Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నమీబియా చేతిలో అనూహ్య ఓటమి
- ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022
పొట్టి ప్రపంచకప్ సంచలనంతో మొదలైంది. ఆసియా కప్ చాంపియన్ శ్రీలంకకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. పసికూన నమీబియా చేతిలో ఆసియా విజేతలకు గర్వభంగం. ఐసీసీ టీ20 ప్రపంచకప్ రేసును నమీబియా సంచలన విజయంతో ఆరంభించింది. శ్రీలంకపై 55 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది.
గీలాంగ్ (ఆస్ట్రేలియా) : ప్రపంచ మేటి జట్లు భారత్, పాకిస్థాన్‌లను యుఏఈలో అలవోకగా ఓడించిన లంకేయులు.. ఆస్ట్రేలియా గడ్డపై పొట్టి ప్రపంచకప్ తొలి రౌండ్లో హాట్‌ఫేవరేట్‌గా కనిపించారు. కానీ, తొలి మ్యాచ్‌లోనే శ్రీలంకకు ఊహించని షాక్ ఎదురైంది. పసికూన నమీబియా చేతిలో శ్రీలంక అనూహ్య పరాజయం చవిచూసింది. 164 పరుగుల ఛేదనలో శ్రీలంక 108 పరుగులకే కుప్పకూలింది. నమీబియా బౌలర్లు సమిష్టిగా చెలరేగటంతో 19 ఓవర్లలోనే లంకేయుల కథ ముగిసింది. కెప్టెన్ దశున్ శనక (29, 23 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), భానుక రాజపక్స (20, 21 బంతుల్లో 2 ఫోర్లు) ఓటమి అంతరాన్ని తగ్గించగలిగారు. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 163 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. జాన్ ఫ్రేలింక్ (44, 28 బంతుల్లో 4 ఫోర్లు), స్మిత్ (31 నాటౌట్, 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో కదం తొక్కారు. జాన్ ఫ్రేలింక్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. గ్రూప్-ఏలో శ్రీలంకపై విజయంతో నమీబియా రెండు పాయింట్లు సాధించింది. సూపర్12 దశకు చేరుకునేందుకు ఓ అడుగు ముందుకేసింది.
చేతులెత్తేసిన శ్రీలంక : 164 పరుగుల లక్ష్యం. ఆసియా కప్ అనంతరం ఎవరైనా.. శ్రీలంకకు ఇదేమీ పెద్ద విషయం కాదనే అనుకుంటారు!. ఎందుకంటే, ఆసియా కప్‌లో ఛేదనల్లో శ్రీలంక అసమాన విజయాలు నమోదు చేసింది. చిన్న జట్టే కదా అన్ని తేలిగ్గా తీసుకున్నారేమో ఏమో.. మూల్యం చెల్లించుకున్నారు. నమీబియా బౌలర్లలో డెవిడ్ విసే (2/16), బెర్నార్డ్ (2/18), బెన్ షికాంగో (2/22), జాన్ ఫ్రేలింక్ (2/26)లు వికెట్ల వేటలో చెలరేగారు. శ్రీలంక బ్యాటర్లలో ఎవరూ క్రీజులో నిలువలేదు. నిశాంక (9), మెండిస్ (6), ధనంజయ డిసిల్వ (12), గుణతిలక (0)లు తేలిపోయారు. భానుక రాజపక్స, ధశున్ శనక మాత్రమే 34 పరుగుల భాగస్వామ్యంతో ఆశలు రేకెత్తించారు. వానిందు హసరంగ (4), చామిక కరుణరత్నె (5), ప్రమోద్ మధుశన్ (0), దుష్మంత చమీరా (8)లు విఫలమయ్యారు. 19 ఓవర్లలో 108 పరుగులే చేసిన శ్రీలంక 55 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ పరాజయంతో సూపర్ 12కు చేరుకునే అవకాశాలను శ్రీలంక సంక్లిష్టం చేసుకుంది. యుఏఈ, నెదర్లాండ్స్‌లపై భారీ విజయాలు నమోదు చేస్తేనే.. శ్రీలంక తొలి రౌండ్ గండం నుంచి గట్టెక్కగలదు.
ఫ్రేలింక్ ఫటాఫట్ : తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా అద్భుతంగా రాణించింది. ఆసియా విజేత శ్రీలంకతో మ్యాచ్‌లో నమీబియాపై ఎవరినీ ఎటువంటి అంచనాలు లేవు. అయినా, నమీబియా అండర్డ్యాగ్ ట్యాగ్‌ను గొప్పగా సద్వినియోగం చేసుకుంది. నమీబియా జట్టులో ప్రధానం చెప్పుకోవాల్సింది.. జాన్ ఫ్రేలింక్, స్మిత్‌లు ఏడో వికెట్‌కు 70 పరుగులు భాగస్వామ్యం జోడించటమే. డెత్ ఓవర్లలో స్మిత్, ఫ్రేలింక్లు బౌండరీల మోత మోగించటంతో నమీబియా భారీ స్కోరు నమోదు చేసింది. శ్రీలంక బౌలర్లు తమ ప్రణాళికలకు అనుగుణంగా బౌలింగ్ చేయలేదు. ప్రణాళికలు మారటంతో ఫలితం సైతం మారక తప్పలేదు. ఈటన్ (20), ఎరాస్మస్ (20)లు సైతం రాణించారు. శ్రీలంక బౌలర్లలో ప్రమోద్ మధుశన్ (2/37) రెండు వికెట్లు తీసుకోగా.. తీక్షణ, చమీరా, కరుణరత్నె, హసరంగలు తలా ఓ వికెట్ ఖాతాలో వేసుకున్నారు. 14.2 ఓవర్లలో 93/6తో ఉన్న నమీబియా.. ధనాధన్ మెరుపులతో 20 ఓవర్లలో 163 పరుగుల భారీ స్కోరు నమోదు చేసి ఔరా అనిపించింది. ఇన్నింగ్స్ చివరి బంతికి ఫ్రేలింక్ వికెట్ కోల్పోయినా.. అప్పటికే నమీబియా విజయానికి సరిపడా స్కోరు సాధించేసింది.
సంక్షిప్త స్కోరు వివరాలు :
నమీబియా ఇన్నింగ్స్ : 163/7 (జేన్ ఫ్రేలింక్ 44, స్మిత్ 21, ప్రమోద్ 2/37, మహీశ్ తీక్షణ 1/23)
శ్రీలంక ఇన్నింగ్స్ : 108/10 (దశున్ శనక 29, భానుక రాజపక్స 20, డెవిడ్ 2/16, బెర్నార్డ్ 2/18)