Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీసీఐ ఏజీఎంకు అజహరుద్దీన్
- సవాల్ చేసిన శేషు నారాయణ
నవతెలంగాణ, హైదరాబాద్
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) మళ్లీ వివాదం పుట్టుకొచ్చింది. హెచ్‌సీఏ సంస్థాగత పరిపాలన సమస్యలు, లోపాలు సవరణకు సవివరణ నివేదిక అందించేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పర్యవేక్షణ కమిటీ హెచ్‌సీఏ అంతర్గత రాజకీయాలు, కుమ్ములాటలకు మూలాలను తెలుసుకునే ప్రయత్నంలో ఉంది. పర్యవేక్షణ కమిటీ నివేదికతో హెచ్‌సీఏ పరిపాలన వ్యవస్థ పూర్తిగా మారుతుందనే విశ్వాసం నెలకొన్న నేపథ్యంలో.. సుప్రీంకోర్టు నియమిత పర్యవేక్షణ కమిటీ కనుసన్నల్లోనే మరో వివాదం రేగుతోంది. ఈ నెల 18న బీసీసీఐ ఎన్నికలు జరుగనున్నాయి. ముంబయిలోని ప్రధాన కార్యాలయంలో సమావేశం కానున్న బీసీసీఐ వార్షిక సర్వ సభ్య సమావేశం (ఏజీఏం) రానున్న మూడేండ్లకు ఆఫీస్ బేరర్లను ఎన్నుకోనుంది. ఈ సమావేశంలో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) తరఫున ఓటు వేసేందుకు మహ్మద్ అజహరుద్దీన్ హెచ్‌సీఏ ప్రతినిధిగా వెళ్లనున్నారు. దీంతో హెచ్‌సీఏ మాజీ ఆఫీస్ బేరర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
నేడే తుది నిర్ణయం : అక్టోబర్ 3లోపు రాష్ట్ర క్రికెట్ సంఘాలు తమ ప్రతినిధుల పేర్లను బీసీసీఐకి అందజేశాయి. ఇటీవల రాష్ట్ర క్రికెట్ సంఘాల ప్రతినిధుల పేర్లను బీసీసీఐ ఎన్నికల అధికారి విడుదల చేశారు. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా మహ్మద్ అజహరుద్దీన్ పదవీ కాలం సెప్టెంబర్ 25న ముగిసింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణ కమిటీకి సహకరించేందుకు, హెచ్‌సీఏ ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపుల కోసం మాత్రమే అధ్యక్షుడు, కార్యదర్శులను సుప్రీంకోర్టు పదవుల్లో కొనసాగేందుకు అనుమతించింది. ఈ వెసులుబాటును దుర్వినియోగం చేసుకున్న అజహరుద్దీన్ బీసీసీఐ ఎన్నికలకు హెచ్‌సీఏ ప్రతినిధిగా తనను తాను నామినేట్ చేసుకున్నాడు. ఒకవేళ ఏదేని రాష్ట్ర క్రికెట్ సంఘంలో ఎన్నికైన ఆఫీస్ బేరర్లు లేనిపక్షంలో.. సీఈవో ప్రతినిధిగా ఎవరిని పంపాలనే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టు పర్యవేక్షణ కమిటీ ప్రతినిధిని నామినేట్ చేసేందుకు అవకాశం లేదు. జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ కమిటీ సైతం అజహరుద్దీన్‌ను నామినేట్ చేసినట్టు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. దీంతో, హెచ్‌సీఏ ప్రతినిధిగా మహ్మద్ అజహరుద్దీన్ బీసీసీఐ ఎన్నికల్లో పాల్గొనకుండా నిరోధించాలని హెచ్‌సీఏ మాజీ కార్యదర్శి శేషు నారాయణ బోర్డు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర క్రికెట్ సంఘాల ప్రతినిధులపై ఫిర్యాదులను పరిశీలించి నేడు తుది ఎలక్టోరల్ జాబితాను విడుదల చేయనున్నారు. మహ్మద్ అజహరుద్దీన్ పదవీ కాలం ముగియటంతో అతడిని ఎన్నికల్లో పాల్గొనేందుకు ఎన్నికల అధికారి అనుమతిస్తాడా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.