Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీ20 ప్రపంచకప్‌కు అనుమానమే
- పేస్ దళపతికి స్ట్రెస్ ఫ్రాక్చర్
- భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ
11 ఏండ్ల నిరీక్షణకు కంగారూ గడ్డపై తెరదించేందుకు ఓ వైపు సమర సన్నాహకం జరుగుతుండగా.. టీమ్ ఇండియా పేస్ దళపతికి గాయం వార్త అభిమానులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. వెన్నునొప్పితో దక్షిణాఫ్రికాతో తొలి టీ20కి దూరమైన జశ్‌ప్రీత్ బుమ్రా.. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో రానున్న ప్రతిష్టాత్మక ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు సైతం దూరమయ్యే ప్రమాదం ఉందని సమాచారం!.
నవతెలంగాణ-బెంగళూర్
2021 ఐసీసీ టీ20 ప్రపంచకప్ విఫల పోరాటం. 2022 ఆసియా కప్ టీ20 టోర్నీ విఫల ప్రయత్నం. నాయకుడిగా విరాట్ కోహ్లి అందించలేని ఐసీసీ టైటిల్.. రోహిత్ శర్మ కొట్టుకొస్తాడనే ఆశలు వేట ఆరంభానికి ముందే ఆవిరయ్యే ప్రమాదం ముంచుకొచ్చింది!. కెరీర్ భీకర ఫామ్‌లో ఉన్న స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మోకాలి గాయంతో ఇప్పటికే టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. తాజాగా భారత శిబిరంలో మరో బాంబ్ పేలింది!. పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా సైతం టీ20 ప్రపంచకప్ వేటకు ఆస్ట్రేలియా వెళ్లే అవకాశం లేదని సమాచారం. ఇద్దరు కీలక ఆటగాళ్లను గాయాల రూపంలో కోల్పోవటం భారత జట్టు అభిమానులను కలవరపాటుకు గురి చేస్తోంది.
ఎన్సీఏకు బుమ్రా : దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో జశ్‌ప్రీత్ బుమ్రా ఉన్నాడు. హైదరాబాద్ టీ20 అనంతరం జట్టు నేరుగా తిరువనంతపురం చేరుకుంది. మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సందర్భంగా జశ్‌ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి ఉందంటూ జట్టు ఫిజియో దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో బుమ్రాను పరిస్థితిని పరిశీలించిన బీసీసీఐ వైద్య బృందం అతడికి తొలి టీ20లో విశ్రాంతి అందించింది. అయితే, నొప్పి తీవ్రత దృష్ట్యా జశ్‌ప్రీత్ బుమ్రా తిరువనంతపురం నుంచి బెంగళూర్‌కు చేరుకున్నాడు.
స్ట్రెస్ ఫ్రాక్చర్ : జాతీయ క్రికెట్ అకాడమీలో జశ్‌ప్రీత్ బుమ్రాకు మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. గురువారమే ఇక్కడికి చేరుకున్న బుమ్రాకు బీసీసీఐ మెడికల్ టీమ్ యుద్ధ ప్రాతిపదికన పరీక్షలు చేసింది. ఇక్కడ స్కాన్ నివేదికల్లో బుమ్రా స్ట్రెస్ ఫ్రాక్చర్‌తో బాధపడుతున్నట్టు తేలినట్టు సమాచారం!. వెన్నుముక స్ట్రెస్ ఫ్రాక్చర్‌కు ఎటువంటి శస్త్రచికిత్స అవసరం ఉండదు. కానీ ఆ గాయానికి గరిష్టంగా 6 మాసాలు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది.
గతంలో ఇలాగే.. : జశ్‌ప్రీత్ బుమ్రాకు వెన్నునొప్పి గాయం ఇప్పుడు తొలిసారి కాదు. 2019లోనూ బుమ్రా వెన్నునొప్పి గాయంతో మూడు నెలల పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు. ఇక వెన్నునొప్పి గాయంతోనే ఆసియా కప్‌కు సైతం బుమ్రా దూరంగానే ఉన్నాడు. జాతీయ క్రికెట్ అకాడమీలో పూర్తి ఫిట్నెస్ సాధించి, రిహాబిలిటేషన్ పూర్తి చేసుకున్న బుమ్రా.. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు పునరాగమనం చేశాడు. ఆ సిరీస్‌లో రెండు మ్యాచుల్లో బంతి అందుకున్నాడు. నాగ్‌పూర్‌లో 1/23, హైదరాబాద్‌లో 0/50 గణాంకాలు నమోదు చేశాడు.
ఆడే చాన్స్ లేదు? : ఓ వైపు ఎన్సీఏలో బుమ్రా వైద్య పరీక్షల నివేదికలపై బీసీసీఐ వర్గాలు లీకులు ఇవ్వటం మొదలెట్టాయి!. పీటీఐ వార్తసంస్థతో ఓ బీసీసీఐ అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. 'టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా ఆడటం లేదు. బుమ్రా వెన్నునొప్పి గాయం చాలా తీవ్రమైనది. బుమ్రా స్ట్రెస్ ఫ్రాక్చర్‌కు గురయ్యాడు. అందుకు కనీసం ఆరు నెలలు క్రికెట్‌కు విరామం ఇవ్వకతప్పదు' అని తెలిపాడు. బీసీసీఐ అధికారి వ్యాఖ్యలతో పీటీఐ వార్త వెలువడగానే.. బుమ్రా ప్రపంచకప్‌కు దూరమయ్యాడని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.
అయినా.. ఆస్ట్రేలియాకు..! : ఓ వైపు బుమ్రా ప్రపంచకప్‌కు దూరమయ్యాడని వార్తలు వినిపిస్తుండగా.. బీసీసీఐ వైద్య బృందం ఆలోచనలు మరో విధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బుమ్రాను ఎన్సీఏలో ఉంచనున్నారు. టీ20 ప్రపంచకప్‌కు టీమ్ ఇండియా బయల్దేరే సమయానికి జశ్‌ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ను చూసి ఓ నిర్ణయానికి రానున్నారు. ఒకవేళ బుమ్రా 2-3 వారాల్లో కోలుకునే అవకాశం ఉంటే.. అతడిని జట్టుతో పాటే ఆస్ట్రేలియాకు పంపించనున్నారు. టోర్నీ ఆరంభంలో తుది జట్టులో నిలువకపోయినా.. చివర్లో కీలక మ్యాచులకైనా అందుబాటులో ఉంటాడనే అంచనాలతో ఎన్సీఏ ఉన్నట్టు సమాచారం.
బోర్డు కింకర్తవ్యం?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అభిమానులతో సమాచారం పంచుకునేందుకు ఏనాడు ఇష్టపడలేదు. ఇప్పుడూ అదే పరిస్థితి కనిపిస్తోంది. స్టార్ పేసర్, కీలక ఆటగాడు జశ్‌ప్రీత్ బుమ్రా గాయంతో ప్రపంచకప్‌కు దూరమయ్యాడనే వార్తలు వచ్చినా.. బీసీసీఐ నుంచి ఎటువంటి సమాచారం లేకపోవటం శోచనీయం. వార్తలను సమర్థిస్తూ లేదా ఖండిస్తూ బోర్డు నుంచి వివరణ ఉండాల్సింది. బుమ్రా గాయంపై వైద్య బృందం అభిప్రాయాలను అభిమానులతో పంచుకోవాల్సిన అవసరం బీసీసీఐకి ఎంతైనా ఉంది. బోర్డు ఈ విషయంలో మౌనంగా ఉండటంతో.. లీకుల సమాచారం గందరగోళ పరిస్థితికి తెరతీసింది.
సోషల్ మీడియాలో వైరల్
జశ్‌ప్రీత్ బుమ్రాకు గాయం, టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యే ప్రమాదం ఉందనే వార్త సోషల్ మీడియాలో దావానంలో వ్యాపించింది. ఆసియా కప్‌లో బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపించగా.. రానున్న టీ20 ప్రపంచకప్‌లో భారత బౌలింగ్ పరిస్థితి ఏమిటనే ఆందోళన అభిమానులు వ్యక్తం చేశారు. ఓ నెటిజన్ మాత్రం కాస్త భిన్నంగా స్పందించాడు. ' బుమ్రా లేకపోవటం కచ్చితంగా పెద్ద లోటు. కానీ శ్రీశాంత్, ఆర్పీ సింగ్, జోగిందర్ శర్మ, ఇర్ఫాన్ పఠాన్ వంటి పేసర్లతో టీ20 ప్రపంచకప్ సాధించాం. ఇప్పుడూ అదే స్ఫూర్తితో అండర్‌డాగ్‌గా బరిలోకి దిగి ఆడి చూడండి. ఏమైతది.. మహా అయితే ఇంకోసారి గ్రూప్ దశ నుంచే నిష్క్రమిస్తారంతే!' అని ట్వీట్ చేశాడు.
సిరాజ్‌కు అవకాశం?
జశ్‌ప్రీత్ బుమ్రా నిజంగానే, ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు దూరమైతే భారత జట్టులో నిలిచే మరో పేసర్ ఎవరనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. స్టాండ్‌బై పేసర్‌గా ఉన్న మహ్మద్ షమిని తుది జట్టులోకి ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది. లేదంటే, ఐపీఎల్లో విశేషంగా ఆకట్టుకున్న హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను పిలిపించే అవకాశం ఉంది. షమిని జట్టులోకి తీసుకున్నా.. మహ్మద్ సిరాజ్‌ను షమి స్థానంలో స్టాండ్‌బైగా ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఉమేశ్ యాదవ్ సైతం చోటు ఆశిస్తున్నా.. మహ్మద్ సిరాజ్‌కు మొగ్గు కనిపిస్తోంది.