Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 41 పరుగులతో శ్రీలంకపై గెలుపు
- జెమీమా రొడ్రిగస్ అర్థ శతకం
సిల్హట్ (బంగ్లాదేశ్)
2022 ఆసియా కప్‌లో భారత మహిళల జట్టు బోణీ కొట్టింది. ఆరంభ రోజు రెండో మ్యాచ్‌లో శ్రీలంకపై 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. జెమీమా రొడ్రిగస్ (76, 53 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీతో కదం తొక్కటంతో తొలుత భారత్ 20 ఓవర్లలో 150/6 పరుగులు చేసింది. ఛేదనలో శ్రీలంక 109 పరుగులకే కుప్పకూలింది. హేమలత (3/15), పూజ (2/12), దీప్తి శర్మ (2/15) శ్రీలంక బ్యాటర్లను కట్టిడి చేశారు. 18.2 ఓవర్లలోనే ఆలౌటైన శ్రీలంక మహిళల జట్టు దారుణ పరాజయం మూటగట్టుకుంది. భారీ అర్థ సెంచరీతో చెలరేగిన జెమీమా రొడ్రిగస్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచింది. భారత్ తన తర్వాతి మ్యాచ్‌లో సోమవారం మలేషియాతో తలపడనుంది. ఇక ఆసియా కప్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్, ఆతిథ్య బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో థారులాండ్‌పై విజయం సాధించింది.
జెమీమా జోరు : టాస్ నెగ్గిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాట్‌తో భారత్‌కు మంచి ఆరంభం దక్కలేదు. ఓపెనర్లు షెఫాలీ వర్మ (10), స్మృతీ మంధాన (6) నిరాశపరిచారు. నం.3 బ్యాటర్ జెమీమా రొడ్రిగస్ (76), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (33, 30 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) మూడో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 38 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన జెమీమా.. భారత్‌కు మంచి స్కోరు అందించింది. హేమలత (13), రిచా ఘోష్ (9) చివర్లో మెరిశారు. శ్రీలంక బౌలర్లలో రణసింఘె (3/32) మూడు వికెట్లు తీసుకుంది.
చతికిల : ఛేదనలో శ్రీలంక చేతులెత్తేసింది. ఏ దశలోనూ ఆ జట్టు లక్ష్యం దిశగా సాగలేదు. కెప్టెన్ చమరి ఆటపట్టు (5)పై భారీ ఆశలు పెట్టుకున్న శ్రీలంక.. ఆమె నిష్క్రమణతోనే మ్యాచ్‌పై ఆశలు వదులుకుంది. ఓపెనర్ హర్షిత (26), హాసిని (30) మాత్రమే భారత బౌలర్లను ఎదుర్కొని ఓ మోస్తరు పరుగులు చేశారు. క్రమం తప్పకుండా వికెట్లు నేలకూల్చిన టీమ్ ఇండియా బౌలర్లు.. 18.2 ఓవర్లలోనే లాంఛనం ముగించారు. హేమలత మూడు వికెట్లు పడగొట్టగా.. దీప్తి శర్మ, పూజ వస్ట్రాకర్ రెండేసి వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.
సంక్షిప్త స్కోరు వివరాలు :
భారత మహిళల ఇన్నింగ్స్ : 150/6 (జెమీమా రొడ్రిగస్ 76, హర్మన్‌ప్రీత్ కౌర్ 33, రణసింఘె 3/32, ఆటపట్టు 1/8)
శ్రీలంక మహిళల ఇన్నింగ్స్ : 109/10 (హాసిని పెరీరా 30, హర్షిత సమరవిక్రమ 26, హేమలత 3/15, పూజ 2/12)