Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్షదీప్, దీపక్ నిప్పులు
- రాణించిన రాహుల్, సూర్య
- తొలి టీ20లో భారత్ గెలుపు
స్వింగ్..స్వింగ్.. స్వింగ్. గ్రీన్‌ఫీల్డ్ పిచ్‌పై స్వింగ్‌కు సఫారీలు విలవిల్లాడారు. ఔట్‌స్వింగర్లతో మొదలెట్టి.. ఇన్స్వింగర్లతో వికెట్లను గిరాటేసిన అర్షదీప్, చాహర్ కొత్త బంతితో కోలాటం చేశారు!. 9 పరుగులకే ఐదు ప్రధాన వికెట్లు పడగొట్టి అద్వితీయ ప్రదర్శన చేశారు. బౌలింగ్ సమస్య చర్చ స్వరం పెరుగుతున్న తరుణంలో పేసర్లు స్వింగ్‌తో బదులిచ్చారు. రాహుల్ (51), సూర్య (51) మెరవటంతో 107 పరుగుల లక్ష్యాన్ని భారత్ అలవోకగా ఛేదించింది.
నవతెలంగాణ-తిరువనంతపురం
పేసర్లు అర్షదీప్ సింగ్ (3/32), దీపక్ చాహర్ (2/24), హర్షల్ పటేల్ (2/26) నిప్పులు చెరిగారు. వికెట్‌కు ఇరువైపులా బంతిని స్వింగ్ చేసిన భారత పేసర్లు దక్షిణాఫ్రికా బ్యాటర్లకు ముకుతాడు వేశారు. పవర్‌ప్లేలోనే 9 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టి పవర్ఫుల్ ప్రదర్శన చేసిన అర్షదీప్, చాహర్ భారత్‌కు అలవోక విజయాన్ని కట్టబెట్టారు. పేసర్ల మెరుపులతో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 106/8 పరుగులే చేసింది. కేశవ్ మహరాజ్ (41, 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఎడెన్ మార్కరం (25, 24 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), పార్నెల్ (24, 37 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) దక్షిణాఫ్రికాను ఆదుకున్నారు. ఛేదనలో కెఎల్ రాహుల్ (51 నాటౌట్, 56 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), సూర్య కుమార్ యాదవ్ (50 నాటౌట్, 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) మూడో వికెట్‌కు అజేయంగా 93 పరుగులు జోడించిగా, భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
సులువుగా ఛేదన : 107 పరుగుల ఛేదనలో ఆరంభంలో భారత్ తడబడింది. రోహిత్ శర్మ (0), విరాట్ కోహ్లి (3) విఫలమయ్యారు. పవర్‌ప్లేలో భారత్ 17/1తో అత్యల్ప స్కోరుకు పరిమితమైంది. కానీ కెఎల్ రాహుల్ (51 నాటౌట్)తో జతకట్టిన సూర్యకుమార్ (50 నాటౌట్) పరుగుల వేటలో దూసుకెళ్లాడు. వచ్చీ రాగానే రెండు సిక్సర్లు బాదిన సూర్య.. అదే జోరు కొనసాగించాడు. చివరి బంతికి సిక్సర్‌తో రాహుల్ అర్థ సెంచరీ పూర్తి చేయగా.. అంతకముందు సింగిల్‌తో సూర్య అర్థ శతకం నమోదు చేశాడు. 16.4 ఓవర్లలో లాంఛనం ముగించిన భారత్ సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.
హైలైట్స్ తరహా ఆరంభం! : టాస్ నెగ్గిన తొలుత బౌలింగ్ ఎంచుకున్న భారత్‌కు..పవర్‌ప్లే పూర్తిగా హైలైట్స్ తరహాలో సాగింది. ఇన్నింగ్స్ ఆరో బంతికి కండ్లుచెదిరే ఇన్‌స్వింగర్‌తో బవుమా (0)ను చాహర్ బోల్తా కొట్టించగా.. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో అర్షదీప్ సింగ్ సంచలన ప్రదర్శన చేశాడు. లెంగ్త్ బంతితో డికాక్ వికెట్లను గిరాటేసిన అర్షదీప్.. చివరి రెండు బంతులకు వరుసగా రౌలీ రొసో (0), డెవిడ్ మిల్లర్ (0)లను సాగనంపాడు. కెరీర్ భీకర ఫామ్‌లో ఉన్న ఈ ముగ్గురు బ్యాటర్లను ఒకే ఓవర్లో వెనక్కి పంపిన అర్షదీప్ సింగ్ దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించాడు. యువ ఆటగాడు స్టబ్స్ (0) సైతం చాహర్‌కు వికెట్ కోల్పోవటంతో 9 పరుగులకే సఫారీలు ఐదు వికెట్లు చేజార్చుకున్నారు. కష్టాల్లో ఉన్న సఫారీలను మార్కరం (25, 24 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), టెయిలెండర్ కేశవ్ మహరాజ్ (41, 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), పార్నెల్ (24, 37 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) ఆదుకున్నారు. పార్నెల్తో కలిసి మార్కరం ఆరో వికెట్‌కు విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. మహరాజ్ మెరుపులతో దక్షిణాఫ్రికా 106 పరుగులు చేయగల్గింది.
బుమ్రాకు గాయం?
దక్షిణాఫ్రికాతో తొలి టీ20కి పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌లో వెన్ను నొప్పిపై జట్టు ఫిజియోను బుమ్రా సంప్రదించాడు. దీంతో తొలి మ్యాచ్‌కు బుమ్రాను తుది జట్టు కూర్పునకు పరిగణనలోకి తీసుకోలేదు. బుమ్రా ఫిట్‌నెస్‌పై బీసీసీఐ, జట్టు మేనేజ్మెంట్ తదుపరి సమాచారం ఇవ్వలేదు.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ : డికాక్ (బి) అర్షదీప్ 1, బవుమా (బి) చాహర్ 0, రోసో (సి) పంత్ (బి) అర్షదీప్ 0, మార్కరం (ఎల్బీ) హర్షల్ 25, మిల్లర్ (బి) అర్షదీప్ 0, స్టబ్స్ (సి) అర్షదీప్ (బి) చాహర్ 0, పార్నెల్ (సి) సూర్య (బి) అక్షర్ 24, మహరాజ్ (బి) హర్షల్ 41, రబాడ నాటౌట్ 7, నొకియా నాటౌట్ 2, ఎక్స్‌ట్రాలు : 6, మొత్తం :(20 ఓవర్లలో 8 వికెట్లకు) 106. వికెట్ల పతనం : 1-1, 2-1, 3-8, 4-8, 5-9, 6-42, 7-68, 8-101.
బౌలింగ్ : దీపక్ చాహర్ 4-0-24-2, అర్షదీప్ 4-0-32-3, అశ్విన్ 4-1-8-0, హర్షల్ 4-0-26-2, అక్షర్ 4-0-16-1.
భారత్ ఇన్నింగ్స్ : రాహుల్ నాటౌట్ 51, రోహిత్ (సి) డికాక్ (బి) రబాడ 0, కోహ్లి (సి) డికాక్ (బి) నోకియా 3, సూర్య నాటౌట్ 50, ఎక్స్‌ట్రాలు : 6, మొత్తం : (16.4 ఓవర్లలో 2 వికెట్లకు) 110.
వికెట్ల పతనం : 1-9, 2-17.
బౌలింగ్ : రబాడ 4-1-16-1, పార్నెల్ 4-0-14-0, నొకియా 3-0-32-1, షంషి 2.4-0-27-0, మహరాజ్ 3-0-21-0.