Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణాఫ్రికా 99 ఆలౌట్
- కుల్దీప్, సుందర్, షాబాజ్ మాయ
- 7 వికెట్లతో భారత్ ఘన విజయం
- 2-1తో వన్డే సిరీస్ కైవసం
భారత్ పాంచ్ పటాకా!. టీమ్ ఇండియా వరుసగా ఐదో ద్వైపాక్షిక సిరీస్ విజయం సొంతం చేసుకుంది. వర్షం ప్రభావిత పిచ్‌పై స్పిన్నర్లు మాయజాలం ప్రదర్శించగా సఫారీలు విలవిల్లాడారు. 7 వికెట్ల తేడాతో మూడో వన్డేలో ఘన విజయం సాధించిన టీమ్ ఇండియా.. 2-1తో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, కుల్దీప్ యాదవ్ స్పిన్ మాయజాలంతో ఎనిమిది వికెట్లు పడగొట్టారు. స్పిన్నర్లు బంతిని తిప్పగా.. సఫారీ బ్యాటర్లు బ్యాట్లేత్తేశారు!. 99 పరుగులకే దక్షిణాఫ్రికా కుప్పకూలింది. 100 పరుగుల ఛేదనలో శుభ్‌మన్ గిల్ (49) మెరవటంతో 19.1 ఓవర్లలోనే భారత్ గెలుపు గీత తాకింది.
నవతెలంగాణ-న్యూఢిల్లీ :దక్షిణాఫ్రికా చిత్తు చిత్తు. స్పిన్నర్లు మెరవటంతో దక్షిణాఫ్రికా భారత్‌పై అత్యల్ప స్కోరు నమోదు చేసింది. బలమైన జట్టుతో బరిలోకి దిగినా.. 99 పరుగులకే కుప్పకూలింది. 27.1 ఓవర్లలోనే సఫారీలను చుట్టేసిన భారత బౌలర్లు వన్డే సిరీస్ విజయాన్ని లాంఛనం చేశారు. చైనామన్ కుల్దీప్ యాదవ్ (4/18), వాషింగ్టన్ సుందర్ (2/15), షాబాజ్ అహ్మద్ (2/32) మాయ చేశారు. పేసర్ మహ్మద్ సిరాజ్ (2/17) పవర్‌ప్లేలో పవర్ఫుల్ ప్రదర్శన చేశాడు. స్వల్ప ఛేదనలో యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (49, 57 బంతుల్లో 8 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (28 నాటౌట్, 23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. 19.1 ఓవర్లలోనే భారత్ 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా మహ్మద్ సిరాజ్ నిలువగా.. కుల్దీప్ యాదవ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
మాయ చేసి..99కే కూల్చి! : మ్యాచ్‌కు ముందు వరుసగా ఎడతెరపి లేని వర్షం. పిచ్ తడవకుండా అన్ని జాగ్రత్తలు వహించిన క్యూరేటర్. మ్యాచ్ రోజు సైతం అవుట్‌ఫీల్డ్ తడిగా ఉండటంతో ఆరంభం కాస్త ఆలస్యం. టాస్ నెగ్గిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. వర్షంతో కూడిన పరిస్థితుల్లో పేస్‌కు అనుకూలించాల్సిన పిచ్.. కవర్లతో కప్పి ఉంచటంతో పొడిగా మారి స్పిన్‌కు స్వర్గధామంగా మారింది. దీంతో తొలి ఓవర్‌ను వాషింగ్టన్ సుందర్‌కు అందించిన కెప్టెన్ శిఖర్ ధావన్ స్పిన్ మాయజాల ప్రదర్శనకు తెరతీశాడు. వాషింగ్టన్ సుందర్ ఓవర్లో డికాక్ (6) పడిపోగా.. పేసర్ మహ్మద్ సిరాజ్ జోరుకు మలాన్ (15), హెండ్రిక్స్ (3) వికెట్లు కోల్పోయారు. సుందర్, సిరాజ్ విజృంభణతో పవర్‌ప్లేలో (10 ఓవర్లు) 2019 వరల్డ్‌కప్ అనంతరం భారత్ అత్యుత్తమ ప్రదర్శన చేసింది. దక్షిణాఫ్రికా 10 ఓవర్ల అనంతరం 26/3తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది.
మిడిల్ ఆర్డర్‌ను షాబాజ్ అహ్మద్ కుదిపేయగా.. లోయర్ ఆర్డర్ కథ కుల్దీప్ యాదవ్ ముగించాడు. హెన్రిచ్ క్లాసెన్ (34, 42 బంతుల్లో 4 ఫోర్లు) ఒక్కడే భారత బౌలర్లను ఎదుర్కొవటంలో పోరాట పటిమ చూపాడు. మార్కరం (9), క్లాసెన్ (34)లు షాబాజ్‌కు దాసోహం కాగా.. ప్రమాదకర డెవిడ్ మిల్లర్ (7)ను వాషింగ్టన్ సుందర్ వెనక్కి పంపించాడు. టెయిలెండర్లు ఫెలుక్వయో (56), మార్కో జాన్సెన్ (14), ఫోర్టెన్ (1), నోకియా (0)లు కుల్దీప్ యాదవ్ మాయలో పడ్డారు. తోక కత్తిరించటంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయని భారత్ 27.1 ఓవర్లలో దక్షిణాఫ్రికాను 99 పరుగులకే కుప్పకూల్చింది. వన్డేల్లో భారత్‌పై సఫారీలకు ఇదే అత్యల్ప స్కోరు. ఓవరాల్‌గా వన్డేల్లో ఇది నాల్గో అత్యల్ప స్కోరు కావటం విశేషం.
రాణించిన గిల్ : 100 పరుగుల ఛేదనలో కెప్టెన్ శిఖర్ ధావన్ (8), ఇషాన్ కిషన్ (10) స్వల్ప స్కోర్లకే వికెట్లు కోల్పోయారు. రాంచీలో రాణించిన కిషన్.. ఆ జోరు ఢిల్లీలో చూపించలేదు. ఇక కెప్టెన్ శిఖర్ ధావన్ మూడు మ్యాచుల్లో అత్యంత దారుణ ప్రదర్శనతో నిరాశపరిచాడు. తొలి రెండు వన్డేల్లో విఫలమైన శుభ్‌మన్ గిల్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో రాణించాడు. 57 బంతుల్లో 8 ఫోర్లతో 49 పరుగులు చేశాడు. అర్థ సెంచరీకి పరుగు దూరంలో వికెట్ కోల్పోయిన శుభ్‌మన్ గిల్ నిరాశగా నిష్క్రమించాడు. శ్రేయస్ అయ్యర్ (28 నాటౌట్, 23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) సూపర్ ఫామ్ కొనసాగించాడు. మార్కో జాన్సెన్ ఓవర్లో సిక్సర్‌తో అయ్యర్ లాంఛనం ముగించాడు. సంజు శాంసన్ (2 నాటౌట్, 4 బంతుల్లో) అజేయంగా నిలిచాడు. 19.1 ఓవర్లలో 105 పరుగులు సాధించిన భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లుంగిసాని ఎంగిడి (1/21), ఫోర్టెన్ (1/20)లు చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.
స్కోరు వివరాలు :
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ : జానెమాన్ మలన్ (సి) అవేశ్ ఖాన్ (బి) సిరాజ్ 15, డికాక్ (సి) అవేశ్ ఖాన్ (బి) వాషింగ్టన్ 6, హెండ్రిక్స్ (సి) రవి బిష్ణోరు (బి) సిరాజ్ 3, మార్కరం (సి) సంజు శాంసన్ (బి) షాబాజ్ 9, క్లాసెన్ (బి) షాబాజ్ 34, డెవిడ్ మిల్లర్ (బి) వాషింగ్టన్ 7, ఫెలుక్వయో (బి) కుల్దీప్ యాదవ్ 5, మార్కో జాన్సెన్ (సి) అవేశ్ ఖాన్ (బి) కుల్దీప్ యాదవ్ 14, ఫోర్టెన్ (ఎల్బీ) కుల్దీప్ యాదవ్ 1, ఎన్రిచ్ నోకియా (బి) కుల్దీప్ యాదవ్ 0, లుంగిసాని ఎంగిడి నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 5, మొత్తం :(27.1 ఓవర్లలో ఆలౌట్) 99.
వికెట్ల పతనం : 1-7, 2-25, 3-26, 4-43, 5-66, 6-71, 7-93, 8-94, 9-94, 10-99.
బౌలింగ్ : వాషింగ్టన్ సుందర్ 4-0-15-2, మహ్మద్ సిరాజ్ 5-0-17-2, అవేశ్ ఖాన్ 5-1-8-0, షాబాజ్ అహ్మద్ 7-0-32-2, శార్దుల్ ఠాకూర్ 2-0-8-0, కుల్దీప్ యాదవ్ 4.1-1-18-4.
భారత్ ఇన్నింగ్స్ : శిఖర్ ధావన్ (రనౌట్) 8, శుభ్‌మన్ గిల్ (ఎల్బీ) లుంగిసాని ఎంగిడి 49, ఇషాన్ కిషన్ (సి) డికాక్ (బి) ఫోర్టెన్ 10, శ్రేయస్ అయ్యర్ నాటౌట్ 28, సంజు శాంసన్ నాటౌట్ 2, ఎక్స్‌ట్రాలు : 8, మొత్తం :(19.1 ఓవర్లలో 3 వికెట్లకు) 105.
వికెట్ల పతనం : 1-42, 2-58, 3-97.
బౌలింగ్ : మార్కో జాన్సెన్ 5.1-0-43-0, లుంగిసాని ఎంగిడి 5-0-21-1, ఎన్రిచ్ నోకియా 5-1-15-0, ఫోర్టెన్ 4-1-20-1.