Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్‌సీఏ ప్రతినిధిగా మాజీ అధ్యక్షుడు
- గడువు ముగిశాక శేషు నారాయణ ఫిర్యాదు
నవతెలంగాణ, హైదరాబాద్ :భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక సర్వ సభ్య సమావేశంలో (ఏజీఎం) హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ప్రతినిధిగా తాజా మాజీ అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ హాజరు కానున్నారు. ఈ మేరకు బీసీసీఐ ఎలక్టోరల్ ఆఫీసర్ సోమవారం ఎలక్టోరల్ రోల్ తుది జాబితాను ప్రకటించారు. బీసీసీఐ ఎన్నికల అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం హెచ్‌సీఏ తరఫున మహ్మద్ అజహరుద్దీన్ ఏజీఎంలో పాల్గొని, ఓటు హక్కు వినియోగంచుకోనున్నాడు. మాజీ అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ తనంతట తానుగా బీసీసీఐ ఎజీఎంకు నామినేట్ చేసుకోవటంపై హెచ్‌సీఏ మాజీ కార్యదర్శి శేషు నారాయణ ఫిర్యాదు చేశారు. కానీ ఎన్నికల అధికారి శేషు నారాయణ అభ్యంతరాలను కమిటీ పక్కనపెట్టింది.
గడువు ముగిసిందని.. : హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా మహ్మద్ అజహరుద్దీన్ పదవీ కాలం సెప్టెంబర్ 26, 2022న ముగిసింది. సుప్రీంకోర్టు నియమిత పర్యవేక్షణ కమిటీకి సహకారం అందించేందుకు, ఉద్యోగులకు వేతనాల చెల్లింపుల కోసం అధ్యక్షుడు, కార్యదర్శిలకు చెక్ పవర్‌తో కూడిన అధికారం మాత్రమే ఉంది. బీసీసీఐ ఎన్నికల్లో ఓటు వేసేందుకు హెచ్‌సీఏ తమ ప్రతినిధిని ఏజీఎంలో ఎంచుకోవాల్సి ఉంటుంది. హెచ్‌సీఏలో ఏజీఎం నిర్వహించకుండా అజహరుద్దీన్ తనకు తాను ప్రతినిధిగా బీసీసీఐకి పేరును నామినేట్ చేసుకున్నారు. ఇదే విషయాన్ని శేషు నారాయణ ఈమెయిల్ ద్వారా అక్టోబర్ 9, 10న ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. కానీ అభ్యంతరాల స్వీకరణ గడువు అక్టోబర్ 7, మధ్యాహ్నాం 3 గంటలకే ముగిసింది. గడువు అనంతరం ఫిర్యాదు అందటంతో శేషు నారాయణ అభ్యంతరాలను ఎన్నికల అధికారి పరిశీలనకు తీసుకోలేదు. ఇది మహ్మద్ అజహరుద్దీన్‌కు కలిసొచ్చింది. అభ్యంతరాలు ఉన్నప్పటికీ.. మహ్మద్ అజహరుద్దీన్ బీసీసీఐ ఏజీఎంకు హాజరు కానున్నారు. అక్టోబర్ 18న ముంబయిలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో జరిగే ఎన్నికల్లో అజహరుద్దీన్ హెచ్‌సీఏ తరఫున ఓటు వేయనున్నారు.
అజహర్‌పై సీపీకి ఫిర్యాదు : ఇదిలా ఉండగా, పదవీ కాలం ముగిసినా హెచ్‌సీఏ అధ్యక్షుడిగా బీసీసీఐ ఏజీఎంకు హాజరయ్యేందుకు తప్పుడు పత్రాలు సృష్టించి, తనను తాను నామినేట్ చేసుకున్నాడని అజహరుద్దీన్‌పై రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్‌కు హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు జి. వినోద్ , మాజీ కార్యదర్శి శేషు నారాయణ, మాజీ సభ్యుడు చిట్టి శ్రీధర్‌లు ఫిర్యాదు చేశారు. మహ్మద్ అజహరుద్దీన్‌పై క్రిమినల్ కేసు పెట్టి, కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కమిషనర్‌ను ఫిర్యాదులో కోరారు.