Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీ20 ప్రపంచకప్ నుంచి బుమ్రా ఔట్
- గాయంతో దూరమైన పేస్ దళపతి
బెంగళూర్ : అనుకున్నంత అయ్యింది!. ఊహాగానాలే నిజమయ్యాయి. 11 ఏండ్ల విరామం అనంతరం ఐసీసీ ట్రోఫీ వేటను విజయవంతం చేయాలని చూస్తోన్న టీమ్ ఇండియాకు అసలు సమరానికి ముందే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ శ్రేణి పేసర్, ప్రత్యర్థుల సింహస్వప్నం, పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. స్ట్రెస్ ఫ్రాక్చర్ గాయంతో బాధపడుతున్న జశ్‌ప్రీత్ బుమ్రా.. గాయం తీవ్రతతో అక్టోబర్ 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా ఆరంభం కానున్న టీ20 ప్రపంచకప్‌కు అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.
స్ట్రెస్ ఫ్రాక్చర్ గాయం : దక్షిణాఫ్రికాతో తిరువనంతపురం టీ20కి ముందు వెన్నునొప్పి ఉందంటూ జట్టు ఫిజియోకు జశ్‌ప్రీత్ బుమ్రా ఫిర్యాదు చేశాడు. దీంతో అతడిని తొలి టీ20 మ్యాచ్‌కు దూరం పెట్టారు. అక్కడ్నుంచి నేరుగా బెంగళూర్ నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లాడు. అక్కడ బుమ్రాకు వైద్య బృందం పలు పరీక్షలు నిర్వహించింది. బుమ్రాకు స్ట్రెస్ ఫ్రాక్చర్ గాయం, కనీసం ఆరు నెలలు క్రికెట్‌కు దూరంగా ఉండాలనే వార్తలు వచ్చాయి. బీసీసీఐ వర్గాలు ఈ సమాచారం అనధికారికంగా వెల్లడించినా.. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌లు బుమ్రాపై ఆశావహ దృక్పథంతో ఉన్నారు. బుమ్రా గాయంపై నిపుణుల అభిప్రాయం తీసుకున్న బీసీసీఐ.. 2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు దూరం పెట్టాలనే నిర్ణయం తీసుకుంది.