Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిరీస్ విడుదల చేసిన ఫిఫా
న్యూఢిల్లీ : 'మీకు క్రిస్టియానో రొనాల్డో తెలుసు. లియోనల్ మెస్సీ కథ తెలుసు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ జాబితాలో మూడో స్థానంలో ఆటగాడు సునీల్ ఛెత్రి కథ గురించి ఇప్పుడు తెలుసుకోండి' అంటూ ప్రపంచ ఫుట్‌బాల్ గవర్నింగ్ బాడీ ఫిఫా మూడు ఎపిసోడ్ల సిరీస్ విడుదల చేస్తూ వ్యాఖ్యానించింది. 2005లో భారత్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సునీల్ ఛెత్రి 18 ఏండ్ల సుదీర్ఘ కెరీర్లో 131 మ్యాచుల్లో ఆడాడు. 84 అంతర్జాతీయ గోల్స్ నమోదు చేశాడు. పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో (117), అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ (90)లు గోల్స్ పరంగా ఛెత్రి కంటే ముందంజలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆడుతున్న సాకర్ ఆటగాళ్లలో సునీల్ ఛెత్రి ప్రస్థానం అసమానమని ఫిఫా పేర్కొంది. మూడు ఎపిసోడ్లలో భాగంగా సునీల్ ఛెత్రి ఫుట్‌బాల్ ప్రయాణం, వ్యక్తిగత జీవితం, ఆటలో దిగ్గజంగా ఎదిగిన తీరు, సాధించిన ఘనతలను ఫిఫా దృశ్య రూపకంగా చూపించింది. సునీల్ ఛెత్రి సిరీస్‌ను ఫిఫా ప్లస్‌లో చూడవచ్చు. ఇక సునీల్ ఛెత్రి కెరీర్‌ను ప్రతిబింబిస్తూ ఫిఫా సిరీస్ విడుదల చేయటం పట్ల భారత క్రీడా దిగ్గజాలు, అభిమానులు సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. 38 ఏండ్ల సునీల్ ఛెత్రి భారత ఫుట్‌బాల్ ముఖచిత్రంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.