Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పరుగుల పండుగ. గౌహతిలో సూర్యకుమార్ (61)సునామీ సృష్టించాడు. సఫారీ బౌలర్లను ఉప్పెనలా ముంచెత్తాడు. 18 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన సూర్యకుమార్ యాదవ్ ఇరు జట్ల మధ్య వ్యత్యాసంగా నిలిచాడు. 238 పరుగుల రికార్డు ఛేదనలో డెవిడ్ మిల్లర్ (106 నాటౌట్) శతకంతో చెలరేగినా.. ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. రెండో టీ20లో 16 పరుగులతో నెగ్గిన భారత్ స్వదేశంలో సఫారీలపై తొలి టీ20 సిరీస్ సాధించింది.
- రెండో టీ20లో భారత్ గెలుపు
- సూర్య సునామీ ఇన్నింగ్స్ ఛేదనలో మిల్లర్ శతకం వృథా
నవతెలంగాణ-గౌహతి
సూర్యకుమార్ యాదవ్ (61, 22 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) విశ్వరూపం. కెఎల్ రాహుల్ (57, 28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (49 నాటౌట్, 28 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ షో. స్వదేశంలో సఫారీలపై భారత్ తొలి టీ20 సిరీస్ నమోదు చేసింది. రెండో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 237 పరుగులు చేసింది. ఛేదనలో డెవిడ్ మిల్లర్ (106 నాటౌట్, 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు), క్వింటన్ డికాక్ (69 నాటౌట్, 48 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) నాల్గో వికెట్‌కు అజేయంగా 174 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 20 ఓవర్లలో 3 వికెట్లకు సఫారీలు 221 పరుగులే చేశారు. 16 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. 2-0తో సిరీస్ సొంతం చేసుకుంది. సిరీస్‌లో మూడో టీ20 మంగళవారం ఇండోర్‌లో జరుగనుంది.
రాహుల్ మెదలెట్టగా.. : గౌహతిలో టాస్ కోల్పోయిన టీమ్ ఇండియా తొలుత బ్యాటింగ్‌కు వచ్చింది. కెప్టెన్ రోహిత్ శర్మ (43, 37 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) నెమ్మదిగా ఆడగా.. మరో ఎండ్‌లో కెఎల్ రాహుల్ (57) దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 24 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడు. పవర్‌ప్లే తర్వాత వేగం అందుకున్నాడు రోహిత్. తొలి వికెట్‌కు 9.5 ఓవర్లలో 96 పరుగులు జోడించిన అనంతరం రోహిత్ శర్మ వికెట్ కోల్పోయాడు. కొద్దిసేపటికే రాహుల్ సైతం నిష్క్రమించాడు.
సూర్య స్పెషల్ షో : సూర్యకుమార్, విరాట్ కోహ్లి మరోసారి ప్రత్యేక భాగస్వామ్యం నెలకొల్పారు. సూర్య సహజశైలిలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఐదు సిక్సర్లు, ఐదు ఫోర్లతో బౌలర్లపై దండయాత్ర చేశాడు. 18 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన సూర్య.. ఓ ఏడాదిలో టీ20 ఫార్మాట్లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. విరాట్ కోహ్లి సంప్రదాయ షాట్లతో చెలరేగగా.. సూర్య సరికొత్త షాట్లతో విరుచుకుపడ్డాడు. సూర్య-కోహ్లిలు 42 బంతుల్లోనే 100 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి ఇన్నింగ్స్‌కు రాకెట్ స్పీడ్ తీసుకొచ్చారు. ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో అజేయంగా 49 పరుగులు చేసిన విరాట్ కోహ్లి అర్థ సెంచరీకి పరుగు దూరంలో నిలిచాడు. చివరి ఓవర్లో దినేశ్ కార్తీక్ (17 నాటౌట్, 7 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) కండ్లుచెదిరే విన్యాసాలు చేశాడు.
మిల్లర్ మెరిసినా.. : 238 పరుగుల భారీ ఛేదనలో సఫారీలు ఆరంభంలో తేలిపోయారు. బవుమా (0) ఏడు బంతుల్లో సున్నా పరుగులకు నిష్క్రమించాడు. రోసో (0) నిరాశపరిచాడు. మార్కరం (33) మెరుపులు ఎంతోసేపు నిలువలేదు. ఈ దశలో డికాక్ (69)తో కలిసిన మిల్లర్ (106) సఫారీలకు ఆశలు కల్పించాడు. డెత్ ఓవర్లలో చిచ్చరపిడుగులా చెలరేగి 46 బంతుల్లో శతకం సాధించాడు. చివరి రెండు ఓవర్లలో సఫారీలు 46 పరుగులు పిండుకున్నారు. 221 పరుగులు చేసిన సఫారీలు.. 16 పరుగుల తేడాతో ఓటమి చెందారు. అర్షదీప్, అశ్విన్, అక్షర్ భారీగా పరుగులు ఇచ్చుకున్నారు.
స్కోరు వివరాలు :
భారత్ ఇన్నింగ్స్ : రాహుల్ (ఎల్బీ) మహరాజ్ 57, రోహిత్ (సి) స్టబ్స్ (బి)మహరాజ్ 43, కోహ్లి నాటౌట్ 49, సూర్య రనౌట్ 61, కార్తీక్ నాటౌట్ 17, ఎక్స్‌ట్రాలు : 10, మొత్తం :(20 ఓవర్లలో 3 వికెట్లకు) 237.
వికెట్ల పతనం : 1-96, 2-209, 3-209.
బౌలింగ్ : రబాడ 4-0-57-0, పార్నెల్ 4-0-54-0, ఎంగిడి 4-0-49-0, మహరాజ్ 4-0-23-2, నోకియా 3-0-41-0, మార్కరం 1-0-9-0.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ : బవుమా (సి) కోహ్లి (బి) అర్షదీప్ 0, డికాక్ నాటౌట్ 69, రోసో (సి) కార్తీక్ (బి) అర్షదీప్ 0, మార్కరం (బి) అక్షర్ 33, మిల్లర్ నాటౌట్ 106, ఎక్స్‌ట్రాలు : 13, మొత్తం :(20 ఓవర్లలో 3 వికెట్లకు) 221.
వికెట్ల పతనం : 1-1, 2-2, 3-47.
బౌలింగ్ : దీపక్ 4-1-24-0, అర్షదీప్ 4-0-62-2, అశ్విన్ 4-0-37-0, అక్షర్ 4-0-53-1, హర్షల్ 4-0-45-0.