Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూడు మ్యాచులు. మూడు సమస్యలు!.పవర్ హిట్టింగ్, డెత్ బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో మెరుగయ్యేందుకు టీమ్ ఇండియా సఫారీతో సిరీస్‌కు సిద్ధమవుతోంది. ఐసీసీ 2022 టీ20 ప్రపంచకప్ ముంగిట భారత్‌కు ఇదే తుది సన్నాహకం. ప్రపంచకప్‌లో ధనాధన్ షోపై కన్నేసిన రోహిత్‌సేన.. ఈ మూడు టీ20ల్లో ఆ ప్రణాళిక అమలు చేసేందుకు రంగంలోకి దిగుతోంది. వరల్డ్ నం.1 భారత్ సవాల్‌ను ఎదుర్కొనేందుకు వరల్డ్ నం.3 దక్షిణాఫ్రికా సైతం సిద్ధంగా ఉంది. పొట్టి ప్రపంచకప్ ముంగిట సఫారీ, భారత్ తుఫాన్ షురూ!.
- రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
- దక్షిణాఫ్రికాతో తొలి టీ20 నేడు
- దూకుడుపై కన్నేసిన టీమ్ ఇండియా
నవతెలంగాణ-తిరువనంతపురం
ఐసీసీ టీ20 ప్రపంచకప్ సమీపిస్తోంది. వరల్డ్ నం.1 టీమ్ ఇండియా టైటిల్‌పై కన్నేసింది. ఆ కల తీర్చుకునేందుకు, భారత్ ఎదుట కొన్ని సమస్యలు ఉన్నాయి. మూడు మ్యాచులు మాత్రమే మిగిలి ఉండటంతో టీమ్ ఇండియా తుది ప్రణాళికలను ఇక్కడ రిహార్సల్‌గా అమలు చేయనున్నారు. తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు భారత బ్యాటర్ల పవర్ హిట్టింగ్ సమస్యగా మారింది. అందుకే, ఈ సిరీస్‌లో భారత్ అవసరమైతే తొలుత బ్యాటింగ్ ఎంచుకుని స్వీయ సవాల్ స్వీకరించే అవకాశం లేకపోలేదు. మరోవైపు, దక్షిణాఫ్రికా సైతం బలంగా ఉంది. ఆ జట్టులో హిట్టర్లకు కొదవలేదు. నాణ్యమైన పేసర్లు సైతం ఉన్నారు. క్వింటన్ డికాక్‌కు భారత్‌కు తిరుగులేని రికార్డుంది. భారత్, దక్షిణాఫ్రికా తొలి టీ20 నేడు.
డెత్‌లో మెరుస్తారా? : విఫల ప్రయత్నం ఆసియా కప్ సహా ఆస్ట్రేలియా సిరీస్‌లో భారత్ బ్యాటింగ్ ఇక్కట్లు చూడలేదు. బ్యాటర్లు అందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. ప్రతిసారి ఒకరిద్దరు అద్వితీయ ప్రదర్శనలతో చెలరేగుతున్నారు. అయినా, టాప్ ఆర్డర్లో కెఎల్ రాహుల్ నిలకడ సాధించాల్సి ఉంది. మిడిల్ ఆర్డర్లో రిషబ్ పంత్‌కు మ్యాచ్ ప్రాక్టీస్ అవసరం ఏర్పడగా.. దినేశ్ కార్తీక్ చివర్లో ఎక్కువ బంతుల్ని ఎదుర్కొవాల్సి ఉంది. హార్దిక్ పాండ్యకు విశ్రాంతి ఇవ్వటంతో టాప్ ఆర్డర్ బాధ్యత మరింత పెరగనుంది. పంత్‌కు ఆసీస్ సిరీస్‌లో బ్యాట్ పట్టే అవకాశమే దక్కలేదు. దీంతో పాండ్య స్థానంతో పంత్ నేరుగా తుది జట్టులోకి రానున్నాడు. విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ హైదరాబాద్‌లో అదరగొట్టారు. అదే జోరు దక్షిణాఫ్రికాపై చూపించేందుకు సిద్ధమవుతున్నారు.
సఫారీతో సిరీస్‌లో భారత్ ప్రధానంగా ఎదుర్కొంటున్న సవాల్ డెత్ ఓవర్లలో బౌలింగ్. భువనేశ్వర్ కుమార్ నిలకడగా డెత్ ఓవర్లో చేతులెత్తేశాడు. ఈ సిరీస్‌లో భువికి విశ్రాంతి లభించింది. డెత్ ఓవర్లలో ఉత్తమ పేసర్ అర్షదీప్ సింగ్‌తో కలిసి జశ్‌ప్రీత్ బుమ్రా చివరి నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేయనున్నాడు. డెవిడ్ మిల్లర్ వంటి ప్రమాదకర హిట్టర్‌ను ఈ జోడీ ఏ విధంగా నిలువరిస్తుందో చూడాలి. భువనేశ్వర్ స్థానంలో దీపక్ చాహర్ కొత్త బంతిని అందుకోనున్నాడు. హార్దిక్ పాండ్య లేకపోవటంతో.. ఐదుగురు బౌలర్లతోనే భారత్ బరిలోకి దిగుతోంది. అక్షర్ పటేల్, యుజ్వెంద్ర చాహల్ స్పిన్ విభాగంలో ఉండగా.. దీపక్ చాహర్, అర్షదీప్ సింగ్, జశ్‌ప్రీత్ బుమ్రాలు పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు.
కూర్పు కష్టాలు : సఫారీ సారథి తెంబ బవుమా తన నియంత్రణలో లేని సమస్యలను ఎదుర్కొంటున్నాడు. సఫారీ టీ20 లీగ్ ఎస్ఏ20 వేలంలో అమ్ముడుపోలేదు!. విరామం అనంతరం జట్టులోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో గత నాలుగు మ్యాచుల్లో మూడు అర్థ సెంచరీలు బాదిన ఓపెనర్ రీజా హెండ్రిక్స్ బెంచ్‌కు పరిమితం కానున్నాడు. స్ట్రయిక్‌రేట్‌పై విమర్శలు ఎదుర్కొంటున్న బవుమా.. వరల్డ్‌కప్ ముంగిట ఆ సవాల్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాడు. సఫారీ జట్టులో భారత్‌కు ప్రధానంగా సవాల్ విసరుతున్న బ్యాటర్లు ముగ్గురు. టాప్‌లో క్వింటన్ డికాక్, మిడిల్లో ఎడెన్ మార్కరం, లోయర్‌లో డెవిడ్ మిల్లర్లు బౌలర్ల కష్టం పెంచనున్నారు. ఈ ముగ్గురు బ్యాటర్లను నిలువరించటంపైనే భారత బౌలర్ల ఫోకస్ కనపడనుంది. ఇక బౌలింగ్ విభాగంలో కగిసో రబాడ, మార్కో జాన్సెన్, డ్వేన్ ప్రిటోరియస్, ఎన్రిచ్ నోకియాలతో పాటు షంషి ఉండనున్నాడు. యువ కెరటం ట్రిస్టన్ స్టబ్స్, రైలీ రొస్సో సత్తా చాటేందుకు ఎదురుచూస్తున్నారు.
పిచ్, వాతావరణం : తిరువనంతపురంలో నేడు వర్ష సూచనలు ఉన్నాయి. మ్యాచ్‌కు చిరుజల్లులతో కూడిన వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఎక్కువగా ఉంది. గ్రీన్‌ఫీల్డ్ మైదానంలో ఇప్పటివరకు రెండు టీ20లే జరిగాయి. బ్యాటర్లకు, బౌలర్లకు సమతూకంగా పిచ్ అనుకూలిస్తుందనే అంచనాలు కనిపిస్తున్నాయి. టాస్ నెగ్గిన జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకునేందుకు మొగ్గుచూపవచ్చు.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), దీపక్ చాహర్, అర్షదీప్ సింగ్, జశ్‌ప్రీత్ బుమ్రా, యుజ్వెంద్ర చాహల్.
దక్షిణాఫ్రికా : క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), తెంబ బవుమా (కెప్టెన్), రైలీ రొసో, ఎడెన్ మార్కరం, డెవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, డ్వేన్ ప్రిటోరిస్, మార్కో జాన్సెన్, కగిసో రబాడ, ఎన్రిచ్ నోకియా, తబ్రియజ్ షంషి.