Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వదేశంలో దక్షిణాఫ్రికాపై ఓ టీ20 సిరీస్ విజయం సాధించటంలో భారత్ ఏకంగా మూడు సార్లు విఫలమైంది. పొట్టి ఫార్మాట్లో భారత్‌కు సొంతగడ్డపై వరుస షాక్‌లిచ్చిన సఫారీలపై సిరీస్ విజయం ఇప్పుడు ఊరిస్తోంది. గాంధీ జయంతిన గౌహతి టీ20లో నెగ్గితే స్వదేశంలో సఫారీలపై తొలి టీ20 సిరీస్ భారత్ వశం కానుంది. అయితే, అందుకు వరుణుడు సైతం సహకరించాలేమో!!. భారత్, దక్షిణాఫ్రికా రెండో టీ20 మ్యాచ్ నేడు.
- దక్షిణాఫ్రికాతో రెండో టీ20 నేడు
- బుమ్రా లేని ప్రణాళికలపై ఫోకస్
- రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
నవతెలంగాణ-గౌహతి
భారత్, దక్షిణాఫ్రికా టీ20 సిరీస్. తొలి మ్యాచ్‌లో గెలుపొందిన భారత్.. గౌహతిలోనే సిరీస్ పట్టేయాలని చూస్తోంది. బలమైన పేస్ బౌలర్లతో కూడిన సఫారీలు సిరీస్‌ను సమం చేసేందుకు ఎదురుచూస్తున్నారు. అయితే, ఇవేవీ భారత అభిమానులను ఆకర్షించటం లేదు. బుమ్రా.. బుమ్రా.. బుమ్రా!. వెన్నునొప్పితో తిరువనంతపురం టీ20 మ్యాచ్‌కు ముందు ఇబ్బంది పడిన పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా రానున్న ప్రతిష్టాత్మక ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. దక్షిణాఫ్రికాతో చివరి రెండు టీ20ల అనంతరం భారత ఆటగాళ్లు ఆస్ట్రేలియా బయల్దేరనున్నారు. ఆలోపు, బుమ్రా ఫిట్‌నెస్‌పై బీసీసీఐ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇక, భారత జట్టు సైతం బుమ్రా లేని పేస్ బౌలింగ్ ప్రణాళికలను ఆచరణలో పెట్టేందుకు సిద్ధమవుతోంది.
పేస్పై ఫోకస్! : టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత్ ఆడాల్సిన మ్యాచులు ఇక రెండే. దీంతో ఈ రెండింటిలోనే ప్రణాళికల అమలుకు అవకాశం ఉంది. మిడిల్ ఆర్డర్లో రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్‌లు ఆసియా కప్ నుంచి బ్యాటింగ్ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రపంచకప్‌లో పంత్, కార్తీక్‌లు భారత్‌కు కీలకం. దీంతో ఈ రెండు మ్యాచుల్లో ఈ ఇద్దరిని బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపించే ఆలోచన సైతం ఉంది. ఇక బౌలింగ్ విభాగంలో భారత్ నయా ప్రణాళికలపై కన్నేసింది. బుమ్రా ఫిట్నెస్ సాధించి ప్రపంచకప్‌కు వచ్చినా.. పూర్తి స్థాయిలో అన్ని మ్యాచులకు అందుబాటులో ఉండే అవకాశం లేదు. దీంతో బుమ్రా లేని పేస్ ప్రణాళికలు జట్టు ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఐపీఎల్లో గొప్పగా రాణించిన హర్షల్ పటేల్ జాతీయ జట్టు తరఫున నిలకడగా నిరాశపరుస్తున్నాడు. దీపక్ చాహర్, అర్షదీప్ సింగ్‌లు కొత్త బంతితో నిప్పులు కక్కేందుకు ఎదురు చూస్తున్నారు. అక్షర్ పటేల్, అశ్విన్ స్పిన్ జోడీ ఇక్కడా కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
సమం చేయాలని.. : దక్షిణాఫ్రికా అరుదైన రికార్డు సాధించింది. భారత్‌లో ఇప్పటివరకు మూడు టీ20 సిరీస్‌లు ఆడిన సఫారీలు.. మూడింటా విజయాలు నమోదు చేశారు. కానీ ఈ సారి ఫలితం భిన్నంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. బలమైన పేసర్లతో కూడిన దక్షిణాఫ్రికా ఎప్పుడైనా ప్రమాదకర జట్టే. సఫారీ సారథి తెంబ బవుమా మినహా బ్యాటర్లు అందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. క్వింటన్ డికాక్, ఎడెన్ మార్కరం, డెవిడ్ మిల్లర్లు ఆ జట్టుకు కీలకం కానున్నారు. స్పిన్నర్ కేశవ్ మహరాజ్ మరోసారి ఎక్స్‌ఫ్యాక్టర్ పాత్ర పోషించనున్నాడు. అందుబాటులో నాణ్యమైన పేసర్లు ఉండటంతో తుది జట్టు ఎంపిక సఫారీలకు తీపి తలనొప్పిగా పరిణమించింది. రబాడ, ఎంగిడి, షంషిలు పేస్ బాధ్యతలు పంచుకునే అవకాశం ఉంది.
పిచ్, వాతావరణం : గౌహతిలో ఇది మూడో టీ20. తొలి మ్యాచ్‌లో స్వల్ప స్కోర్లు నమోదు కాగా.. భారత్ భంగపడింది. 2020లో మ్యాచ్ వర్షం కారణంగా సాగలేదు. ఆదివారం ఇక్కడ అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. రాత్రి 7 గంటల తర్వాత వర్ష సూచనలు ఉన్నాయి. దీంతో నేడు మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించే అవకాశం ఎక్కువ. టాస్ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునే వీలుంది.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, అశ్విన్, దీపక్ చాహర్, అర్షదీప్ సింగ్.
దక్షిణాఫ్రికా : క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), తెంబ బవుమా (కెప్టెన్), రైలీ రొసో, ఎడెన్ మార్కరం, డెవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వేనీ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడ, లుంగి ఎంగిడి, తబ్రియజ్ షంషి.