Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పన్ను మినహాయింపు దక్కని ఫలితం
న్యూఢిల్లీ : స్వదేశంలో ఐసీసీ 2023 వన్డే వరల్డ్కప్ నిర్వహణకు సిద్ధమవుతున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి రూ.955 కోట్ల రూపంలో భారీ నష్టం ఎదురుగా నిలిచింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఐసీసీ ఈవెంట్లకు ఆతిథ్య క్రికెట్ బోర్డులే ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు పొందాలి. ఒకవేళ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వలేని పక్షంలో.. ఆ మొత్తం సొమ్మును ఆతిథ్య దేశం ఐసీసికి చెల్లించాల్సి ఉంటుంది. భారత్ నిబంధనల ప్రకారం ఐసీసీ ఈవెంట్లకు పన్ను మినహాయింపు లేదు. గతంలో 2016 ఐసీసీ టీ20 ప్రపంచకప్ విషయంలోనే ఈ వివాదం తెరపైకి వచ్చింది. అప్పుడు బీసీసీసీ ముక్కు పిండి ఐసీసీ డబ్బులు (రూ.193 కోట్లు) వసూలు చేసింది. 2023 ఐసీసీ వన్డే వరల్డ్కప్ ఆతిథ్య హక్కులు అందించిన సమయంలో పన్ను మినహాయింపు అంశాన్ని మరోసారి స్పష్టం చేసింది. దీని ప్రకారం బీసీసీఐ రూ.955 కోట్లు (116 మిలియన్ అమెరికన్ డాలర్లు) నష్టపోనుంది.
2023 వన్డే వరల్డ్కప్ ఈవెంట్ నుంచి ఐసీసీ సుమారు రూ.4400 కోట్ల ఆదాయం ఆశిస్తోంది. ప్రసార హక్కుల రెవెన్యూ నుంచి ప్రభుత్వం 21.8 శాతం పన్ను వేస్తోంది. దీన్ని 10.92 శాతానికి తగ్గించేందుకు బీసీసీఐ ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వం ఒకవేళ పన్ను శాతాన్ని 10.92 శాతానికి కుదిస్తే అప్పుడు బోర్డుపై పడే భారం రూ.430 కోట్లకు తగ్గనుంది. 2016-23 ఐసీసీ రెవెన్యూలో బీసీసీఐ వాటా రూ.3336 కోట్లు. పన్ను మినహాయింపు లేకుంటే, రూ.955 కోట్లను బీసీసీఐకి ఇవ్వాల్సిన వాటా నుంచి ఐసీసీ జమ చేసుకుంటుంది.