Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణాఫ్రికాతో మూడో టీ20 నేడు
- 3-0 విజయంపై భారత్ గురి
- విరాట్, రాహుల్‌కు విశ్రాంతి
- రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
స్వదేశంలో సఫారీలపై పొట్టి సిరీసే నెగ్గని టీమ్ ఇండియా.. ఇప్పుడు ఏకంగా క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. గౌహతి పరుగుల పండుగలో పైచేయి సాధించిన రోహిత్‌సేన.. నేడు ఇండోర్‌లో 3-0 విజయంపై గురి ఎక్కుపెట్టింది. విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్‌కు విశ్రాంతి లభించగా.. పంత్, శ్రేయస్‌లు టాప్ ఆర్డర్‌లోకి రానున్నారు. నామమాత్రపు మ్యాచ్‌లో ఊరట విజయం కోసం దక్షిణాఫ్రికా ఎదురుచూస్తోంది. భారత్, దక్షిణాఫ్రికా మూడో టీ20 నేడు.
నవతెలంగాణ-ఇండోర్
సహజంగానే టీమ్ ఇండియా మరో ద్వైపాక్షిక సిరీస్‌ను సొంతం చేసుకుంది. బ్యాటర్లు చెలరేగటంతో గౌహతిలో పైచేయి సాధించి, స్వదేశంలో దక్షిణాఫ్రికా తొలి టీ20 సిరీస్ సొంతం చేసుకుంది. బ్యాటింగ్ విభాగంపై ఇప్పుడు ఆందోళన లేకపోయినా.. బుమ్రా లేని వేళ బౌలింగ్ విభాగంపై ఫోకస్ కనిపిస్తోంది. చిన్న బౌండరీల ఇండోర్ స్టేడియంలో భారత బౌలర్లు బలమైన హిట్టర్లున్న దక్షిణాఫ్రికాను ఏ మేరకు నిలువరి స్తారనేది ఆసక్తికరం. ఐసీసీ టీ20 ప్రపంచకప్ ముంగిట టీమ్ ఇండియా చివరి పొట్టి పోరుకు సన్నద్ధమైంది.
అర్షదీప్‌పై ఫోకస్ : యువ పేసర్ అర్షదీప్ సింగ్ కెరీర్ ఆరంభంలోనే అన్ని కోణాల్లో అనుభవం గడించాడు!. 13 టీ20ల్లోనే చేదు, తీపి గుళికలను రుచి చూశాడు. ఆసియా కప్‌లో అభిమానుల నుంచి తీవ్ర ట్రోలింగ్‌కు గురైన అర్షదీప్.. తిరువంనతపురంలో సంచలన బౌలింగ్ అనంతరం గౌహతిలో నాలుగు ఓవర్లలో ఏకంగా 62 పరుగులు సమర్పించాడు. పవర్‌ప్లేలో మెరిసినా.. డెత్ ఓవర్లలో అర్షదీప్ సింగ్ నియంత్రణ కోల్పోయాడు. జశ్‌ప్రీత్ బుమ్రా అధికారికంగా టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. దీంతో అర్షదీప్ సింగ్ డెత్ ఓవర్ల సామర్థ్యం తెరపైకి వస్తోంది. భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్‌లతో కలిసి అర్షదీప్ సింగ్ పేస్ విభాగంలో ఇమడాల్సి ఉంది. నేడు ఇండోర్‌లో అర్షదీప్ సింగ్ డెత్ ఓవర్ల టాస్క్‌తో మరో పరీక్షకు సిద్ధం కానున్నాడు. ఇక తుది జట్టు ఎంపికలో భారత్ కీలక మార్పులు చేయనుంది. స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్‌కు విశ్రాంతి లభించింది. ప్రపంచకప్ ముంగిట ఇద్దరు క్రికెటర్లు కుటుంబంతో గడిపేందుకు జట్టు బబుల్‌ను వీడారు. ఆసియా కప్ నుంచి బ్యాటింగ్ అవకాశం దక్కని రిషబ్ పంత్ నేడు ఓపెనర్‌గా రానున్నాడు. విరాట్ కోహ్లి స్థానంలో శ్రేయస్ అయ్యర్ బ్యాట్ పట్టనున్నాడు. అక్షర్ పటేల్‌కు సైతం విశ్రాంతినిస్తే.. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ సైతం నేడు అరంగేట్రం చేసేందుకు అవకాశం ఉంది.
బవుమా మెరిసేనా? : టీమ్ ఇండియా చేతిలో సిరీస్ ఓటమి నిజానికి దక్షిణాఫ్రికాకు పెద్ద విషయం కాదు. టీ20 ప్రపంచకప్ సన్నాహాక సిరీస్‌లో ప్రణాళికల అమలు, లోటుపాట్లపైనే ఫోకస్ ఉంటుంది. ఆ విధంగా, సఫారీలకు ప్రధాన సమస్య సారథి తెంబ బవుమా ఫామ్. ఇటీవల ఎస్ఏ20 ఆటగాళ్ల వేలంలో అమ్ముడుపోని బవుమా.. పొట్టి ఫార్మాట్లో దక్షిణాఫ్రికాకు భారంగా మారాడు. తొలి టీ20ల్లో నాలుగు బంతుల్లో డకౌట్, రెండో టీ20లో ఏడు బంతుల్లో డకౌట్‌తో నిరాశపరిచాడు. ఉత్కంఠకు తెరతీసిన గౌహతి మ్యాచ్‌లో తొలి ఓవర్‌ను బవుమా మెయిడిన్ చేయకుంటే, కచ్చితంగా ఫలితం భిన్నంగా ఉండేదేమో!. జట్టులో స్థానాన్నే ప్రశ్నార్థకం చేసుకున్న బవుమా, జట్టును నడిపించేందుకు అర్హుడు కాదనే వాదన మొదలైంది. సహేతుక విమర్శలకు బవుమా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నేడు ఇండోర్‌లోనైనా బవుమా కాసిన్ని పరుగులు చేస్తాడేమో చూడాలి. బౌలింగ్ విభాగంలో సఫారీలు బలంగా ఉన్నారు. స్పిన్నర్ కేశవ్ మహరాజ్ కీలకంగా రాణిస్తున్నాడు. రబాడ, ఎంగిడి, పార్నెల్‌లు భారత బ్యాటర్లకు సవాల్ విసరనున్నారు.
పిచ్, వాతావరణం : భారత్‌లో అతి చిన్న స్టేడియాల్లో ఇండోర్ ఒకటి. సహజంగానే ఇండోర్ బ్యాటింగ్‌కు స్వర్గధామం. నేటి మ్యాచ్‌కు వర్ష సూచనలు లేకపోయినా.. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం కనిపించనుంది. ఇండోర్ మరో పరుగుల పండుగకు వేదిక కానుంది. టాస్ నెగ్గిన జట్టు తొలుత ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించనుంది.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, దినేశ్ కార్తీక్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అర్షదీప్ సింగ్.
దక్షిణాఫ్రికా : తెంబ బవుమా (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), ఎడెన్ మార్కరం, డెవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వేనీ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడ, ఎన్రిచ్ నొకియా, లుంగి ఎంగిడి.