవసరం : జట్టు ప్రణాళికలకు అనుగుణంగా రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్ తుది జట్టులో ఉంటారు. 11 మంది మాత్రమే బరిలో నిలుపగలం. ఎడమ చేతి వాటం బ్యాటర్ అవసరం అనుకుంటే పంత్ ఉంటాడు, ఇతర ప్రణాళికలు ఏమైనా ఉంటే కార్తీక్‌కు చోటిస్తాం. ఆ రోజు మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగానే నిర్ణయం ఉంటుంది. కార్తీక్‌కు పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం దక్కలేదు. పంత్‌కు సైతం మ్యాచ్ ప్రాక్టీస్ అవసరం. సఫారీతో సిరీస్‌లో జట్టు ప్రణాళికలపై ఇప్పుడే చెప్పలేను. కానీ ఇద్దరిని జట్టు జాగ్రత్తగా ప్రయోగించాల్సి ఉంది. ప్రపంచకప్ ప్రణాళికల్లో పంత్, కార్తీక్‌లు మాకు కీలకం.