Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అందరూ ఊహించినట్టే సెలక్టర్లు మహ్మద్ షమికి ఓటేశారు. గాయంతో స్టార్ పేసర్ జశ్‌ప్రీత్ బుమ్రా ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు దూరం కాగా, అతడి స్థానంలో సీనియర్ పేసర్ మహ్మద్ షమిని ఎంపిక చేశారు. చివరగా 2021 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో పొట్టి ఫార్మాట్లో కనిపించిన షమి.. మళ్లీ టీ20 ప్రపంచకప్‌లోనే భారత్‌కు పునరాగమనం చేయనున్నాడు. గత మూడు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న మహ్మద్ షమి మెగా సమరంలో బుమ్రా లేని లోటు పూడ్చుతాడేమో చూడాలి!.
- బుమ్రా స్థానంలో ఎంపిక
- స్టాండ్‌బైగా సిరాజ్, శార్దుల్
నవతెలంగాణ-ముంబయి
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు మహ్మద్ షమి ఎంపికయ్యాడు. స్ట్రెస్ ఫ్రాక్చర్ గాయంతో దూరమైన జశ్‌ప్రీత్ బుమ్రా స్థానంలో మహ్మద్ షమిని భారత జట్టులోకి ఎంపిక చేసినట్టు బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ శుక్రవారం తెలిపింది. స్టాండ్‌బై పేసర్లుగా మహ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్లను సైతం ఎంపిక చేసింది. ఈ మేరకు శుక్రవారం బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. తొలుత టీ20 ప్రపంచకప్ జట్టులో స్టాండ్‌బై పేసర్‌గా ఎంపికైన మహ్మద్ షమి.. పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రాకు గాయంతో జట్టులోకి వచ్చాడు. స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో టీ20 సిరీస్‌లో ఆడాల్సిన మహ్మద్ షమి గాయంతో ఈ రెండు సిరీస్‌లకు దూరమయ్యాడు. బెంగళూర్‌లోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ నిరూపించుకున్న మహ్మద్ షమి.. బుమ్రా స్థానంలో ప్రపంచకప్ జట్టులో చోటు సాధించాడు.
బీసీసీఐ సమాచారం ప్రకారం, మహ్మద్ షమి ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకున్నాడు. అక్టోబర్ 17న ఆతిథ్య ఆస్ట్రేలియాతో తొలి వార్మప్ మ్యాచ్‌కు జట్టు సెలక్షన్‌కు మహ్మద్ షమి అందుబాటులో ఉంటాడని బోర్డు తెలిపింది. బ్రిస్బేన్ (గబ్బా)లో భారత్ రెండు వార్మప్ మ్యాచులు ఆడనుంది. 17న ఆస్ట్రేలియాతో, 19న న్యూజిలాండ్‌తో అధికారిక వార్మప్ మ్యాచుల్లో తలపడనుంది. ఇక దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌తో పాటు మంచి ప్రదర్శన చేసిన శార్దుల్ ఠాకూర్ సైతం ప్రపంచకప్‌కు స్టాండ్‌బై ప్లేయర్లుగా ఎంపికయ్యారు. మహ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్‌లో త్వరలోనే ఆస్ట్రేలియాకు పయనం అవుతారని బోర్డు తెలిపింది.
అందుకే షమి! : అక్టోబర్ 3న జశ్‌ప్రీత్ బుమ్రా ప్రపంచకప్‌కు అందుబాటులో ఉండటం లేదని అధికారికంగా వెల్లడించారు. ఆ సమయానికి బుమ్రా కోలుకునేందుకు ఆరు వారాల సమయం అవసరం. మూడు వారాల్లోపు కోలుకునే అవకాశం ఉంటే.. బుమ్రానే జట్టుతో పాటు తీసుకెళ్లేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేసింది. కానీ, ఆ పరిస్థితులు లేకపోవటంతో బుమ్రా స్థానంలో మరో బౌలర్‌ను ఎంపిక చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఆస్ట్రేలియాలో గతంలో ఆడిన అనుభవం, టీ20 ప్రపంచకప్ ఒత్తిడి పరిస్థితుల్లో చవిచూసిన ఆటగాడు జట్టులో ఉండటం మంచిదని జట్టు మేనేజ్మెంట్ భావించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌లు మహ్మద్ షమి వైపు మొగ్గుచూపారు. ఆస్ట్రేలియాకు పర్యటించిన పలు భారత జట్లలో షమి సభ్యుడు. అక్కడ రెండు టెస్టు సిరీస్ విజయాలు సహా 2015 వన్డే వరల్డ్‌కప్‌లో ఆడాడు. వరల్డ్‌కప్‌లో షమి అత్యధిక వికెట్లు కూల్చిన జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత పేసర్లు భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, హార్దిక్ పాండ్యలతో కలిసి మహ్మద్ షమి పేస్ విభాగంలో కీలక పాత్ర పోషించనున్నాడు.
గత మూడు నెలల్లో మహ్మద్ షమి ఎటువంటి క్రికెట్ ఆడలేదు. ఆసియా కప్ జట్టుకు ఎంపిక కాలేకపోయిన షమి.. ఆ తర్వాత స్వదేశంలో రెండు సిరీస్‌లకు జట్టులోకి వచ్చినా ఫిట్నెస్ సమస్యతో దూరమయ్యాడు. కోవిడ్-19 నుంచి కోలుకున్న అనంతరం జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ ఆరంభించాడు. నిజానికి, గత ఏడాది కాలంగా మహ్మద్ షమి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో ఆడలేదు. చివరగా 2021 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లోనే కనిపించిన మహ్మద్ షమి.. ఆ తర్వాత భారత టీ20 జట్టులో చోటు నిలుపుకోలేదు. 2021 టీ20 ప్రపంచకప్‌లో 8.84 ఎకానమీతో ఆరు వికెట్లు పడగొట్టాడు. కానీ ఆ తర్వాత ఐపీఎల్లో షమి అదరగొట్టాడు. టైటిల్ విన్నర్స్ గుజరాత్ టైటాన్స్ తరఫున అద్భుత ప్రదర్శన చేశాడు. 20 వికెట్లతో గుజరాత్ టైటాన్స్ చాంపియన్స్‌గా నిలువటంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ సీజన్లో 16 మ్యాచుల్లో ప్రాతినిథ్యం వహించిన మహ్మద్ షమి పవర్‌ప్లేలో 11 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో 6.62 ఎకానమీతో ఉత్తమ బౌలర్‌గా నిలిచాడు. కానీ డెత్ ఓవర్లలో షమి ఎకానమీ 9.63 కావటం కాస్త ఆందోళనకరం!. ప్రపంచకప్ జట్టులో బుమ్రా స్థానం కోసం షమితో దీపక్ చాహర్ గట్టిగా పోటీపడ్డాడు. కానీ వెన్నునొప్పి గాయంతో అతడు ప్రస్తుతం ఎన్సీఏలో ఉన్నాడు. దీంతో షమికి లైన్ క్లియర్ అయ్యింది. ఇతర స్టాండ్‌బై ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోరు, దీపక్ చాహర్‌లు ఆస్ట్రేలియాకు బయల్దేరలేదు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించిన జట్లు ఐసీసీ అనుమతి అవసరం లేకుండా అక్టోబర్ 15 వరకు జట్టులో మార్పులు చేర్పులు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఆ తర్వాత ఏమైనా మార్పులకు ఐసీసీ అనుమతి తప్పనిసరి కానుంది.
భారత ప్రపంచకప్ జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వెంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్, మహ్మద్ షమి.
స్టాండ్‌బైలు : శ్రేయస్ అయ్యర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్, రవి బిష్ణోరు.