Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి మహిళల టీ20 ఆసియా కప్
- టైటిల్ ఫేవరేట్ టీమ్ ఇండియా
ఆసియా దేశాలు మరోసారి వేటకు సిద్ధమమ్యాయి. మెన్స్ ఆసియా కప్ పోరాటానికి తెరపడగా.. ఇప్పుడు అమ్మాయిల వంతు!. డిఫెండింగ్ చాంపియన్ బంగ్లాదేశ్ వేదికగా మహిళల ఆసియా కప్‌కు రంగం సిద్ధమైంది. టీ20 ఫార్మాట్లో జరుగుతున్న నాల్గో టోర్నీలో టైటిల్ ఫేవరేట్‌గా భారత్ బరిలోకి దిగుతోంది. నేడు సిల్హట్ స్టేడియంలో మహిళల ఆసియా కప్ 2022 ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్ టోర్నీ గురించిన వివరాలు..
నవతెలంగాణ- సిల్హట్
ఆసియా కప్ వేదిక
ఇటీవల మెన్స్ ఆసియా కప్ టోర్నీ యుఏఈ వేదికగా ముగిసింది. తాజాగా మహిళలు సైతం ఆసియా కప్‌కు సిద్ధమయ్యారు. బంగ్లాదేశ్ 2022 ఆసియా కప్‌కు ఆతిథ్యం వహించనుంది. సిల్హట్ అంతర్జాతీయ స్టేడియంలో అన్ని మ్యాచులు నిర్వహించనున్నారు. 2018లో పాకిస్థాన్ పర్యటన అనంతరం బంగ్లాదేశ్‌లో మహిళల క్రికెట్ నిర్వహించటం ఇదే తొలిసారి. 2014 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం అందించిన సిల్హట్ ఇంటర్నేషనల్ స్టేడియం.. మళ్లీ ఇప్పుడే అంతర్జాతీయ మ్యాచులకు వేదిక కానుంది.
పోటీలో ఉన్న జట్లు ఎన్ని?
ఆసియా కప్‌ను టీ20 ఫార్మాట్లో తొలిసారి 2012లో నిర్వహించారు. చివరగా 2018లో మహిళల ఆసియా కప్ జరిగింది. 2020 ఆసియా కప్ బంగ్లాదేశ్‌లో నిర్వహించాల్సింది. కానీ కోవిడ్-19 మహమ్మారి కారణంగా, 2021కు వాయిదా వేశారు. అనంతర పరిస్థితుల్లో పూర్తిగా రద్దు చేశారు. అంతిమంగా, 2022 ఆసియా కప్ హక్కులను బంగ్లాదేశ్ దక్కించుకుంది. ఓవరాల్‌గా ఇది ఎనిమిదో ఆసియా కప్ టోర్నీ. 2004, 2005, 2006, 2008లో ఆసియా కప్ వన్డే ఫార్మాట్లో నిర్వహించారు.
ఈ సారి టైటిల్ వేటలో ఏడు జట్లు నిలిచాయి. డిఫెండింగ్ చాంపియన్, ఆతిథ్య జట్టు బంగ్లాదేశ్ సహా భారత్, పాకిస్థాన్, థారులాండ్, శ్రీలంక, మలేషియా, యుఏఈలో బరిలో ఉన్నాయి. గ్రూప్ దశలో ప్రతి జట్టు ఇతర జట్లతో ఓ మ్యాచ్‌లో తలపడనుంది. తొలి దశలో ప్రతి జట్టు ఆరు మ్యాచుల్లో తలపడనుంది. గ్రూప్ దశ మ్యాచుల అనంతరం టాప్-4లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు చేరుకుంటాయి. గత టోర్నీల్లో గ్రూప్ దశలో ఆరు జట్లు మాత్రమే పోటీపడగా.. టాప్-2లో నిలిచిన జట్లు నేరుగా ఫైనల్స్‌కు అర్హత సాధించేవి. ఈ ఏడాది ఫార్మాట్లో మార్పు చేసి సెమీఫైనల్స్‌ను ప్రవేశపెట్టారు. ఆసియా కప్‌లో యుఏఈ తొలిసారి ఆడనుంది. అర్హత టోర్నీలో మలేషియాపై గెలుపొందిన యుఏఈ.. ప్రధాన టోర్నీలోనూ సమీకరణాలను ఆసక్తికరంగా మార్చేందుకు సిద్ధమవుతోంది!.
ఆరంభం ఎప్పుడు? ఏ సమయంలో!?
ఆసియా కప్ చరిత్రలోనే 2022 టోర్నీ సుదీర్ఘమైనదిగా నిలువనుంది. మ్యాచులు పరంగా, రోజుల పరంగా 2022 ఆసియా కప్ ప్రత్యేకం. 15 రోజుల పాటు ఆసియా వార్ జరుగునుంది. అక్టోబర్ 1న ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్, థారులాండ్లు తలపడనున్నాయి. నేడు మధ్యాహ్నాం మ్యాచ్‌లో టీమ్ ఇండియాతో శ్రీలంక పోటీపడనుంది. ఉదయం మ్యాచులు 9 గంటలకు ఆరంభం కానుండగా, మధ్యాహ్నాం మ్యాచులు 1.30 గంటలకు మొదలవుతాయి. అన్ని మ్యాచులు స్టార్‌స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో, డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతాయి.
ఆసియా కప్ ఫేవరేట్ ఎవరు?
బంగ్లాదేశ్ ఆసియా కప్ డిఫెండింగ్ చాంపియన్. 2018 కౌలాలంపూర్‌లో జరిగిన టైటిల్ పోరులో ఉత్కంఠ విజయం సాధించి ట్రోఫీ గెల్చుకుంది. టీ20 ఫార్మాట్లో మూడు ఆసియా కప్‌లలో రెండింటిని భారత్ ఖాతాలో వేసుకుంది. వన్డే ఫార్మాట్లో జరిగిన నాలుగు టోర్నీలను టీమ్ ఇండియా క్లీన్‌స్వీప్ చేసింది. ఆసియా కప్ చరిత్రలో 32 మ్యాచులు ఆడిన భారత్.. రికార్డు స్థాయిలో 30 మ్యాచుల్లో విజయాలు నమోదు చేసింది. ఓవరాల్‌గా ఏడు ఆసియా కప్ టైటిళ్లలో భారత్ ఆరు సొంతం చేసుకుంది. 2022 ఆసియా కప్‌లో సైతం టీమ్ ఇండియా టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.
గ్రూప్ దశలో అన్ని జట్లు ఇతర జట్లతో ఆడాల్సి ఉంది. దీంతో భారత్, పాకిస్థాన్ ముఖాముఖి సమరం అనివార్యం. అక్టోబర్ 7న పొరుగు దేశాల పోరాటం కోసం ఇరు దేశాల క్రికెట్ ప్రియులతో పాటు ప్రపంచ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాకిస్థాన్, శ్రీలంక మహిళల మ్యాచ్ సైతం ఆసక్తి రేపనుంది. మెరుపు ప్రదర్శనలతో పెద్ద జట్లకు షాక్ ఇచ్చేందుకు అడుగు దూరంలో ఆగిపోతున్న థారులాండ్ సైతం ఆసియా కప్‌లో చూడదగిన జట్టు!.