Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెరిసిన సూర్యకుమార్
- వాకా ఎలెవన్‌పై భారత్ గెలుపు
పెర్త్ (ఆస్ట్రేలియా) : 2022 ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ సమర సన్నాహకంలో టీమ్ ఇండియా తొలి అడుగు వేసింది. ఆస్ట్రేలియాకు చేరుకున్న ప్రాక్టీస్ సెషన్లలతో చెమటోడ్చుతున్న భారత జట్టు.. సోమవారం వెస్టర్న్ ఆస్ట్రేలియా క్రికెట్ సంఘం (వాకా) ఎలెవెన్‌పై 13 పరుగులతో ప్రాక్టీస్ మ్యాచ్‌లో గెలుపొందింది. యువ పేసర్ అర్షదీప్ సింగ్ (3/6) కండ్లుచెదిరే ప్రదర్శనతో చెలరేగగా.. సంచలన బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (52, 35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు అర్థ సెంచరీతో కదం తొక్కాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసింది. ఛేదనలో వెస్టర్న్ ఆస్ట్రేలియా ఎలెవన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 145 పరుగులే చేసింది. అక్టోబర్ 13న వెస్టర్న్ ఆస్ట్రేలియాతో భారత్ మరో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. అనతంరం వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ కోసం బ్రిస్బేన్ వెళ్లనుంది.
సూపర్ సూర్య : టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. ఆస్ట్రేలియా పిచ్‌లపై పేస్, బౌన్స్‌ను ఎదుర్కొవటంపై ఫోకస్ చేసింది. రోహిత్ శర్మతో కలిసి రిషబ్ పంత్ ఓపెనర్‌గా వచ్చినా.. ఇద్దరూ విఫలమయ్యారు. రోహిత్ 3 పరుగులు చేయగా, పంత్ 16 బంతుల్లో 9 పరుగులే చేశాడు. నం.3 బ్యాటర్‌గా దీపక్ హుడా (24) 14 బంతుల్లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో రాణించాడు. మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్ సహజశైలిలో శివమెత్తాడు. వెస్టర్న్ ఆస్ట్రేలియా పేసర్లు సూర్యకుమార్‌ను ఏమాత్రం ఇరకాటంలో పెట్టలేకపోయారు. సూర్య స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించి అర్థ సెంచరీ సాధించాడు. మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు బాదిన సూర్యకుమార్ భారత్‌కు మంచి స్కోరు అందించాడు. హార్దిక్ పాండ్య (27, 20 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్), దినేశ్ కార్తీక్ (19 నాటౌట్, 23 బంతుల్లో 1 ఫోర్), అక్షర్ పటేల్ (10, 5 బంతుల్లో 1 సిక్స్) రాణించారు. అయితే, దినేశ్ కార్తీక్ డెత్ ఓవర్లలో అంచాలను అందుకోలేదు. వాకా బౌలర్లలో బెహాన్‌డార్ఫ్, రిచర్డ్సన్, మాథ్యూ కెల్లీ, అండ్రూ టైలు మెరిశారు.
అర్ష, భువీ దూకుడు : 159 పరుగుల లక్ష్య ఛేదనలో వాకాను పవర్‌ప్లేలోనే కోలుకోలేని దెబ్బకొట్టారు. భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్ కొత్త బంతితో విజృంభించటంతో 3 ఓవర్లలోనే వాకా జట్టు 12/4తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. ఆ తర్వాత వాకా ఏ దశలోనూ గెలుపు కోసం ప్రయత్నించలేదు. మిడిల్ ఆర్డర్లో శామ్ ఫాన్నింగ్ (59, 53 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీ సాధించినా.. జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ మూడు ఓవర్లలో ఆరు పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ (2/26), యుజ్వెంద్ర చాహల్ (2/15) రాణించారు.
సంక్షిప్త స్కోర్లు :
భారత్ ఇన్నింగ్స్ : 158/6 (సూర్యకుమార్ 52, హార్దిక్ పాండ్య 27, దీపక్ హుడా 22, బెహాన్‌డార్ఫ్ 2/26)
వెస్టర్న్ ఆస్ట్రేలియా :145/8 (శామ్ ఫాన్నింగ్ 59, బాన్‌క్రాఫ్ట్ 22, అర్షదీప్ 3/6, చాహల్ 2/15, భువనేశ్వర్ 2/26)