Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బుమ్రా ఫిట్నెస్ స్థితిపై ద్రవిడ్
గౌహతి : అక్టోబర్ 6న, భారత క్రికెటర్లు ఆస్ట్రేలియాకు బయల్దేరనున్నారు. అక్టోబర్ 23న పొరుగు దేశం పాకిస్థాన్‌తో ప్రపంచకప్ సూపర్12 దశలో తొలి పోరు. అంతకుముందు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో వార్మప్ మ్యాచులు. ఆస్ట్రేలియాకు బయల్దేరే సమయం తక్కువగా ఉండటంతో జశ్‌ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్‌పై ఆసక్తి, ఆందోళన రెట్టింపు అవుతున్నాయి. వెన్నునొప్పితో తిరువనంతపురం నుంచి నేరుగా బెంగళూర్‌కు చేరుకున్న బుమ్రాకు అక్కడ బీసీసీఐ వైద్య బృందం సంబంధిత పరీక్షలు నిర్వహించింది. స్ట్రెస్ ఫ్రాక్చర్‌కు గురైన బుమ్రా కనీసం ఆరు నెలలు విశ్రాంతి తీసుకోవాలని, టీ20 ప్రపంచకప్‌కు అతడు దూరమయ్యాడని వార్తలు వచ్చాయి. బుమ్రా ప్రపంచకప్‌లో ఆడతాడనే ఆశిస్తున్నాం, ఇంకా అతడి ఫిట్‌నెస్‌పై పూర్తి నివేదిక రాలేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించాడు. భారత జట్టు చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం అదే తరహాలో స్పందించాడు. బుమ్రాకు స్ట్రెస్ ఫ్రాక్చర్ అనే వార్త వెలువడి 48 గంటలు గడుస్తున్నా.. అతడి ప్రస్తుత పరిస్థితిపై జట్టు మేనేజ్మెంట్కు అధికారిక సమాచారం లేదు.
'బుమ్రా వైద్య నివేదికలను నేను క్షుణ్ణంగా పరిశీలించలేదు. నిపుణుల అభిప్రాయం కోసం ఎదురుచూస్తున్నాను. బీసీసీఐ వైద్య బృందం బుమ్రాను సఫారీతో సిరీస్‌కు దూరంగా ఉండమని చెప్పంది. తర్వాత ఏమైనా జరిగితే.. ఆ విషయాలను మాకు తెలియజేస్తారు. అధికారికంగా సమాచారం వచ్చేవరకు, అతడు వరల్డ్‌కప్ రేసులో ఉంటాడు. సానుకూల దృక్పథంతోనే ఉన్నాం. జట్టుగా, వ్యక్తిగతంగా బుమ్రా ఫిట్నెస్ పట్ల సానుకూలంగా ఆలోచిస్తున్నాం. రానున్న రెండు రోజుల్లో బుమ్రాపై వైద్య బృందం తేల్చనుంది. ఆ విషయం మాకు చెప్పగానే మీతో (మీడియా) పంచుకుంటామని' రాహుల్ ద్రవిడ్ అన్నాడు. వెన్నునొప్పి గాయంతో రెండు నెలలు క్రికెట్‌కు దూరమైన జశ్‌ప్రీత్ బుమ్రా.. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు తిరిగి జట్టులోకి వచ్చాడు. ఆసీస్‌పై రెండు టీ20ల్లో ఆడిన బుమ్రా.. సఫారీతో తొలి టీ20కి ముందు వెన్నునొప్పి ఉందంటూ ఫిజియో దృష్టికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.