Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళల ఐపీఎల్‌కు శ్రీకారం
- 2023 మార్చిలో తొలి సీజన్
నవతెలంగాణ-ముంబయి :నిరీక్షణ ముగిసింది. మహిళలకు సైతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్‌ను నిర్వహించనున్నారు. వచ్చే ఏడాదిలోనే మహిళల ఐపీఎల్ తొలి సీజన్ అభిమానుల ముందుకు రానుంది. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల ఐపీఎల్, టోర్నీ ప్రతిపాదిత ఫార్మాట్, షెడ్యూల్ వివరాల గురించి రాష్ట్ర క్రికెట్ సంఘాలకు బీసీసీఐ లేఖ రాసింది. రాష్ట్ర క్రికెట్ సంఘాలకు రాసిన లేఖ ప్రకారం, 2023 మార్చిలో తొలి మహిళల ఐపీఎల్ ఆరంభం కానుంది. ఐదు జట్లతో కూడిన మహిళల ఐపీఎల్.. ఫిబ్రవరి ఆఖర్లో మహిళల ఐసీసీ టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే షురూ కానుంది. ఈ మేరకు బీసీసీఐ ప్రణాళికలు రూపొందించింది.
ఐదు జట్లు, 22 మ్యాచులు! : మహిళల ఐపీఎల్ తొలి సీజన్లో ఐదు జట్లు పోటీపడనున్నాయి. ప్రస్తుతం మెన్స్ ఐపీఎల్ ప్రాంఛైజీ యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపిన బీసీసీఐ.. ఈ మేరకు ఐదు జట్లను ఖరారు చేయనుంది. ఐదు జట్లతో కూడిన ఐపీఎల్ సీజన్‌ను వేర్వేరు వేదికల్లో వరుస రోజుల్లో నిర్వహించటం అంత తేలిక కాదు. దీంతో బీసీసీఐ షెడ్యూల్ అంశంలో కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. ఏదేని రెండు వేదికల్లో పదేసి మ్యాచుల చొప్పున నిర్వహిస్తారు. ప్లే ఆఫ్స్‌కు వేదికను తర్వాత నిర్ణయిస్తారు. రెండో సీజన్ ఐపీఎల్‌కు మిగతా రెండు వేదికల్లో నిర్వహించేందుకు.. ఇలా రొటేషన్ పద్దతిని అమలు చేయనున్నారు. గ్రూప్ దశలో ప్రతి జట్టు ఇతర జట్లతో రెండు మ్యాచుల్లో తలపడతాయి. గ్రూప్ దశ మ్యాచుల అనంతరం అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది. రెండు, మూడో స్థానంలో నిలిచిన జట్లు క్వాలిఫయర్‌లో తలపడి ఫైనల్స్‌కు చేరుకుంటాయి.
జోన్ల వారీగా..! : మహిళల ఐపీఎల్‌కు ఆతిథ్య నగరాలపై బీసీసీఐ సరికొత్త ఆలోచనలతో ముందుకొచ్చింది. ఐదు జోన్ల వారీగా ఒక్కో జోన్లో ఓ నగరాన్ని ఎంపిక చేయనుంది. కోచి, విశాఖపట్నం (సౌత్ జోన్), ధర్మశాల, జమ్మూ (నార్త్‌జోన్), పుణె, రాజ్‌కోట్ (వెస్ట్ జోన్), ఇండోర్, నాగ్‌పూర్, రారుపూర్ (సెంట్రల్ జోన్), రాంచీ, కటక్ (ఈస్ట్ జోన్), గువహటి (నార్త్ఈస్ట్ జోన్)లను జోన్ల వారీగా ఆతిథ్య నగరాల జాబితా రూపొందించారు. ఐదు జట్లు ఐదు జోన్లకు ప్రాతినిథ్యం వహిస్తాయి. ఇది కాకుంటే, అహ్మదాబాద్, బెంగళూర్, చెన్నై, ఢిల్లీ, కోల్‌కత, ముంబయి నగరాలు వేదికలుగా ఐదు జట్లు ఆడతాయి. ఈ ప్రతిపాదనను అక్టోబర్ 18న ఏజీఎంలో చర్చించనున్నారు. బోర్డు ఆఫీస్ బేరర్లతో పాటు ఐపీఎల్ చైర్మన్‌ను ఈ సమావేశంలో ఎన్నుకోనున్నారు. నూతన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు.
ఇక జట్ల నిబంధనల ప్రకారం.. ప్రతి జట్టులో 18 మంది క్రికెటర్లు ఉండాలి. గరిష్టంగా ఎనిమిది మంది విదేశీ క్రికెటర్లను వేలంలో తీసుకునే వీలుంది. తుది జట్టులో ఐదుగురు విదేశీ క్రికెటర్లకు చోటు కల్పించవచ్చు.