Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సఫారీతో సిరీస్‌కు ఎంపిక
ముంబయి : హైదరాబాదీ పేసర్, భారత ఆటగాడు మహ్మద్ సిరాజ్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. పేస్ దళపతి, స్టార్ బౌలర్ జశ్‌ప్రీత్ బుమ్రాకు వెన్నుగాయంతో దక్షిణాఫ్రికాతో సిరీస్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. బుమ్రా స్థానంలో మహ్మద్ సిరాజ్‌ను జట్టులోకి ఎంపిక చేస్తున్నట్టు బీసీసీఐ ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ 2న రెండో టీ20 కోసం గువహటికి చేరుకున్న టీమ్ ఇండియాతో మహ్మద్ సిరాజ్ చేరనున్నాడు. స్ట్రెస్ ఫ్రాక్చర్ గాయంతో జశ్‌ప్రీత్ బుమ్రా రానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు సైతం దూరమయ్యే ప్రమాదంలో పడ్డాడు. దీంతో దక్షిణాఫ్రికా సిరీస్‌లో మహ్మద్ సిరాజ్ మెరిస్తే.. హైదరాబాదీ పేసర్‌కు ఆస్ట్రేలియా టికెట్ సైతం ఖాయమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 'గాయపడిన బుమ్రా స్థానంలో మహ్మద్ సిరాజ్‌ను దక్షిణాఫ్రికా సిరీస్‌కు సెలక్టర్లు ఎంపిక చేశారు. బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు' అని బీసీసీఐ కార్యదర్శి జైషా ఓ ప్రకటనలో తెలిపాడు. 28 ఏండ్ల మహ్మద్ సిరాజ్ భారత్‌కు 5 టీ20లు ఆడాడు. ఐదు మ్యాచుల్లో ఐదు వికెట్లు కూల్చిన సిరాజ్.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ధర్మశాలలో శ్రీలంకపై చివరి టీ20 మ్యాచ్ ఆడాడు.