Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రియా సబూకు బంగారు పతకం
- నెట్‌బాల్ జట్టుకు సిల్వర్ మెడల్
- 36వ జాతీయ క్రీడలు
నవతెలంగాణ-అహ్మదాబాద్
36వ జాతీయ క్రీడల్లో తెలంగాణ సత్తా చాటుతోంది!. ప్రతిష్టాత్మక క్రీడల ఆరంభానికి ముందే టేబుల్ టెన్నిస్‌లో మూడు పతకాలు ఖాతాలో వేసుకున్న తెలంగాణ రాష్ట్రం.. ఇక అహ్మదాబాద్‌లో పోటీల తొలి రోజే జోరందుకుంది. యువ సంచలనం రియా సబూ తెలంగాణకు తొలి బంగారు పతకం అందించింది. శుక్రవారం జరిగిన క్వాడ్ ఫ్రీస్టయిల్ స్కేటింగ్ (ఆర్టిస్టిక్) విభాగంలో రియా సబూ పసిడి పతకం సొంతం చేసుకుంది. పసిడి రేసులో ఫాతిమా ఫెర్నాండేజ్ (గోవా), టియ నొరొహ (మహారాష్ట్ర), రీవా అగర్వాల్ (మహారాష్ట్ర), హన్నా జార్జ్ (కేరళ) సహా ఆంధ్రప్రదేశ్ అమ్మాయి భూపతిరాజు ఆన్మిష నుంచి గట్టి పోటీ ఎదురైంది. 19 ఏండ్ల రియా ఓపెన్ విభాగంలో పోటీపడి బంగారు పతకం కైవసం చేసుకోవటం విశేషం.
ఇక జాతీయ క్రీడల ఆరంభానికి ముందే ఫైనల్లోకి ప్రవేశించి పతకం ఖాయం చేసుకున్న పురుషుల నెట్‌బాల్ జట్టు తుది పోరులో చివరి క్షణం వరకు పోరాడింది. హర్యానాతో ఫైనల్ నువ్వా నేనా అన్నట్టు సాగింది. తొలి రెండు క్వార్టర్స్‌లో తెలంగాణ ముందంజ వేసింది. 28-27తో హర్యానాపై స్వల్ప ఆధిక్యత సాధించింది. కానీ మూడో క్వార్టర్లో దూకుడు పెంచిన హర్యానా.. తెలంగాణ నుంచి ఆధిక్యం లాగేసుకుంది. నాలుగు క్వార్టర్ల మ్యాచ్ అనంతరం 75-73తో తెలంగాణపై రెండు పాయింట్ల తేడాతో విజయం సాధించింది. పసిడి వేటలో ఫేవరేట్‌గా కనిపించిన తెలంగాణ గట్టిగా పోరాడినా సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక మహిళల విభాగంలో సైతం హర్యానా పసిడి కైవసం చేసుకుంది. ఫైనల్లో పంజాబ్‌పై ఘన విజయం సాధించిన హర్యానా.. నెట్‌బాల్‌లో రెండు బంగారు పతకాలు ఖాతాలో వేసుకుంది.