Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసియా కప్ ఫైనల్లో భారత్
- సెమీస్‌లో థారులాండ్‌పై గెలుపు
- మహిళల ఆసియా కప్ 2022
అమ్మాయిలు అదరగొట్టారు. రికార్డు స్థాయిలో వరుసగా ఏడోసారి ఆసియా కప్ ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన సెమీఫైనల్లో థారులాండ్ మహిళల జట్టును చిత్తు చేసి టైటిల్ పోరుకు చేరుకున్నారు. బ్యాట్‌తో షెఫాలీ వర్మ, బంతితో దీప్తి శర్మ చెలరేగటంతో థారులాండ్ సెమీస్‌లో చేతులెత్తేసింది. శనివారం టైటిల్ పోరులో శ్రీలంకతో టీమ్ ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది.
నవతెలంగాణ-సిల్హట్ : భారత అమ్మాయిలకు ఎదురులేదు. ఆసియా కప్‌లో టీమ్ ఇండియా అప్రతిహాత జైత్రయాత్ర కొనసాగుతోంది. 2022 ఆసియా కప్‌లో భారత మహిళల జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో థారులాండ్‌పై 74 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. శనివారం నాటి అంతిమ సమరంలో టైటిల్ కోసం శ్రీలంక మహిళల జట్టుతో ఢకొట్టనుంది. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' షెఫాలీ వర్మ (42, 28 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ మెరుపులతో తొలుత భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 148 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఛేదనలో థారులాండ్ ఆరంభంలోనే చేతులెత్తేసింది. స్పిన్నర్ దీప్ది శర్మ మాయజాలంతో ఆ జట్టు 74 పరుగులకే పరిమితమైంది.
షెఫాలీ ధనాధన్ : సెమీఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా భారీ స్కోరు సాధించింది. స్టార్ బ్యాటర్ స్మృతీ మంధాన (13) క్రీజులో సౌకర్యవంతంగా కనిపించలేదు. మంధాన నిరాశపరిచినా.. షెఫాలీ వర్మ (42) ధనాధన్ షో చూపించింది. వర్మ మెరుపులతో పవర్‌ప్లేలో భారత్ మంచి స్కోరు సాధించింది. జెమీమా రొడ్రిగస్ (27, 26 బంతుల్లో 3 ఫోర్లు), హర్మన్‌ప్రీత్ కౌర్ (36, 30 బంతుల్లో 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు నమోదు చేశారు. షెఫాలీ, జెమీమా, హర్మన్‌ప్రీత్ రాణించటంతో భారత్ సులువుగానే పరుగులు పిండుకుంది. లోయర్ ఆర్డర్లో పూజ వస్ట్రాకర్ (17, 13 బంతుల్లో 1 సిక్స్) దూకుడుగా ఆడింది. థారులాండ్ బౌలర్లలో టిపోచ్ (3/24) మూడు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకుంది.
స్పిన్ మాయ : గ్రూప్ దశలో భారత్ చేతిలో 37 పరుగులకే కుప్పకూలిన థారులాండ్.. సెమీఫైనల్లో మెరుగైన ప్రదర్శనే చేసింది. నాణ్యమైన భారత బౌలింగ్ ఎదురుదాడిని తట్టుకుని 20 ఓవర్ల పాటు ఆడింది. ఆఫ్ స్పిన్నర్ దీప్తి శర్మ మ్యాజిక్‌తో పవర్‌ప్లేలోనే థారులాండ్ పనైపోయింది. 18 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. టాప్ ఆర్డర్లో చైవారు (21, 41 బంతుల్లో), మిడిల్ ఆర్డర్లో బూచాతమ్ (21, 29 బంతుల్లో 1 ఫోర్) మెరవటంతో థారులాండ్ అమ్మాయిలు ఆమాత్రం స్కోరు సాధించగలిగారు. భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ రెండు వికెట్లు పడగొట్టగా..రేణుక సింగ్, స్నేహ్ రానా, షెఫాలీ వర్మలు తలా ఓ వికెట్ ఖాతాలో వేసుకున్నారు.
స్కోరు వివరాలు :
భారత్ ఇన్నింగ్స్ : షెఫాలీ వర్మ (సి) చైవారు (బి) టిపోచ్ 42, స్మృతీ మంధాన (సి) కామ్చోపు (బి) మాయ 13, జెమీమా రొడ్రిగస్ (సి) కానోహ్ (బి) పుటావాంగ్ 27, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి) చాంతమ్ (బి) టిపోచ్ 36, రిచా ఘోష్ (ఎల్బీ) టిపోచ్ 2, పూజ వస్ట్రాకర్ నాటౌట్ 17, దీప్తి శర్మ (సి) కానోహ్ (బి) బూచాతమ్ 3, ఎక్స్‌ట్రాలు : 8, మొత్తం : (20 ఓవర్లలో 6 వికెట్లకు) 148.
వికెట్ల పతనం : 1-38, 2-67, 3-109, 4-120, 5-132, 6-148.
బౌలింగ్ : బూచాతమ్ 4-0-31-1, చానింద 2-0-15-0, మాయ 1-0-12-1, టిపాచ 4-0-24-1, కామ్చోపు 4-0-23-0, టిపోచ్ 4-0-24-3, బూన్సుకమ్ 1-0-16-0.
థారులాండ్ ఇన్నింగ్స్ : నాన్పాట్ (సి) షెఫాలీ వర్మ (బి) దీప్తి శర్మ 5, చాంతమ్ (సి) పూజ (బి) దీప్తి శర్మ 4, చైవారు (ఎల్బీ) రాజేశ్వరి గైక్వాడ్ 21, టిపోచ్ (సి) రిచా (బి) దీప్తి శర్మ 5, చానింద (బి) రేణుక సింగ్ 1, బూచాతమ్ (ఎల్బీ) స్నేహ్ రానా 21, కానోరు (స్టంప్డ్) రిచా (బి) షెఫాలీ 5, టిపాచ నాటౌట్ 0, మాయ (బి) రాజేశ్వరి గైక్వాడ్ 0, ఒనిచా (రనౌట్) 2, బూన్సుకమ్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 10, మొత్తం : (20 ఓవర్లలో 9 వికెట్లకు) 74.
వికెట్ల పతనం : 1-7, 2-10, 3-18, 4-21, 5-63, 6-71, 7-71, 8-71, 9-73.
బౌలింగ్ : దీప్తి శర్మ 4-1-7-3, రాజేశ్వరి గైక్వాడ్ 4-0-10-2, రేణుక సింగ్ 2-0-16-1, స్నేహ్ రానా 4-0-16-1, రాధ యాదవ్ 4-0-23-0, షెఫాలీ వర్మ 2-0-9-1.