Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మరో పొట్టి ప్రపంచకప్‌కు వేళాయే. 2021 ఐసీసీ టీ20 ప్రపంచకప్ ముగిసిన ఏడాది కాలంలోనే మరో పొట్టి ప్రపంచకప్ అభిమానులను అలరించేందుకు ముస్తాబవుతోంది. 2022 టీ20 ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా వేదికగా నిలువనుంది. 16 జట్లు పోటీపడుతున్న ఈ ప్రపంచకప్‌లో సూపర్12 దశ నుంచి సిసలైన ధమాకా షురూ కానుండగా.. నేటి నుంచి తొలి రౌండ్ పోటీలు ఆరంభం కానున్నాయి. డిఫెండింగ్ చాంపియన్, ఆతిథ్య ఆస్ట్రేలియా టైటిల్ నిలుపుకునేందుకు ఎదురుచూస్తుండగా.. 15 ఏండ్ల సుదీర్ఘ విరామం అనంతరం పొట్టి ప్రపంచకప్‌ను భారత్‌కు తీసుకొచ్చేందుకు రోహిత్‌సేన రంగంలోకి దిగుతోంది.
- ఐసీసీ టైటిల్ వేటలో 16 జట్లు
- నేటి నుంచి టీ20 ప్రపంచకప్
నవతెలంగాణ-మెల్బోర్న్
మరో ధనాధన్ ధమాకా!
బిగ్‌బాష్ లీగ్, ఐపీఎల్, పిఎస్ఎల్, సిపిఎల్, బిపిఎల్, ది హండ్రెడ్.. ఇలా ఏడాది పొడవునా టీ20 టోర్నీమెంట్లు అలరిస్తూనే ఉన్నాయి. మరో రెండు మూడు కొత్త గ్లోబల్ టోర్నీలు రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో, టీ20 టోర్నీలకు మొనగాడు ఐసీసీ టీ20 ప్రపంచకప్ వచ్చేసింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఇప్పటి వరకు ఏడు సార్లు నిర్వహించారు. ఇప్పుడు ఎనిమిదో సీజన్‌కు ముస్తాబైంది. 2021 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. 15 ఏండ్లలో ఎనిమిదోసారి జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో 2007లో తొలి చాంపియన్‌గా భారత్ నిలిచింది. తొలి టోర్నీలో ఆడిన దినేశ్ కార్తీక్, రోహిత్ శర్మ, షకిబ్ అల్ హసన్, సీన్ విలియమ్స్‌లు తాజా వరల్డ్‌కప్‌లోనూ కనువిందు చేయనున్నారు. 2007లో భారత్ వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకోగా.. 2009లో పాకిస్థాన్, 2010లో ఇంగ్లాండ్, 2012, 2016లో వెస్టిండీస్, 2014లో శ్రీలంక చాంపియన్లుగా నిలిచాయి. ఆస్ట్రేలియా డిఫెండింగ్ చాంపియన్.
కంగారూ గడ్డపై తొలిసారి
ఆస్ట్రేలియాలో ఐసీసీ టీ20 ప్రపంచకప్ నిర్వహించటం ఇదే ప్రథమం. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌లు 1992, 2015లకు ఆస్ట్రేలియా వేదికగా నిలిచింది. 2020 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు ఆసీస్ ఆతిథ్యం ఇవ్వాల్సింది. కానీ కోవిడ్-19 పరిస్థితుల నేపథ్యంలో సాధ్యపడలేదు. దీంతో 2020 ప్రపంచకప్ హక్కులను ఐసీసీ 2020 టీ20 వరల్డ్‌కప్ రూపంలో మళ్లీ ఆస్ట్రేలియాకు అందించింది. అక్టోబర్ 16న తొలి రౌండ్ పోటీలతో టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది. నవంబర్ 16న మెల్బోర్న్లో ఫైనల్‌తో ముగియనుంది. మెల్బోర్న్, హౌబర్ట్, సిడ్నీ, పెర్త్, బ్రిస్బేన్, ఆడిలైడ్లు ప్రపంచకప్ ఆతిథ్య నగరాలు.
రెండు అంచెల్లో..!
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022 సైతం గత టోర్నీ తరహాలోనే జరుగుతుంది. 16 జట్లు వరల్డ్‌కప్ కోసం పోటీపడుతున్నాయి. తొలి రౌండ్లో ఎనిమిది జట్లు పోటీపడనున్నాయి. ఈ రౌండ్ నేటి నుంచి అక్టోబర్ 21 వరకు ఉంటుంది. గ్రూప్-ఏలో నెదర్లాండ్స్, శ్రీలంక, యుఏఈ, నమీబియాలు ఉండగా.. గ్రూప్-బిలో ఐర్లాండ్, వెస్టిండీస్, స్కాట్లాండ్, జింబాబ్వేలు చోటుచేసుకున్నాయి. ప్రతి గ్రూప్ నుంచి టాప్-2లో నిలిచిన జట్లు సూపర్12 దశకు చేరుకుంటాయి. సూపర్ 12కు నేరుగా 8 జట్లు అర్హత సాధించాయి. గ్రూప్-1లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, అఫ్గనిస్థాన్‌లు ఉండగా.. గ్రూప్-2లో బంగ్లాదేశ్, భారత్, పాకిస్థాన్, అఫ్గనిస్థాన్‌లు నిలిచాయి. అక్టోబర్ 22న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మ్యాచ్‌తో సూపర్12 సమరం షురూ కానుంది.
వరుస ఏడాదిలో ఎందుకు?
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021లోనే ముగిసింది. మళ్లీ ఇప్పుడు 2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్ హంగామా మొదలైంది. ప్రతి రెండేండ్లకు ఓసారి జరగాల్సిన పొట్టి ప్రపంచకప్‌కు ఏడాది వ్యవధిలోనే ఎందుకు జరుగుతుంది?. 2007లో తొలి ప్రపంచకప్ అనంతరం 2009లో జరుగగా.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, వన్డే వరల్డ్‌కప్‌ల నేపథ్యంలో 2010లోనే మళ్లీ టీ20 ప్రపంచకప్ నిర్వహించారు. దీంతో పాకిస్థాన్ ఒక్క ఏడాదే పొట్టి ప్రపంచకప్ చాంపియన్‌గా కొనసాగింది. ఇప్పుడు ఆస్ట్రేలియా సైతం 2021లో విజేతగా నిలిచి.. ఏడాది పాటే ఆ ఆనందం ఆస్వాదించింది. 2018లో ఐసీసీ క్యాలెండర్లో పొట్టి ప్రపంచకప్ కనిపించలేదు. ద్వైపాక్షిక సిరీస్‌ల నేపథ్యంలో ఇతర దేశాలకు కేటాయించలేదు. దక్షిణాఫ్రికాలో నిర్వహించే ఆలోచన ఉన్నప్పటికీ.. ఆ దేశ క్రీడా శాఖ ఐసీసీ ఈవెంట్ల నిర్వహణకు సఫారీ క్రికెట్ బోర్డుకు అనుమతి ఇవ్వలేదు. 2019లో వన్డే వరల్డ్‌కప్ అనంతరం.. 2020, 2021లో టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ చేశారు. కానీ కోవిడ్-19తో 2020 వరల్డ్‌కప్ నిర్వహించలేదు. 2021లో భారత్ టీ20 వరల్డ్‌కప్‌ను నిర్వహించగా, 2022లో ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తోంది.
15 ఏండ్ల నిరీక్షణ ముగిసేనా?
2007లో తొలి ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న టీమ్ ఇండియా.. ప్రపంచ పొట్టి క్రికెట్ స్వరూపం మార్చివేసింది. ప్రస్తుతం ప్రాంఛైజీ క్రికెట్‌కు నాంది 2007 ప్రపంచకప్ విజయమే. 2014లో భారత్ ఫైనల్స్‌కు చేరినా.. శ్రీలంక చేతిలో పరాజయం పాలైంది. 2016 స్వదేశంలో సెమీఫైనల్లోనే కథ ముగిసింది. 2021లో గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. 15 ఏండ్ల సుదీర్ఘ విరామానికి ముగింపు పలుకుతూ 2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్ సాధించాలనే సంకల్పంతో భారత్ కనిపిస్తోంది. పొట్టి కప్పు వేటలో భారత్ అవకాశాలు మెరుగ్గానే కనిపిస్తున్నాయి.