Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- థాయ్‌లాండ్ 37 ఆలౌట్
- విజయంతో సెమీస్‌కు భారత్
సిల్హట్ (బంగ్లాదేశ్) : థాయ్‌లాండ్‌పై మాయ జాలంతో టీమ్ ఇండియా ఆసియా కప్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. భారత స్పిన్నర్లు మ్యాజిక్ షోతో థాయ్‌లాండ్ మహిళల జట్టు అత్యల్ప స్కోరుకే కుప్పకూలింది. స్పిన్నర్లు స్నేహ రానా (3/9), దీప్తి శర్మ (2/10), రాజేశ్వరి (2/8) వికెట్ల వేటలో విజృంభించటంతో తొలుత బ్యాటింగ్ చేసిన థాయ్‌లాండ్ 15.1 ఓవర్లలో 37 పరుగులకు పది వికెట్లు కోల్పోయింది. థాయ్‌లాండ్ జట్టులో ఓపెనర్ నాన్నాపట్ (12) మినహా మరో బ్యాటర్ రెండెంకల స్కోరు అందుకోలేదు. చాంతమ్ (6), చావాయ్ (3), చానింద (0), తిపోచ్ (2), పహనిట (1), రోసెనన్ (0), బూచతమ్ (7), ఒనిచా (0), పూతవాంగ్ (5), బూన్సికం (0)లు భారత బౌలర్ల ధాటికి నిలబడలేకపోయారు. స్వల్ప లక్ష్య ఛేదనను భారత అమ్మాయిలు 6 ఓవర్లలోనే పూర్తి చేశారు. తెలుగమ్మాయి సబ్బినేని మేఘన (20 నాటౌట్, 18 బంతుల్లో 3 ఫోర్లు) అజేయంగా నిలువగా.. పూజ వస్ట్రాకర్ (12 నాటౌట్) రాణించింది. షెఫాలీ వర్మ (8) వికెట్ కోల్పోగా భారత్ మరో 14 ఓవర్లు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గ్రూప్ దశలో ఆరు మ్యాచుల్లో ఐదు విజయాలు నమోదు చేసి అగ్రస్థానంలో సెమీఫైనల్లోకి ప్రవేశించింది.
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మ్యాచ్‌కు దూరం కాగా.. స్మృతీ మంధాన నాయకత్వ పగ్గాలు చేపట్టింది. మంధానకు ఇది కెరీర్ 100వ టీ20 మ్యాచ్ కావటం విశేషం. మూడు వికెట్లతో మాయ చేసిన స్నేహ రానా 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకుంది. అక్టోబర్ 13న (గురువారం) ఆసియా కప్ సెమీఫైనల్స్ జరుగనున్నాయి.