Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోర్డులో గంగూలీ పదవి ప్రశ్నార్థకం
- అధ్యక్ష రేసులో రోజర్ బిన్ని
- ఐపీఎల్ చైర్మన్‌గా అరుణ్ ధుమాల్
నవతెలంగాణ-ముంబయి :భారత క్రికెట్లో దాదాగిరిపై ఎటు తేలటం లేదు!. బీసీసీఐ రాజ్యాంగంలో కీలక సవరణలకు సుప్రీంకోర్టు సుముఖత వ్యక్తం చేయటంతో అధ్యక్ష, కార్యదర్శులుగా గంగూలీ, జై షా జోడీ కొనసాగుతుందనే అందరూ భావించారు. ఐసీసీ చైర్మన్‌గా గంగూలీ వెళ్తారనే ప్రచారం సాగినా, దాదా మాత్రం బీసీసీఐలోనే కొనసాగుతాననే సంకేతాలు ఇచ్చాడు. అక్టోబర్ 18న బీసీసీఐ ఎన్నికలు జరుగనున్నాయి. మంగళవారం నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. దీంతో రానున్న మూడేండ్లకు బీసీసీఐ ఆఫీస్ బేరర్లుగా రేసులో ఉన్న అభ్యర్థుల జాబితాలో సౌరవ్ గంగూలీ పేరు గల్లంతైంది. వెటరన్ క్రికెటర్, కర్ణాటక క్రికెట్ సంఘంలో పలు కీలక పదవులు చేపట్టిన రోజర్ బిన్ని నూతన అధ్యక్షుడిగా ఎన్నికవుతాడనే వార్తలొస్తున్నాయి. దీంతో సౌరవ్ గంగూలీ దాదాగిరికి బోర్డులో చెక్ పడినట్టేనా?! ఈ ప్రశ్నకు సమాధానం తెలియటం లేదు.
మళ్లీ కార్యదర్శి జై షా : బీసీసీఐ అత్యంత శక్తివంతమైన పదవి కార్యదర్శి. 2019లో బోర్డు కార్యదర్శిగా ఎన్నికైన జై షా మరో మూడేండ్ల పాటు (2025) ఆ పదవిలో కొనసాగేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఐదుగురు ఆఫీస్ బేరర్లుగా ఎవరు ఉండాలనే అంశంపై మంగళవారం ముంబయిలో సమావేశమై తేల్చినట్టు సమాచారం. దీని ప్రకారం అధ్యక్షుడిగా రోజర్ బిన్ని, కార్యదర్శిగా జై షా ఉండనున్నారు. రాజీవ్ శుక్లా మళ్లీ ఉపాధ్యక్షుడిగా కొనసాగనున్నాడు. ముంబయి క్రికెట్ సంఘానికి చెందిన ఆశీష్ షెలార్ కోశాధికారిగా, అస్సాం క్రికెట్ సంఘం నుంచి దేవజిత్ సైకియ సంయుక్త కార్యదర్శిగా ఉండనున్నట్టు సమాచారం. గురువారం నామినేష్లను పరిశీలించి తుది జాబితా విడుదల చేయనున్నారు. ఐదుగురు ఆఫీస్ బేరర్ల పదవులకు ఐదుగురు అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేయనున్నట్టు తెలుస్తోంది. దీంతో ఏజీఎంలో ఎన్నిక అవసరం లేకుండానే ఐదుగురు ఆఫీస్ బేరర్లు పదవలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సోదరుడు అరుణ్ కుమార్ ధుమాల్ మూడేండ్లుగా కోశాధికారిగా ఉన్నారు. బ్రిజేశ్ పటేల్‌ను పక్కనపెట్టి.. అరుణ్ కుమార్ ధుమాల్ ఐపీఎల్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది.
ఈ మొత్తం ప్రక్రియలో ప్రస్తుత అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పాత్రపై బీసీసీఐ వర్గాల నుంచి ఎటువంటి సమాచారం లేకపోవటం గమనార్హం. నిబంధనల ప్రకారం గంగూలీ మరో మూడేండ్లు పదవిలో కొనసాగేందుకు అర్హుడు. అయితే ఇప్పుడు మూడేండ్లు ఐసీసీ పదవిలో కొనసాగి.. విరామ సమయం అనంతరం వరుసగా ఆరేండ్లు బోర్డు పగ్గాలు చేపట్టేందుకు దాదా దూరదృష్టితో ఆలోచన చేస్తున్నాడా? అనేది తెలియాల్సి ఉంది. బోర్డు పదవి చేపట్టకపోయినా.. బెంగాల్ రాష్ట్ర క్రికెట్ సంఘంలో కొనసాగినా.. గంగూలీ తర్వాతి మూడేండ్లు పదవికి దూరంగా ఉండాల్సి ఉంటుంది.