Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్థ సెంచరీ బాదిన తెలుగు తేజం
- మలేషియాపై భారత్ ఘన విజయం
సిల్హట్ : ఆసియా కప్ (2022)లో టీమ్ ఇండియా జోరు కొనసాగుతోంది. గ్రూప్ దశలో భారత అమ్మాయిలు వరుసగా రెండో మ్యాచ్‌లో అలవోక విజయం సాధించారు. మలేషియాపై డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 30 పరుగుల తేడాతో తిరుగులేని విజయం నమోదు చేశారు. సెమీఫైనల్స్ దిశగా ఓ అడుగు ముందుకేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 181 పరుగులు చేసింది. తెలుగమ్మాయి సబ్బినేని మేఘన (69, 53 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీతో అదరగొట్టింది. స్టార్ బ్యాటర్ స్మృతీ మంధాన స్థానంలో తుది జట్టులోకి వచ్చిన మేఘన.. షెఫాలీ వర్మ (46, 39 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు)తో కలిసి తొలి వికెట్‌కు 116 పరుగుల శతక భాగస్వామ్యం నమోదు చేసింది. రిచా ఘోష్ (33), డి హేమలత (10) ఆకట్టుకున్నారు. 182 పరుగుల రికార్డు ఛేదనలో మలేషియా 5.2 ఓవర్లలో 16/2తో నిలిచింది. ఈ సమయంలో ఎడతెరపి లేకుండా వర్షం కురవటంతో మ్యాచ్ ముందుకు సాగలేదు. డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో భారత్ 30 పరుగుల తేడాతో విజయం సాధించినట్టు మ్యాచ్ రిఫరీ ప్రకటించారు. ఆసియా కప్‌లో భారత్ తన తర్వాతి మ్యాచ్‌లో నేడు యుఏఈతో తలపడనుంది.