Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణాఫ్రికాతో రెండో వన్డే నేడు
- విజయంపై టీమ్ ఇండియా గురి
- మధ్యాహ్నాం 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
వన్డే సూపర్ లీగ్ పాయింట్లు మినహా భారత్, దక్షిణాఫ్రికా 50 ఓవర్ల సిరీస్‌కు పెద్దగా ప్రాధాన్యత లేదు!. ఐసీసీ టీ20 ప్రపంచకప్ ముంగిట ఎఫ్టీపీ పూర్తి చేసుకునేందుకు ఇరు జట్లు ఈ సిరీస్‌లో తలపడుతున్నాయి. సిరీస్‌కు ముందు అంచనాలు లేకపోయినా, తొలి వన్డే సాగిన తీరుతో సిరీస్‌పై కాస్త ఆసక్తి పెరిగింది. అటు సఫారీలు, ఇటు శిఖర్సేన వన్డేలను అంత తేలిగ్గా తీసుకోవటం లేదు. ఉత్కంఠగా సాగిన తొలి వన్డే తరహాలోనే నేడు రాంచీలోనూ సూపర్ సమరం లాంఛనమే!. సిరీసమ్ రేసులో నిలిచేందుకు నేడు టీమ్ ఇండియా విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
నవతెలంగాణ-రాంచీ : వన్డే సిరీస్‌కు సరికొత్త ఊపు వచ్చింది!. చివరి ఓవర్ క్లైమాక్స్‌కు చేరుకుని, ఉత్కంఠ రేపిన తొలి వన్డేలో సఫారీలు పైచేయి సాధించారు. మూడు మ్యాచుల సిరీస్‌పై ఆశలు సజీవంగా నిలువాలంటే, నేడు రాంచీ వన్డేలో భారత్ విజయం సాధించి తీరాలి. లేదంటే, నిర్ణయాత్మక మూడో వన్డేకు ముందే సిరీస్‌పై ఆశలు కోల్పోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నేడు రెండో వన్డే ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్, దక్షిణాఫ్రికా రెండో వన్డే నేడు మధ్యాహ్నాం 1.30 గంటలకు ఆరంభం. స్టార్‌స్పోర్ట్స్ నెట్వర్క్, డిస్నీ హాట్‌స్టార్‌లో మ్యాచ్ ప్రసారం కానుంది.
శాంసన్, శ్రేయస్ నయా పంథా! :
విధ్వంసక బ్యాటింగ్ విన్యాసాలు సంజు శాంసన్‌కు కొత్త కాదు. సంప్రదాయ షాట్లతో భారీ ఇన్నింగ్స్‌లు నమోదు చేయటం శ్రేయస్ అయ్యర్‌కు వెన్నతోపెట్టిన విద్య. ఆధునిక క్రికెట్లో టీ20 జట్టులో చోటు కోసం ఈ ఇద్దరు బ్యాటర్లు పోటీపడుతున్నారు. మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్‌కు గట్టి పోటీ ఉండగా.. లోయర్ ఆర్డర్లో సంజు శాంసన్‌కు అవకాశాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. భారత్-ఏ తరఫున మెరిసిన సంజు శాంసన్.. సఫారీలపై వన్డేలో రెచ్చిపోయాడు. సహజశైలితో వస్తూనే సిక్సర్ బాదిన శాంసన్.. పరిస్థితులకు అనుగుణంగా బాధ్యతాయుత ఇన్నింగ్స్ నిర్మించాడు. టెయిలెండర్ శార్దుల్ ఠాకూర్‌తో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. చివరి ఓవర్లో హీరోయిక్ ప్రదర్శన చేసిన సంజు శాంసన్..విమర్శకుల మెప్పు పొందాడు. ఇదే సమయంలో మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్ సైతం విలువైన ఇన్నింగ్స్ నమోదు చేశాడు. టీ20 శైలిలో చెలరేగిన అయ్యర్ సెలక్టర్లకు స్పష్టమైన సందేశం పంచే ప్రయత్నం చేశాడు. 2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. కనీసం వన్డే వరల్డ్‌కప్ ప్రణాళికల్లోనైనా భాగమయ్యేందుకు సంజు శాంసన్, శ్రేయస్ అయ్యర్ గట్టి ప్రదర్శనపై కన్నేశారు. కెప్టెన్ శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్‌లు ఫామ్‌లోకి రావాల్సి ఉంది. శిఖర్ ధావన్ వన్డే శతకం సాధించి 24 ఇన్నింగ్స్‌లు ముగిశాయి. రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో నేడు రజత్ పటీదార్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. బౌలింగ్ విభాగంలో దీపక్ చాహర్ గాయంతో దూరమవగా.. అవేశ్ ఖాన్‌తో కలిసి శార్దుల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్‌లు పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. రవి బిష్ణోరుతో కలిసి చైనామన్ కుల్దీప్ యాదవ్ మాయజాలానికి సిద్ధమవుతున్నాడు.
సిరీస్‌పై కన్నేసి.. :
పొట్టి సిరీస్‌ను కోల్పోయిన దక్షిణాఫ్రికా.. టీ20 ప్రపంచకప్ ముంగిట వన్డే సిరీస్‌తోనైనా ఆత్మవిశ్వాసంతో ఆస్ట్రేలియాకు వెళ్లాలని భావిస్తోంది. నిజానికి దక్షిణాఫ్రికా భయంకర టీ20 జట్టు!. కానీ ఆ జట్టు సారథి తెంబ బవుమా ఫామ్ సఫారీలను తీవ్రంగా వేధిస్తోంది. పొట్టి ఫార్మాట్లో సున్నా పరుగులు చుట్టేసి జట్టును వెనక్కి లాగిన బవుమా.. తొలి వన్డేలో సైతం అదే రీతిలో నిరాశపరిచాడు. టీ20 ప్రపంచకప్‌లో సారథిగా బవుమా తుది జట్టులో నిలువటం ఖాయం. అయితే, సారథిగా ఉంటూ జట్టు విజయాలను ప్రభావితం చేయటం బవుమాకు సైతం ఇష్టం ఉండదు. అందుకే, వరల్డ్‌కప్‌కు ముందే ఫామ్‌లోకి వచ్చేందుకు బవుమా ప్రయత్నిస్తున్నాడు. నేడు పవర్‌ప్లేలో భారత పేసర్ల నుంచి బవుమా మరో పరీక్షకు సిద్ధమవుతున్నాడు. ఇక ఆ జట్టులో క్వింటన్ డికాక్, ఎడెన్ మార్కరం, హౌన్రిచ్ క్లాసెన్, డెవిడ్ మిల్లర్లు భీకర ఫామ్‌లో ఉన్నారు. నేడు ఈ నలుగురు మెరిస్తే దక్షిణాఫ్రికాకు పెద్దగా సమస్యలు ఉండవు. ఇక బౌలింగ్ విభాగంలో కగిసో రబాడ, వేనీ పార్నెల్, లుంగిసాని ఎంగిడిలు కీలకం కానున్నారు. షంషి, కేశవ్ మహరాజ్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు.
పిచ్, వాతావరణం :
రాంచీ పిచ్ సహజంగానే బ్యాటర్లకు అనుకూలం. ఇక్కడ ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పటికీ.. పేసర్లకు పెద్దగా సహకారం లభించదు. స్పిన్నర్లు మ్యాచ్ సాగుతున్న కొద్ది ప్రభావం చూపించగలరు. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది. మ్యాచ్ రోజు చిరుజల్లులు కురిసే అవకాశం ఉన్నప్పటికీ.. మ్యాచ్‌కు ఎటువంటి ఆటంకం కలిగించకపోవచ్చు.
తుది జట్లు (అంచనా) :
భారత్ : శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రజత్ పటిదార్, శార్దుల్ ఠాకూర్, అవేశ్ ఖాన్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్.
దక్షిణాఫ్రికా : క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), జానెమాన్ మలన్, తెంబ బవుమా, ఎడెన్ మార్కరం, హెన్రిచ్ క్లాసెన్, డెవిడ్ మిల్లర్, ఫెలుక్వయో, కేశవ్ మహరాజ్, మార్కో జాన్సెన్, లుంగిసాని ఎంగిడి, కగిసో రబాడ.