Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీసీఐ అధ్యక్ష పీఠంపై గంగూలీ
- భవిష్యత్‌లో పెద్ద పదవి చేపడతాను
కోల్‌కత : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో ఊహించని మలుపు. మాజీ కెప్టెన్, ప్రస్తుత అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరో మూడేండ్లు పదవిలో కొనసాగేందుకు అవకాశం లేకుండా పోయింది. ప్రపంచ ధనిక క్రికెట్ బోర్డు బాస్‌గా కొనసాగేందుకు దాదా సుముఖంగా ఉన్నప్పటికీ.. బీసీసీఐ అంతర్గత రాజకీయాలు గంగూలీని పక్కనకు తప్పించినట్టు సమాచారం. అక్టోబర్ 13తో బీసీసీఐ ఆఫీస్ బేరర్లకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. 1983 ప్రపంచకప్ నెగ్గిన జట్టులో సభ్యుడు రోజర్ బిన్ని అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా తనయుడు జై షా మరోసారి కార్యదర్శి పదవికి నామినేషన్ వేశారు. ఉపాధ్యక్ష పదవికి రాజీవ్ శుక్లా నామినేషన్లు దాఖలు చేశారు. కోశాధికారి, సంయుక్త కార్యదర్శులుగా అస్సాం, ముంబయి రాష్ట్ర క్రికెట్ సంఘాలకు చెందిన కీలక వ్యక్తులకు ఇచ్చారు. బీసీసీఐలో అధ్యక్ష పదవి చేజారటంపై ఓ కార్యక్రమంలో పాల్గొన్న గంగూలీ స్పందించాడు.
'జీవితకాలం క్రికెట్ ఆడలేం. అలాగే, జీవిత కాలం పదవిలో కొనసాగలేం. ఇదంతా జీవితంలో ఓ భాగం. ఒకే నాణేనికి రెండు పార్శ్యాలు ఇవి. భవిష్యత్‌లో మరింత పెద్ద పదవి చేపట్టేందుకు ప్రయత్నిస్తాను' అని సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. ' నేను క్రికెటర్ల పరిపాలకుడిని. బోర్డులో ఎంతో డబ్బు ఉంది, ఎంతగానో క్రికెట్ జరుగుతుంది, సహజంగానే అధ్యక్షుడిగా నిర్ణయాలు తీసుకోవాలి. దేశవాళీ క్రికెట్, మహిళల ఐపీఎల్.. దీంతో కొన్నిసార్లు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది' అని దాదా తెలిపాడు. 'నాకు తెలిసి జీవితం అంటేనే నమ్మకం. ఈ ప్రక్రియలో అందరూ పరీక్షింపబడతారు, అందరూ బహుమానాలు పొందుతారు. అందరూ తిరస్కరించబడతారు. అదే జీవన చక్రం. కానీ నిలకడగా ఉండేది నీ సత్తా, సామర్థ్యాలపై నమ్మకం మాత్రమేనని గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.