Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రేయస్ అయ్యర్ శతకం
- ఇషాన్ కిషన్ ధనాధన్ జోరు
- రెండో వన్డేలో భారత్ గెలుపు
నవతెలంగాణ-రాంచీ
శ్రేయస్ అయ్యర్ (113 నాటౌట్, 111 బంతుల్లో 15 ఫోర్లు) అజేయ శతకానికి తోడు యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ (93, 84 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగటంతో దక్షిణాఫ్రికాపై రెండో వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వన్డే సిరీస్‌ను 1-1తో సమం చేసి, నిర్ణయాత్మక ఢిల్లీ సమరానికి తీసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 7 వికెట్లకు 278 పరుగులు చేసింది. హెండ్రిక్స్ (74, 76 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్), మార్కరం (79, 89 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీలతో రాణించారు. భారత పేసర్ మహ్మద్ సిరాజ్ (3/38) ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. 279 పరుగుల ఛేదనలో భారత్ మరో 25 బంతులు మిగిలి ఉండగానే లాంఛనం ముగించింది.
కిషన్, శ్రేయస్ మెరుపుల్ : తొలి వన్డే ఛేదనలో చివరి ఓవర్ వరకు పోరాడిన భారత్.. రెండో వన్డేలో అక్కడి వరకు ఆగలేదు. ఓపెనర్లు ధావన్ (13), శుభ్‌మన్ గిల్ (28) ఆరంభంలోనే వికెట్లు కోల్పోయారు. ఈ సమయంలో ఇషాన్ కిషన్ (93), శ్రేయస్ అయ్యర్ (113 నాటౌట్) మూడో వికెట్‌కు 161 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఏడు సిక్సర్లతో విరుచుకుపడిన కిషన్ 60 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత దూకుడుగా ఆడాడు. శ్రేయస్ అయ్యర్ 102 బంతుల్లో కెరీర్ రెండో వన్డే సెంచరీ నమోదు చేశాడు. కిషన్ నిష్క్రమించినా.. సంజు శాంసన్ (29 నాటౌట్, 36 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) తోడుగా అయ్యర్ లాంఛనం ముగించాడు.
సిరాజ్ సూపర్ : తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికాను హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ (3/38) వణికించాడు. టీ20 వరల్డ్‌కప్ జట్టులో ఎంపిక కోసం ఎదురుచూస్తున్న సిరాజ్.. సెలక్టర్లను మెప్పించే ప్రదర్శన చేశాడు. ఓపెనర్లు డికాక్ (5), మలాన్ (25)లను త్వరగానే వెనక్కి పంపించినా.. రీజా హెండ్రిక్స్ (74), మార్కరం (79) మూడో వికెట్‌కు విలువైన భాగస్వామ్యం నమోదు చేశారు. హెన్రిచ్ క్లాసెన్ (30), డెవిడ్ మిల్లర్ (35 నాటౌట్) చివర్లో పరుగుల వేటలో మెరిశారు. దీంతో దక్షిణాఫ్రికా తొలుత 278 పరుగులు నమోదు చేసింది. షాబాజ్ అహ్మద్ రాంచీలో వన్డే అరంగేట్రం చేశాడు. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ సైతం ఆకట్టుకున్నారు.
స్కోరు వివరాలు :
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ : డికాక్ (బి) సిరాజ్ 5, మలన్ (ఎల్బీ) షాబాజ్ 25, రీజా (సి) షాబాజ్ (బి) సిరాజ్ 74, మార్కరం (సి) ధావన్ (బి) సుందర్ 79, క్లాసెన్ (సి) సిరాజ్ (బి) కుల్దీప్ 30, మిల్లర్ నాటౌట్ 35, పార్నెల్ (సి) అయ్యర్ (బి) శార్దుల్ 16, మహరాజ్ (బి) సిరాజ్ 5, ఫోర్టెన్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 9, మొత్తం :(50 ఓవర్లలో 7 వికెట్లకు) 278.
వికెట్ల పతనం : 1-7, 2-40, 3-169, 4-215, 5-215, 6-256, 7-277.
బౌలింగ్ : సిరాజ్ 10-1-38-3, సుందర్ 9-0-60-1, షాబాజ్ 10-0-54-1, అవేశ్ 7-0-35-0, కుల్దీప్ 9-0-49-1, శార్దుల్ 5-0-36-1.
భారత్ ఇన్నింగ్స్ : ధావన్ (బి) పార్నెల్ 13, గిల్ (సి,బి) రబాడ 28, కిషన్ (సి) హెండ్రిక్స్ (బి) ఫోర్టెన్ 93, అయ్యర్ నాటౌట్ 113, సంజు నాటౌట్ 29, ఎక్స్‌ట్రాలు :6, మొత్తం : (45.5 ఓవర్లలో 3 వికెట్లకు) 282.
వికెట్ల పతనం : 1-28, 2-48, 3-209.
బౌలింగ్ : ఫోర్టెన్ 9-1-52-1, పార్నెల్ 8-0-43-1, రబాడ 10-1-59-1, నోకియా 8.5-0-60-0, మహరాజ్ 7-0-45-0, మార్కరం 3-0-22-0.